‘బెంగాల్‌ టైగర్‌’కు మూడు పిల్లలు

Rare White Bengal Tiger Cubs Make Their Debut At Austrian Zoo - Sakshi

ఆస్ట్రియా: కాకుల కావ్‌కావ్‌లు కానరావట్లేదు. కోకిల కిలకిలలు తగ్గిపోయాయి. పాలపిట్ట జాడైనా తెలియరావట్లేదు. పక్షులే కాదు జంతువులూ ఈ కోవలోకే వస్తున్నాయి. మనిషి తన స్వార్థానికి చేస్తున్న విధ్వంస రచన వల్ల అనేక జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందులో భాగంగానే ఎన్నో జంతువులు ఇప్పటికే అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేరాయి. అందులో ‘బెంగాల్‌ టైగర్‌’ మొదటి స్థానంలో ఉంది. అంతరించిపోతున్న జంతువులను కాపాడుకోవడానికి భారత్‌తో పాటు ఇతర దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రియాలోని కెర్నాఫ్‌ జూ సంరక్షణలో ఉన్న పదమూడేళ్ల ఆడపులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకొస్తున్న జూ సిబ్బంది పులిపిల్లలు పుట్టిన నెలన్నర తర్వాత వాటిని సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు.

జూ అధికారి రేయినర్‌ ఎడర్‌ మాట్లాడుతూ.. పదమూడేళ్ల ముసలి వయసులో ఒక పులి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం తమకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించిందన్నారు. పుట్టినప్పుడు అవి ఒక్కోటి కిలో బరువు ఉండగా ఇప్పుడు దాదాపు నాలుగు కేజీల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. హెక్టార్‌, పాషా, జీయస్‌ అని వాటికి నామకరణం కూడా చేశారు. ఈ జూలో ఇప్పుడు పులిపిల్లలు వచ్చి చేరడంతో జూకి కొత్త అందం వచ్చినట్టయింది. దీంతో కెర్నాఫ్‌ జూ మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా మారింది. ఒక ఏడాది తర్వాత ఈ పిల్లలను వేరే జూకి దత్తత ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అక్కడి అధికారులు. భారతదేశంలో ఎక్కువగా ఉండే ఈ జాతి పులుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2500కు పడిపోయిందని వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ అనే వెబ్‌సైట​ అంచనా వేసింది. మరోవైపు ఈ పులిపిల్లలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి ముచ్చట పడిపోతున్న జంతు ప్రేమికులు ‘బెంగాల్‌ టైగర్‌ వారసులొచ్చాయి’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top