ఐరాసకు ఆ హక్కు లేదు

Myanmar's massacre of Rohingya men - Sakshi

యాంగాన్‌: తమ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఐక్యరాజ్యసమితికి లేదని మయన్మార్‌ సైనిక ప్రధానాధికారి మిన్‌ అంగ్‌ స్పష్టం చేశారు. రొహింగ్యా మారణకాండపై చర్చించేందుకు ఐరాస సర్వప్రతినిధి సభ సమాయత్తమవుతుండగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత ఏడాది ఆగస్టు నుంచి మయన్మార్‌ సైనికుల అత్యాచారాలు, దాడులు, గృహ దహనాలకు భీతిల్లిన రొహింగ్యా ముస్లింలు లక్షలాదిగా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్నారు.

మయన్మార్‌ సైనిక మారణకాండపై ఐరాస నిజ నిర్ధారణ కమిటీ ఒక నివేదిక రూపొందించింది. సైనికాధికారి మిన్‌ అంగ్‌ సహా మయన్మార్‌ అగ్రశ్రేణి సైనికాధికారులపై అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో విచారణ చేపట్టా ల్సిందిగా కోరింది. దీంతోపాటు సైనికాధికారులు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మానాలంది. ఈ నివేదికపై స్పందించిన మిన్‌ అంగ్‌ వ్యాఖ్యలను సైన్యం నడిపే వార్తాపత్రిక ప్రచురించింది..‘ఏ దేశానికి గానీ, సంస్థకు గానీ మరో దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు, నిర్ణయాలు తీసుకునే హక్కు లేవు. ఇటువంటి చర్యలు అపార్థాలకు దారి తీస్తాయి’ అని తెలిపారు. నోబెల్‌ బహుమతి గ్రహీత అంగ్‌ సాన్‌ సూకీ నేతృత్వంలో బర్మాలో ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటికీ సైన్యమే కీలకంగా ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top