ఆ బంగారు నాణేల గుట్టు విప్పగలరా? | Sakshi
Sakshi News home page

ఆ బంగారు నాణేల గుట్టు విప్పగలరా?

Published Wed, Feb 17 2016 8:31 AM

Reward offered for decoding ancient gold coins

చాంగ్షా: చైనాలోని హునాన్ ప్రావిన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో బయటపడిన ఆరు విదేశీ బంగారు నాణేలపై ఉన్న లిపిని తెలియజేస్తే భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. ప్రపంచంలోని ఎక్కడివారైనా ఆ నాణేలపై ఉన్న భాషను గుర్తించి వివరించవచ్చు. జినిషి నగరంలని ది కల్చరల్ రెలిక్స్ బ్యూరో 1960లో జరిపిన తవ్వకాల్లో ఓ గాజుకుండను గుర్తించింది. అందులో ఆరు నాణేలు ఉన్నాయి. అయితే, ఆ నాణేల వెనుక ఏదో తెలియని లిపిలో అక్షరాలు రాసి ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు ఇప్పటికే ఆ దేశంలోని పురాతన భాష లిపి నైపుణ్యవాదులు ఎంతో ప్రయత్నించారు.

కానీ, వాటిపై ఏం రాసి ఉందన్న విషయం ఇప్పటి వరకు తమ దేశంలో ఎవరివల్లా కాలేదు. దీంతో 1980లో వాటిని అక్కడే ఉన్న మ్యూజియంలో భద్రపరిచారు. ఎంతోమంది ఆ నాణేలపై ఉన్న ఆ లిపి ఏమిటి అని పరిశీలించేందుకు వచ్చి అర్ధం కాక తలలు పట్టుకొని వెళ్లారు. అసలు ఇంతకు ఎందుకు చైనీయులు ఆ నాణేలపై ఉన్న భాషను గుర్తించాలని అనుకుంటున్నారంటే.. అవి తమ దేశ తొలి దశ సంస్కృతికి చెందిన పునరావశేషాలు అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు.

భారత్తో పోల్చినప్పుడు గ్రీక్ పద్దతిని అనుసరిస్తూ ఢిల్లీ సుల్తానుల పరిపాలన కాలంలో వీటిని తయారు చేసి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ది కల్చరల్ రెలిక్స్ బ్యూరో డైరెక్టర్ పెంగ్ జియా మాట్లాడుతూ'ఆ నాణేలపై అత్యంత అరుదుగా కనిపించే అరబిక్ పద్ధతిలో ఓ రాజు పేరు రాసి ఉందని అర్థమవుతుంది. కానీ అది ఏమిటనేది డీకోడ్ చేయడంలో విఫలమవుతున్నాం. ఇప్పటికే చైనా, ఇతర విదేశీ నిపుణులను కలిశాను. కానీ ఫలితం రాలేదు. ఈ నాణేలపై ఉన్న ఆ లిపిని గుర్తించిన వారికి పది వేల చైనా యువాన్లు(1500 డాలర్లు) ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.లక్షకు పైగా చెల్లిస్తాం' అని ఆయన చెప్పారు.  

Advertisement
Advertisement