డబ్బులు తిరిగిస్తా.. తీసుకోండి!

Take your money  Says Vijay Mallya in London Court - Sakshi

బ్యాంకులను మరోసారి వేడుకున్న విజయ్‌ మాల్యా

లండన్‌: నాలుగేళ్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ తనతో అసంబద్ధంగా వ్యవహరిస్తున్నాయని పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యా ఆరోపించారు. భారత్‌లోని బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టారన్న ఆరోపణలకు సంబంధించి మాల్యాను భారత్‌కు అప్పగించడంపై గురువారం లండన్‌లోని హైకోర్టులో వాదనలు జరిగాయి. విమానయాన రంగం లో చోటు చేసుకున్న ప్రతికూల పరిణామాలకు తాను బలయ్యానని, అంతేతప్ప బ్యాంకు రుణాలు తీసుకోవడంలో దురుద్దేశాలేవీ లేవని మాల్యా కోర్టుకు తెలిపారు.

మాల్యాను విచారించేందుకు అవసరమైన అన్ని ఆధారాలున్నాయని భారత్‌ తరఫున క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ వాదించింది.  అనంతరం కోర్టు వెలుపల మాల్యా మీడియాతో మాట్లాడారు. ‘మీ డబ్బులు మీరు తీసుకోండి అని ఒకవైపు బ్యాంకులను కోరుతున్నా. అలా కుదరదు.. మాల్యా ఆస్తులపై మాకు అధికారం ఉంది అని ఈడీ చెప్తోంది. అంటే, ఒకే ఆస్తులకు సంబంధించి ఒకవైపు ఈడీ, మరోవైపు బ్యాంకులు పోరాడుతున్నాయి. నాలుగేళ్లుగా ఇదే తీరు’ అని మండిపడ్డారు. ‘చేతులు జోడించి బ్యాంకులను వేడుకుంటున్నా. మీరు ఇచ్చిన రుణం మొత్తం మీరు తీసుకోండి. నిజానికి కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తరఫున తీసుకున్న రుణం  అది. అయినా కూడా బాధ్యతగా భావించి చెల్లిస్తానంటున్నా’ అని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top