
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పాకిస్తాన్- కెనడియన్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త తారీక్ ఫతా మరోసారి నవ్వుల పాలయ్యారు. ఫేక్ వీడియో పోస్టు చేసి నెటిజన్ల చేతికి చిక్కారు. అసలు విషయమేమిటంటే... పాకిస్తాన్‌కు చెందిన ఓ తల్లి తన పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అనుమతించలేదని పేర్కొంటూ తారీక్ ఓ వీడియో షేర్ చేశారు. ‘‘ పోలియో వర్కర్ల ముఖం మీద ఓ పాకిస్తాన్ తల్లి తలుపులు వేసేసింది. ఇద్దరు మహిళా కార్యకర్తలపై కేకలు వేసింది. తన పిల్లలకు పోలియో చుక్కలు వేయనిచ్చే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పింది’ అని పాక్‌లోని పరిస్థితుల గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తారీక్ ట్వీట్‌పై స్పందించిన పాకిస్తాన్ హీరోయిన్ మేవిష్ హయత్ ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
‘‘ఈ రెండు వాక్యాలు రాసినందుకు ధన్యవాదాలు. అయితే ఒక్కవిషయం గుర్తుపెట్టుకోండి. ఏదైనా వీడియోను షేర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అది నా సినిమా.. ‘ లోడ్‌వెడ్డింగ్’లోని సన్నివేశం. అందులో నేను పోలియో వర్కర్‌గా నటించాను. నాపై అరుస్తున్న మహిళ కూడా నటే. మా సినిమాలో పోలియో చుక్కల ఆవశ్యకతపై అవగాహన కల్పించాం. దేవుడి దయ వల్ల మా నటనకు మంచి మార్కులు పడ్డాయి’ ’ అని మేవిష్ ట్వీట్ చేశారు. అయితే అంతకుముందే తారీక్ తన పోస్టును తొలగించినప్పటికీ.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెటిజన్లు ఆయనను విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
కాగా పాకిస్తాన్ సంతతికి చెందిన తారీక్ ఫతా కెనడాలో జీవిస్తున్నారు. ముస్లిం ఇండియన్ కాంగ్రెస్‌ను స్థాపించి.. దానికి అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. గే హక్కుల కోసం పోరాడే తారీక్... షరియా చట్టాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. ‘పాకిస్తాన్‌లో పుట్టిన భారతీయుడిని నేను.. ఇస్లాంలో జన్మించిన పంజాబీని నేను’ అని తనను తాను పరిచయం చేసుకునే ఆయన.. పాకిస్తాన్ వామపక్ష విద్యార్థి సంఘాల్లో కీలక పాత్ర పోషించారు. సంప్రదాయ ముస్లిం వర్గాలను వ్యతిరేకించి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేసింది. దీంతో తొలుత సౌదీ అరేబియాకు వెళ్లిన తారీక్.. ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు.
Thank u for giving ur 2 cents on this but pls first verify the source b4 posting next time. It’s a scene frm my movie”loadwedding”,the polio worker is me & that woman an actress.Through the film we were raising awareness of the issue.Glad 2 see our performances were so convincing https://t.co/ididoJJcxL
— Mehwish Hayat TI (@MehwishHayat) January 15, 2020