
ఇస్లామాబాద్: భారత వైమానిక దళం మెరుపుదాడులతో తీవ్ర ఇరకాటంలో పడిన పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బుధవారం అణ్వాయుధాల విషయమై చర్చించడానికి.. ఆ దేశంలో అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్‌సీఏ)తో భేటీ కాబోతున్నారు. అణ్వాయుధాల ప్రయోగం, వినియోగం, మోహరింపు, అణ్వాయుధాల పరిశోధన, అభివృద్ధి, వినియోగం.. అవసరాలకు తగినట్టు వాడుకోవడం తదితర వ్యవహారాలన్నింటినీ ఎన్‌సీఏ పర్యవేక్షిస్తుంది.
భారత వైమానిక దాడుల నేపథ్యంలో మంగళవారం సమావేశమైన పాక్ జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌ఏ).. ఎన్‌సీఏ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. అణ్వాయుధాల విషయమై ఎన్‌సీఏతో సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు జరిపి.. పెద్ద ఎత్తున ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.