అమ్మ బ్యాంబోయ్! | tree house apartments in Beijing | Sakshi
Sakshi News home page

అమ్మ బ్యాంబోయ్!

Aug 10 2016 2:22 AM | Updated on Aug 18 2018 8:37 PM

మేకుల్లేవ్... స్క్రూలు లేవ్.. అంతా వెదురే! అన్నంతస్తుల బ్యాంబూ ఇల్లు.

మేకుల్లేవ్... స్క్రూలు లేవ్.. అంతా వెదురే! అన్నంతస్తుల బ్యాంబూ ఇల్లు. అయినా ఇల్లంటే... ఇటుకలుండాలి. సిమెంటు వాడాలి. ఉక్కు కడ్డీలతో స్తంభాలు కట్టాలి. కాంక్రీట్‌తో పైకప్పు వేయాలి. ఇదీ మనకు తెలిసిన ఇల్లు! కానీ బీజింగ్ నిర్మాణ సంస్థ పెండా ఇవేమీ లేకుండానే ఇల్లు కట్టేస్తానంటోంది. కనీసం మేకులు, స్క్రూలు కూడా ముట్టుకోకుండా కట్టేస్తుందట. ఎలా అంటారా? వెదురు బొంగులు, తాళ్లూ మాత్రమే వాడుతూ! ఏదో ఒకట్రెండు ఇళ్లు మాత్రమే కాదు... ఒకదానిమీద ఒకటిగా అపార్ట్‌మెంట్ల తరహాలో కావల్సినన్ని అంతస్తుల్లో ఈ వెదురు ఇళ్లను కట్టేస్తాం అంటోంది పెండా.

స్టీల్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ బలమైన (బరువు ఆధారంగా) వెదురును కావాల్సిన రీతిలో అటూ ఇటూ వంచేయవచ్చునన్నది తెలిసిందే. ఎనిమిది వెదురు గడలను ఒక పద్ధతి ప్రకారం అమర్చడం ద్వారా ఈ ట్రీహౌస్ తాలూకూ స్తంభాలు సిద్ధమవుతాయి. అవసరమైనన్ని స్తంభాలను ఏర్పాటు చేసుకుని నిర్మాణాన్ని మొదలుపెడతారు. ఈ స్తంభాల్లోని వెదురు గడలు అన్ని దిక్కుల్లోనూ ఉంటాయి కాబట్టి.. మనకు అవసరమైన దిక్కులో మరికొన్ని గడలను చేర్చి తాళ్లతో బంధించడం ద్వారా నిర్మాణాన్ని విస్తరించవచ్చు. ఒక్కో అంతస్తూ 13 అడుగుల ఎత్తు ఉంటుందట.

అవసరాన్ని బట్టి అంతస్తులను ఎక్కువ చేసుకోవచ్చు. లోపలి భాగాన్ని చిన్న చిన్న రూములుగా, ఇళ్లుగా, రెస్టారెంట్లు, మీటింగ్‌హాల్స్‌గా వేర్వేరు అవసరాల కోసం వాడుకోవచ్చు. దాదాపు 20 ఇళ్లు ఉన్న ఓ కాంప్లెక్స్‌ను ఒకట్రెండేళ్లలో నిర్మిస్తామని, 2023 నాటికల్లా కనీసం 20 వేల మంది నివసించగల వెదురు అపార్ట్‌మెంట్ల నగరాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని అంటోంది పెండా. అమ్మ ‘బ్యాంబో’య్... భలే ఉంది కదూ! కాంక్రీట్ జంగిల్‌ను వదిలేసి మనం కూడా ఇలాంటి హరిత నివాసాలను నిర్మించుకుందామా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement