ఇవాంకా.. ఇంకొన్ని ఆసక్తికర సంగతులు.. | Sakshi
Sakshi News home page

ఇవాంకా.. ఇంకొన్ని ఆసక్తికర సంగతులు..

Published Thu, Nov 23 2017 12:27 AM

some interesting things about Ivanka Trump - Sakshi

బిల్, హిల్లరీ క్లింటన్‌ల కూతురు చెల్సీ ఇవాంకాకు చిన్ననాటి స్నేహితురాలు. అందుకే 2008లో హిల్లరీ డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరాక్‌ ఒబామాతో పోటీపడుతున్నపుడు... హిల్లరీకి ఎన్నికల విరాళమిచ్చారు ఇవాంకా. ఎనిమిదేళ్లు తిరిగేసరికి అదే హిల్లరీ 2016లో ఆమె తండ్రికి అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా నిలిచారు. మహిళా సాధికారత, ఆడపిల్లల చదువు కోసం నిరంతరం తపించే వ్యక్తిగా, వ్యాపారవేత్తగా ఇవాంకాకు పేరు. డొనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన నాటినుంచి ఇవాంకా, ఆమె భర్త జేర్డ్‌ కుష్నర్‌లు ఆయన ప్రచార బృందంలో కీలక వ్యక్తులయ్యారు. ట్రంప్‌ నోటికి అదుపు ఉండదు. మహిళలపై ఆయన వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ హిల్లరీ, మీడియా హంగామా చేసేవి. మహిళలను చులకన చేస్తూ ట్రంప్‌ మాట్లాడిన టేపులూ ప్రచారపర్వంలో బయటకు వచ్చాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ప్రతిసారీ ఇవాంకా ఆయన్ను సమర్థించారు. తండ్రిపై విమర్శలను తిప్పికొట్టారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి
కుటుంబ రియల్‌ఎస్టేట్‌ వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ఇవాంకా... ట్రంప్‌ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ (కొనుగోళ్లు, అభివృద్ధి విభాగాలు)గా ఎదిగారు. సోదరులు డొనాల్డ్‌ జూనియర్, ఎరిక్‌ ట్రంప్‌లతో కలిసి ట్రంప్‌ హోటల్స్‌ను స్థాపించారు. వాషింగ్టన్‌లోని చారిత్రక ఓల్డ్‌ పోస్ట్‌ ఆఫీసును 1,300 కోట్ల రూపాయలతో లగ్జరీ హోటల్‌గా మలచడంలో, మియామీలోని డొరల్‌ గోల్ఫ్‌ రిసార్ట్‌ను 1,600 కోట్ల రూపాయలతో ఆధునీకరించడంలోనూ ఇవాంకా ముఖ్యభూమిక పోషించారు. తండ్రి డొనాల్డ్‌ ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయ వ్యక్తుల్లో ఒకరిగా ఎదిగారు.

మరోవైపు సొంత వ్యాపారం...
ట్రంపు గ్రూపులో పనిచేస్తూనే ఇవాంకా సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. 2007లోనే వజ్రాలను అమ్మే సంస్థ గోల్డ్‌ డైమండ్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో ఇవాంకా ట్రంప్‌ ఫైన్‌ జ్యుయెలరీ సంస్థను ప్రారంభించారు. అందమైన మోడల్‌గా, టీవీ వ్యాఖ్యాతగా, ట్రంప్‌ కుటుంబ సభ్యురాలిగా తనకున్న సెలబ్రిటీ హోదాను పూర్తిగా సద్వినియోగం చేస్తూ ఇవాంకాట్రంప్‌ బ్రాండ్‌ను 2011లో ప్రారంభించారు. ఖరీదైన వస్తువులను వాడలేని... మధ్యతరగతి మహిళల, ఉద్యోగాలు చేస్తున్న మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవాంకాట్రంప్‌ వ్యాపారంలో ముందుకు దూసుకెళ్లారు. బూట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, దుస్తులు, గృహా అలంకరణ సామాగ్రి, ఫ్యాషన్‌ జ్యుయెలరీ, పెర్‌ఫ్యూమ్‌లు, చిన్న పిల్లల బెడ్డింగ్‌... తదితరాలను ఇవాంకాట్రంప్‌ బ్రాండ్‌ పేరిట అమ్ముతున్నారు. ఇవాంకాట్రంప్‌.కామ్‌ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌ తదితర ఆన్‌లైన్‌ స్టోర్లలోనూ ఇవాంకా బ్రాండ్‌ వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అమెరికా, కెనడాలతో పాటు బహ్రయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలలో ఇవాంకా జ్యుయెలరీ షోరూంలు ఉన్నాయి.

పెళ్లి కోసం మతం మార్పు...
ఇద్దరికీ మిత్రులైన కొద్దిమంది ద్వారా ఇవాంకా 2005లో రియల్టర్‌ జేర్డ్‌ కుష్నర్‌ను మొదటిసారి కలుసుకున్నారు. మూడేళ్లు డేటింగ్‌ చేశాక సంప్రదాయ యూదులైన కుష్నర్‌ తల్లిదండ్రుల అభ్యంతరాలతో వీరు విడిపోయారు. అయితే... ఇవాంకా యూదు మతం స్వీకరించి మరీ 2009లో కుష్నర్‌ను వివాహమాడారు. డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు నిర్ణయానికి పూర్తి మద్దతు ఇచ్చారు. కుష్నర్, ఇవాంకాలకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు.

స్కూల్లో ఉండగానే మోడలింగ్‌...
డొనాల్డ్‌ ట్రంప్‌కు, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన మోడల్‌ ఇవానా (మొదటి భార్య)లకు రెండో సంతానంగా ఇవాంకా ట్రంప్‌ అక్టోబరు 30, 1981లో జన్మించారు. ఇవాంకాకు పదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోగా... ఆమె తండ్రి వద్ద పెరిగింది. చదువును నిర్లక్ష్యం చేయనని తల్లిదండ్రులను ఒప్పించి మరీ 14 ఏళ్ల వయసులో మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టింది. వారాంతాల్లో, సెలవుల్లో టామీ హిల్‌ఫిగర్, ససాన్‌ జీన్స్‌ బ్రాండ్లకు మోడల్‌గా చేసింది. 1997లో సెవంటీన్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజీపై కనిపించింది. అదే ఏడాది మిస్‌ టీన్‌ యూఎస్‌ఏ పోటీకి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అందాల రాశిగా గుర్తింపు వచ్చినా... తర్వాతికాలంలో ఇవాంకా మోడలింగ్‌ను వదిలేసి పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. పెన్సిల్వేనియా యూనివర్శిటీకి చెందిన వార్టన్‌ స్కూలు నుంచి 2004లో అర్ధశాస్త్రంలో పట్టభద్రురాలైంది. ఫ్రెంచి భాష బాగా వచ్చు. తండ్రి వ్యాఖ్యాతగా పనిచేసిన అప్రెంటిస్‌ సిరీస్‌లో సీజన్‌ 5లో ఆమె జడ్జి సహాయకురాలిగా చేసింది. తర్వాతి సీజన్‌లో ప్రాథమిక బోర్డురూమ్‌ జడ్జిగా వ్యవహరించింది. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక... అనుభవం కోసం దాదాపు రెండేళ్లు బయటి సంస్థలో ఏడాదికి 50 వేల డాలర్ల వేతనానికి పనిచేసింది.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement
Advertisement