అంతరిక్షం అంచుల నుంచి.. ధ్వని కంటే వేగంగా! | Much faster than the sound from the edges of space ..! | Sakshi
Sakshi News home page

అంతరిక్షం అంచుల నుంచి.. ధ్వని కంటే వేగంగా!

Oct 26 2014 3:23 AM | Updated on Sep 2 2017 3:22 PM

అంతరిక్షం అంచుల నుంచి.. ధ్వని కంటే వేగంగా!

అంతరిక్షం అంచుల నుంచి.. ధ్వని కంటే వేగంగా!

ఆకాశం నుంచి కిందికి దూకడంలో గూగుల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు సరికొత్త రికార్డు సృష్టించారు. అంతరిక్షం అంచుల దాకా బెలూన్‌తో వెళ్లి.

వాషింగ్టన్: ఆకాశం నుంచి కిందికి దూకడంలో గూగుల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు సరికొత్త రికార్డు సృష్టించారు. అంతరిక్షం అంచుల దాకా బెలూన్‌తో వెళ్లి.. అక్కడి నుంచి ధ్వని కంటే వేగంగా కిందికి దూకేశారు! గూగుల్ నాలెడ్జి విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన 57 ఏళ్ల అలెన్ యూస్టేస్ ఈ ఘనత సాధించారు. స్ట్రాటోస్పియర్ పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఆయన ఈ స్కైడైవింగ్ చేశారు. తొలుత పెద్ద బెలూన్‌కు వేలాడుతూ నిమిషానికి వెయ్యి అడుగుల చొప్పున రెండున్నర గంటలపాటు పైకి ప్రయాణించిన అలెన్ 1.35 లక్షల అడుగుల (41 కిలోమీటర్లు) ఎత్తులో స్ట్రాటోస్పియర్ చివరికి చేరుకున్నారు. అక్కడ అరగంట పాటు అంతరిక్షాన్ని, భూ వాతావరణం అందాలను చూస్తూ గడిపారు. ఆ తర్వాత బెలూన్ నుంచి విడిపోయారు.

వెంటనే ఓ చిన్న రాకెట్‌లాంటి మాడ్యూల్ మండుతూ అలెన్‌ను వేగంగా కిందికి తోసింది. దీంతో.. ధ్వని కంటే వేగంగా.. అంటే సెకనుకు 340.29 మీటర్ల వేగాన్ని మించి 90 సెకన్ల పాటు కిందికి దూసుకొచ్చారు. ఉపరితలానికి 18 వేల అడుగుల ఎత్తులోకి రాగానే పారాచూట్‌ను విప్పుకొని నెమ్మదిగా నేలపై వాలిపోయారు. న్యూమెక్సికోలోని రాస్‌వెల్ వద్ద నిర్వహించిన ఈ స్కైడైవింగ్‌కు పారగన్ స్పేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సాంకేతిక సహకారం అందించింది. నేలకు సురక్షితంగా చేరుకున్న తర్వాత ఆనందంతో తబ్బిబ్బయిపోయిన అలెన్.. ‘అక్కడి నుంచి అంతరిక్షం నలుపును చూశాను. తొలిసారిగా వాతావరణం పొరలను చూశాను. చాలా అద్భుతంగా, అందంగా ఉంది’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. కాగా, ఇంతకుముందు అత్యధిక ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన రికార్డు ఆస్ట్రియన్ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ పేరు మీద ఉంది. ఆయన కూడా న్యూమెక్సికో నుంచే 2012లో 38.969 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని స్కైడైవింగ్ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement