పాకిస్థాన్లోని పెషావర్ సైనిక్ స్కూలు ఆపరేషన్ జర్బే అజబ్ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఆర్మీ మట్టుబెట్టింది.
పాకిస్థాన్లోని పెషావర్ సైనిక్ స్కూలు ఆపరేషన్ జర్బే అజబ్ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో నలుగురు ఉగ్రవాదులు తమను తాము పేల్చుకుని చనిపోయారు.మిగిలిన ఇద్దరిని పాకిస్తాన్ ఆర్మీ మట్టుబెట్టింది. మొత్తం ఉగ్రవాదులంతా ఆత్మాహుతి దళానికి చెందినవారే. మరోవైపు ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి సంఖ్య 160కి చేరింది. వీరిలో 125మంది వరకు విద్యార్థులున్నారు. మరో 122 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ విద్యార్థులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. పలు ఆసుపత్రుల్లో గాయపడిన వారికి చికిత్స జరుగుతోంది. పిల్లలను నిలబెట్టి తలలపై కాల్చినట్టు తెలుస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే, చిన్న పిల్లల జోలికి పోకుండా కేవలం పెద్ద పిల్లలనే టార్గెట్ చేయమని తమ వారికి చెప్పినట్టు తాలిబన్ అధికార ప్రతినిధి తెలిపాడు. వాస్తవానికి చిన్నపిల్లలు కూడా దాడిలో గాయపడ్డారు. ఉత్తర వజీరిస్థాన్‌లో సైనిక చర్యలకు ప్రతీకారంగా ఈ దారుణానికి తెగబడినట్టు ఉగ్రవాదులు చెప్పారు. స్కూలును చుట్టుముట్టిన భద్రతాదళాలు ఆరుగురు తాలిబన్లనూ హతమార్చారు. ఈ దుశ్చర్యను జాతీయ విషాదంగా పేర్కొన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, మూడ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. పెషావర్‌లో ఆయన సైనిక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ దాడిని భారత ప్రదాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దాడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్నెట్‌లో తాలిబన్ల దాడిని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.