శ్రీలంకలో ఎమర్జెన్సీ ; అసలు కారణమేంటి?

Confrontation Between Muslim And Buddhists Leads To Emergency in Sri Lanka - Sakshi

భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య టీ20 సిరీస్‌ క్రికెట్‌ పోటీలు ప్రారంభమైన తరుణంలోనే.. శ్రీలంక ప్రభుత్వం దేశంలో పది రోజులపాటు అత్యవసర పరిస్థితిని(ఎమర్జెన్సీ) ప్రకటించింది. దేశంలో పలుచోట్ల బౌద్ధులకు, ముస్లింలకు మధ్య అల్లర్లు చెలరేగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో  ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలకు నూరేళ్లకు పైగా నేపథ్యం ఉంది. మత కల్లోలాలకు కేంద్రస్థానంగా నిలిచిన మధ్య శ్రీలంక నగరం కాండీ సింహళ బౌద్ధులకు పుణ్యస్థలం. 1915లో మొదటిసారి దేశంలో ముస్లింలకూ, మెజారిటీ బౌద్ధులకు మధ్య భారీ స్థాయిలో ఘర్షణలు జరిగాయి. రెండు కోట్ల పది లక్షల జనాభా ఉన్న ఈ ద్వీపంలో 70 శాతానికి పైగా సింహళ బౌద్ధులుండగా, ముస్లింల సంఖ్య పది శాతం.

బౌద్ధ జాతీయవాదం
శ్రీలంకలో బౌద్ధమత ఆధిపత్యం సాధించడానికి జరిగిన ప్రయత్నాల్లో మొదటి నుంచీ ప్రధాన పాత్ర పోషించింది బౌద్ధ సన్యాసులే. ఐరోపా వలస పాలకులు, క్రైస్తవ మత ప్రచారకులు శ్రీలంక ఉనికిని, రూపురేఖలను మార్చేస్తారనే భయాందోళనలు 19వ శతాబ్దంలో వ్యాపించాయి. బౌద్ధ భిక్షువులు థేరవాద బౌద్ధధర్మం పునరుద్ధరణకు నడుంబిగించారు. తర్వాత దేశంలో ఇంగ్లిష్కు బదులు సింహళాన్నే ప్రధాన భాషగా చేయాలనే ఉద్యమం మొదలైంది. ఫలితంగా బౌద్ధ జాతీయవాదం బలపడింది. దేశానికి 1948లో స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగంలో బౌద్ధ ధర్మానికి ప్రత్యేక స్థానం కల్పించారు. గత పదేళ్లలో రాజకీయ పంథాను ఎంచుకున్న బౌద్ధ సన్యాసులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రచారం సాగిస్తున్నారు.

కొన్ని నెలలుగా దేశంలో ముస్లింలతో ఘర్షణ పడుతున్న బౌద్ధ తీవ్రవాద సంస్థ బోడు బాల సేన (బీబీఎస్) కాండీ నగరంలో ముస్లిం వ్యతిరేక ప్రచారంతో మత ఉద్రిక్తలకు కారణమైంది. బాల సేన చేసిన ముస్లిం వ్యతిరేక ప్రచారం ఫలితంగా 2014లో దేశ నైరుతి ప్రాంతంలోని కాలుతారా జిల్లాలోని నాలుగు పట్టణాల్లో బౌద్ధులకూ, ముస్లింలకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ దాడుల్లో నలుగురు మరణించగా, 80 మంది గాయపడ్డారు. ముస్లింల దుకాణాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి. కిందటి జూన్లో, తర్వాత నవంబర్లో దక్షిణ కోస్తా పట్టణం గింతోటాలో సామాజిక మాధ్యమాల ద్వారా విస్తరించిన పుకార్ల ఫలితంగా రెండు వర్గాల మధ్య కొట్లాటలు జరిగాయి. మయన్మార్నుంచి సైనికులు, బౌద్ధ మత తీవ్రవాదుల వేధింపులు తట్టకోలేక శ్రీలంకకు శరణార్థులుగా వచ్చిన రొహింగ్యా ముస్లింలకు ఈ ప్రాంతంలో ఆశ్రయం కల్పించడాన్ని బీబీఎస్వ్యతిరేకిస్తోంది. కొంతకాలం క్రితం ఐక్యరాజ్యసమితి కొలంబోలో రొహింగ్యాల కోసం నడుపుతున్న సహాయ కేంద్రంపై బౌద్ధ సన్యాసులు దాడిచేశారు.

కొలంబోలో బాల సేన స్థాపన
రాజధాని కొలంబోలోని సంబుద్ధ జయంతి మందిర అనే బౌద్ధ సాంస్కృతిక కేంద్రం నుంచి పనిచేస్తున్న బోడు బాల సేనను 2012లో కిరమా విమలజోతి, గలగోద అత్తే జ్ఞానసార అనే ఇద్దరు బౌద్ధ భిక్షువులు స్థాపించారు. దేశంలో సింహళ జాతిని, బౌద్ధ ధర్మాన్ని కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు సేన ప్రచారం చేస్తోంది.బురఖాలు ధరించడం లంక ముస్లిం మహిళల్లో కొత్త సంప్రదాయంగా మారింది. దాదాపు 20 లక్షల మంది ముస్లింలు పశ్చిమాసియా దేశాల్లో పనిచేస్తున్న కారణంగా వారి ఆదాయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. గతంలో లేని ముస్లిం వేషధారణ కనిపించడంతో బీబీఎస్వంటి బౌద్ధ తీవ్రవాద సంస్థలు బురఖాలు నిషేధించాలంటూ ఉద్యమిస్తున్నాయి.

- సాక్షి నాలెడ్జ్సెంటర్

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top