బ్రహ్మోస్‌ క్షిపణికి చైనా సవాల్‌..!

Indian Supersonic Cruise BrahMos Can Be Challenged By Hd 1 Missile - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌, రష్యాలు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బ్రహ్మోస్‌ క్షిపణిని ఎదుర్కొనే సామర్థ్యం చైనా తయారు చేసిన హెచ్‌డీ‌-1 క్రూయిజ్‌ క్షిపణికి ఉందని ఆ దేశానికి చెందిన మైనింగ్‌ కంపెనీ ‘గ్వాంగ్‌డాంగ్‌ హోంగ్డా బ్లాస్టింగ్‌’ వెల్లడించింది. ఎయిర్‌ షో చైనా-2018 కార్యక్రమంలో సదరు కంపెనీ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. గ్లోబల్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. అక్టోబర్‌లో టెస్టింగ్‌ పూర్తి చేసుకున్న హెచ్‌డీ-1 క్షిపణి 2.2 నుంచి 3.5 మాక్‌ నెంబర్‌ వేగంతో దూసుకెళ్లి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 2,200 కిలోల బరువుతో.. సముద్ర మట్టానికి అత్యల్పంగా 5-10 మీటర్ల ఎత్తులో, అత్యధికంగా 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలుగుతుంది. 

అయిదు నిముషాల్లోనే సిద్ధం..
అయిదు నిముషాల్లో హెచ్‌డీ-1ను సిద్ధం చేయొచ్చని గ్లోబల్‌ టైమ్స్‌ ప్రచురించింది. ఒకే ఒక బటన్‌ను నొక్కడం వల్ల దీనిని ఆపరేట్‌ చేయవచ్చని తెలిపింది. భూ ఉపరితలం, సముద్ర తలం నుంచి దీనిని ప్రయోగించవచ్చు. భూమిపై, సముద్రంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఒక లాంచ్‌ వెహికల్‌పై 6 హెచ్‌డీ-1 మిస్సైల్స్‌ లోడ్‌ చేయవచ్చు. ఒక చోటు నుంచి మరో చోటుకు వీటిని తరలించడం చాలా సులభం. ఇక.. హెచ్‌డీ-1 క్షిపణికి వేరియంట్‌గా హెచ్‌డీ-1ఏ ను కూడా చైనా ఆవిష్కరించింది. హెచ్‌డీ-1ఏను ఫైటర్‌ జెట్లు, బాంబర్ల ద్వారా గాల్లో నుంచి కూడా లాంచ్‌ చేయొచ్చు.

మన బ్రహ్మోస్‌..
బ్రహ్మోస్‌ మధ్య స్థాయి సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి. ఇది గాలి కన్నా దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించి లక్ష్యాల్ని ఛేదిస్తుంది. గాలి, నీరు, భూ ఉపరితలం నుంచి ప్రయోగించచ్చు. మాక్‌ నెంబర్‌ 2.8 నుంచి 3 వేగంతో ప్రయాణించి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 400 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం బ్రహ్మోస్‌ ఛేదించగలుగుతుంది. ఇటీవల దీనిలో వేగాన్ని పెంచారు. మాక్‌ నెంబర్‌ 5 వరకు బ్రహ్మోస్‌ ప్రయాణించగలదు. దాదాపు 2,500 నుంచి 3000 కిలోల బరువు మోయగలవు. వీటికి 8.4 మీటర్ల పొడవుతో 200 నుంచి 300 కిలోల వార్‌హెడ్‌ ఉంటుంది. సముద్ర లక్ష్యాల్ని ఛేదించి యుద్ధ నౌకల్ని చీల్చి చెండాడే క్షిపణుల్లో మనబ్రహ్మోసే ఇప్పటివరకు శక్తిమంతమైనది కావడం విశేషం. 2006లో బ్రహ్మోస్‌ భారత రక్షణ రంగంలోకి అడుగు పెట్టింది. భారత ఆర్మీ, వైమానిక రంగాలకు సేవలందిస్తోంది.

ఓ విశ్లేషకుడి అభిప్రాయం..
బీజింగ్‌కు చెందిన మిలటరీ విశ్లేషకుడు వీ డాంగ్జూ.. హెచ్‌డీ-1పై తన అభిప్రాయాలు వెల్లడించారు. హెచ్‌డీ-1 క్షిపణి బ్రహ్మోస్‌ వెర్షన్లను అధిగమించిందని అన్నారు. ఇది యుద్ధ రంగంలోకి దిగితే శత్రువుల యుద్ధ విమానాలు నేలకూలక తప్పదని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top