యువతి హత్య.. ఫేస్‌ బుక్‌ సెల్ఫీలో క్లూ | Facebook Selfie Helps to find murder in canada | Sakshi
Sakshi News home page

యువతి హత్య.. ఫేస్‌ బుక్‌ సెల్ఫీలో క్లూ

Jan 18 2018 12:03 PM | Updated on Jul 30 2018 9:16 PM

Facebook Selfie Helps to find  murder in canada - Sakshi

రోజ్‌ ఆంటోయిన్‌(ఎడమ వైపు), గార్గోల్(కుడి వైపు)

ఒట్టావా : కెనడాకు చెందిన ఓ యువతి మద్యం మత్తులో క్షణికావేశంలో స్నేహితురాలిని హత్య చేసింది. పోలీసుల కళ్లుగప్పి హత్య కేసు నుంచి తప్పించుకోవాలనుకుంది. కానీ, సామాజిక మాధ్యమం ఫేస్‌ బుక్‌లో సరదాగా పోస్ట్‌ చేసిన ఓ ఫోటో ఆధారంగా పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. వివరాలు.. రెండేళ్ల కిందట కెనడాలోని సస్కాట్చివాన్ ప్రావిన్స్లోని సస్కాటూన్‌ నగర శివారులోని డంప్‌ యార్డులో బ్రిట్నీ గార్గోల్(18) అనే యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె మెడను ఓ బెల్ట్‌ సహాయంతో ఉరి బిగించి చంపినట్టు పోలీసులు కనుగొన్నారు. యువతి మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు, చివరకు ఫేస్‌ బుక్‌ సహాయంతో నింధితురాలని పట్టుకున్నారు. యువతి హత్యలో మారణాయుధంగా వాడిన బెల్ట్‌, గార్గోల్‌ స్నేహితురాలు చెన్నే రోజ్‌ ఆంటోయిన్‌(21)కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. హత్య జరగడానికి కేవలం కొద్ది గంటల ముందు బ్రిట్నీ గార్గోల్తో ఆంటోయిన్ కలిసి దిగిన ఓ సెల్ఫీ ఫోటోను తన ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. అయితే ఆ ఫోటోలో ఆంటోయిన్‌ ధరించిన బెల్ట్‌, హత్యకు ఉపయోగించిన బెల్ట్‌ ఒక్కటే అని పోలీసుల విచారణలో తేలింది.

'హత్య జరిగిన రోజు రాత్రి ఇద్దరం కలిసి మద్యం సేవించాం. మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. క్షణికావేశంలో నా స్నేహితురాలినే నేనే చంపా' అని ఆంటోయిన్‌ తన నేరాన్ని ఒప్పుకుంది. తాగిన మైకంలో ఆరోజు ఏం జరిగిందో నాకు సరిగ్గా గుర్తుకూడా లేదని పేర్కొంది. 'నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఏం చేసినా నా స్నేహితురాలిని తిరిగి తీసుకురాలేను. ఐ యామ్‌ వెరీ వెరీ సారీ.. ఇది జరగకుండా ఉండాల్సింది' అంటూ ఆంటోయిన్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. బ్రిట్నీ గార్గోల్ హత్య కేసులో ఆంటోయిన్ ను దోషిగా తేల్చిన కోర్టు ఏడేళ్ల కఠినకారాగార శిక్ష విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement