ఇదే ఆఖరి అవకాశం | Donald Trump send final message pakistan | Sakshi
Sakshi News home page

ఇదే ఆఖరి అవకాశం

Oct 7 2017 8:56 AM | Updated on Aug 25 2018 7:52 PM

 Donald Trump send final message pakistan - Sakshi

వాషింగ్టన్‌ : కొంతకాలంగా అమెరికా-పాకిస్తాన్‌ మధ్య సంబంధాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. అందులోనూ చైనాకు పాకిస్తాన్‌ దగ్గరయినప్పటినుంచి పరిణామాల్లో మర్పులు వేగంగా సంభవిస్తున్నాయి. తాజాగా ఉగ్రవాదులకు ఐఎస్‌ఐ, పాక్‌ సైన్యం సహకారమందిస్తోందని అమెరికా ఉన్నతాధికారి రెక్స్‌ టెల్లర్‌సన్‌ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారాయి. ట్రంప్‌ న్యూ ఆఫ్ఘన్‌ పాలసీని పాక్‌ వ్యతిరేకించడంతో తాజాగా అమెరికా చివరి తన చివరి సందేశాన్ని పాక్‌కు పంపేందుకు రెడీ అవుతోంది.

పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక, సైనిక, ఆయుధ సహకారాలను అందించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ సురక్షిత అడ్డగా మారిందని.. ఇది ఇరు దేశాల సంబంధాలకు మంచిది కాదనే అభిప్రాయాన్ని ఆయన వ‍్యక్తం చేసినట్లు అమెరికా రక్షణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి ట్రంప్‌ సందేశంతో వచ్చేవారంలో పాకిస్తాన్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్‌కు ట్రంప్‌ ఇస్తున్న ఆఖరి అవకాశంగా అమెరికా రక్షణ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జేమ్స్‌ మాటిస్‌ పర్యటన తరువాత పాకిస్తాన్‌-అమెరికా సంబంధాల్లో కీలక మార్పులు సంభవించబోతున్నాయని రక్షణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రక్షణ, ఆర్థిక సహకారాలపై ప్రభావం చూపుతుందని పెంటగాన్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. లాడెన్‌కు పాకిస్తాన్‌ అధికార వర్గాలే రక్షణ కల్పించాయిన పెంటగాన్‌ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఇది క్షమించరాని నేరంగానే ట్రంప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోందని పెంటగాన్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా అమెరికాలోని గన్‌ లాబీకే ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న పాకిస్తాన్‌ విదేశాంగ శాఖమంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ చేసిన వ్యాఖ్యలపైనా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లోని తాలిబన్లకు పాకిస్తాన్‌లోని ఐఎస్‌ఐ, సైనికులు, ఉగ్రవాదులు సహాయం అందిస్తున్న విషయం ఇప్పటికే తేటతెల్లం అయిందని అమెరికా స్పష్టం చేసింది. ముఖ్యంగా లష్కరే తోయిబాతో ఐఎస్‌ఐ అంటకాగుతోందని అమెరికా రక్షణ శాఖ వర్గాలు మండిపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement