
వియత్నాంతో 7 ఒప్పందాలు
భారత్, వియత్నాంల సంబంధాలు మరింత బలపడనున్నాయి. చమురు, గ్యాస్ రంగాల్లో సహకారం, రక్షణ కొనుగోళ్ల కోసం వియత్నాంకు 10 కోట్ల డాలర్ల(రూ. 600 కోట్లు) భారత్ రుణం తదితరాలపై ఇరు దేశాలు ఏడు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.
హనోయ్: భారత్, వియత్నాంల సంబంధాలు మరింత బలపడనున్నాయి. చమురు, గ్యాస్ రంగాల్లో సహకారం, రక్షణ కొనుగోళ్ల కోసం వియత్నాంకు 10 కోట్ల డాలర్ల(రూ. 600 కోట్లు) భారత్ రుణం తదితరాలపై ఇరు దేశాలు ఏడు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. వియత్నాంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండో రోజు పర్యటన సందర్భంగా సోమవారమిక్కడ వీటిపై సంతకాలు జరిగాయి.
ప్రణబ్, వియత్నాం అధ్యక్షుడు ట్రూంగ్ టాన్ సంగ్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రాజకీయ, రక్షణ, భద్రతా రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం పునాదిగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు ఇరుదేశాలు భేటీ అనంతం ఓ ప్రకటనలో తెలిపాయి.
ఆర్థిక, శాస్త్రసాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని, జాయింట్ వెంచర్ల ద్వారా పెట్టుబడులను పెంచాలని, 2020 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 1,500 కోట్ల డాలర్లకు చేర్చాలని సంకల్పించినట్లు పేర్కొన్నాయి. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానం ఉండాలని, ఈ విషయంలో సంబంధిత దేశాలు బలప్రయోగానికి దిగకుండా సంయమనం పాటించాలని చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించాయి. కాగా, ప్రణబ్ హనోయ్‌లోని హోచిమిన్ నేషనల్ అకాడమీ ఫర్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్‌లో భారత అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించి ప్రసంగించారు. కోల్‌కతా నుంచి హనోయ్ వరకు రోడ్డు మార్గ నిర్మాణం త్వరలోనే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్-వియత్నాం ఇతర ఒప్పందాలు..
భారత్ నుంచి రక్షణ సామగ్రి కొనుగోలుకు 10 కోట్ల డాలర్ల రుణంపై మరో ఒప్పందం.ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులకు ఒప్పందం. కస్టమ్స్, యువజన వ్యవహారాలు, నైపుణ్యాల అభివృద్ధి, పశువైద్యంపై అవగాహన ఒప్పందాలు.
అధ్యక్ష భవనంలో గయ బోధి మొక్క..
ప్రణబ్ బీహార్ గయలోని పవిత్ర బోధివృక్షానికి చెందిన అంటుమొక్కను హనోయ్‌లోని అధ్యక్ష భవనంలో వియత్నాం అధ్యక్షుడు సంగ్‌తో కలిసి నాటారు. వియత్నాంలో ఇది రె ండో గయ బోధి మొక్క.