
ఉధృతంగా ప్రవహిస్తున్న సీనే నది
పారిస్, ఫ్రాన్స్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు వరద ముప్పు పొంచి ఉంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో నగరం గుండా వెళ్తున్న సీనే నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో వందల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ప్రమాదం జరిగితే ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని రోడ్లను ముందు జాగ్రత్తగా మూసివేశారు. సీనే నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటం ప్రజలను ఆందోళనలో పడేస్తోంది. మంగళవారం నది ఉప్పొంగి నీరు రోడ్లపైకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
విస్తారంగా కురిసిన వర్షాల కారణంగానే వరద ముప్పు వాటిల్లిందని పారిస్ అధికారులు వెల్లడించారు. సగటు వర్షపాతం ఈ ఏడాది సాధారణం కన్నా రెండు రెట్లు ఎక్కువగా నమోదైనట్లు చెప్పారు. వరద సంభవిస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యూజియం ‘లోవ్రో’లోకి కూడా నీరు వెళ్తుందని తెలిపారు.