ట్రంప్‌కు షాక్‌: ట్రావెల్‌ బ్యాన్‌ నిలిపివేత

federal judge blocks trumps travel ban orders - Sakshi

వాషింగ్టన్‌: ట్రంప్‌ యంత్రాంగం పలు ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్‌ బ్యాన్‌కు మళ్లీ చుక్కెదురైంది. తొలి రెండు నోటిపికేషన్‌లను నిలిపివేసిన తరహాలోనే మూడో ఉత్తర్వులనూ హవేలి ఫెడరల్‌ జడ్జ్‌ బ్లాక్‌ చేశారు. గత ఉత్తర్వుల మాదిరే బుధవారం నుంచి అమల్లోకి రానున్న తాజా ట్రావెల్‌ బ్యాన్‌ ఉత్తర్వులు దేశ ప్రయోజనాలకు విరుద్ధమని, ఆరు నిర్థిష్ట దేశాల నుంచి వలసలను నిరోధించడం అమెరికా ప్రయోజనాలకు భంగకరమని జడ్జి డెర్రిక్‌ వాట్సన్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉత్తర్వులు జాతీయత ఆధారంగా వివక్షకు గురిచేయడమేనని పేర్కొన్నారు. 40 పేజీల రూలింగ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో కలకలం రేపింది. జస్టిస్‌ వాట్సన్‌ రూలింగ్‌ ప్రమాదకరమని, ఆయన జారీ చేసిన ఉత్తర్వులు జాతి భద్రతకు ముప్పని వైట్‌ హౌస్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

హోంల్యాండ్‌ సెక్యూరిటీ, రక్షణ, న్యాయ శాఖాధికారులు విస్తృతంగా చర్చించిన మీదట తాజాగా ట్రావెల్‌ బ్యాన్‌ను పకడ్బందీగా రూపొందించామని వైట్‌ హౌస్‌ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా వలస వ్యవస్థ, దేశ భద్రతకు తాజా నియంత్రణలు కనీస భద్రతా ప్రమాణాలని వైట్‌ హౌస్‌ వ్యాఖ్యానించింది. ఈ ఏడాది జనవరి, మార్చిలో ట్రంప్‌ విధించిన రెండు ట్రావెల్‌ బ్యాన్‌లకు పలు కోర్టుల్లో చుక్కెదురవగా, జూన్‌ చివరిలో కొద్దిపాటి మార్పులతో రెండో బ్యాన్‌ ఉ‍త్తర్వుల పాక్షిక అమలుకు సుప్రీం కోర్టు అనుమతించింది. అది కూడా గత నెలలో ముగియడంతో మరికొన్ని దేశాలను జోడిస్తూ మూడో  ట్రావెల్‌ బ్యాన్‌  ఉత్తర్వులను ట్రంప్‌ యంత్రాంగం ఇటీవల వెల్లడించింది.

దీపావళీ వేడుకల్లో ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లోని ఓవల్‌ ఆఫీస్‌లో ఇండో అమెరికన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సభ్యులతో కలిసి ఆయన దీపాలను వెలిగించారు. ఈ వేడుకల్లో ఐరాసలో భారత అంబాసిడర్‌ నిక్కీ హాలీ నిక్కీ హేలీ, సెంటర్‌ ఫర్‌ మెడికేర్‌ అడ్మినిస్ట్రేటర్‌ సీమా వర్మ, యూఎస్‌ ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అజిత్‌ పాయ్‌ తదితర భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. భారత్‌-అమెరికన్‌ కమ్యూనిటీతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో వీడియో పోస్ట్‌ చేశారు ట్రంప్‌. భారత ప్రధాని మోదీతో ఉన్న బలమైన సంబంధాలకు తాను చాలా విలువిస్తున్నానని పేర్కొన్నారు  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన గొప్ప ప్రజలు భారతీయులని ప్రశంసించారు. దీపావళి వేడుకల్లో ట్రంప్‌ కుమార్తె ఇవాంక కూడా పాల్గొన్నారని వైట్‌ హౌస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top