ఆస్పత్రుల్లో నర్సుల తైతక్కలేమిటీ?

British Nurses spark outrage after performing TikTok dance - Sakshi

లండన్‌ : రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్‌ కేసులతో భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలకు కాస్త కాలక్షేపంతోపాటు కాస్త ఆనందాన్ని ఇవ్వాలనుకున్నారేమో పలు ఆస్పత్రులకు చెందిన నర్సులు. వారు తమ చేతుల్లో ఉన్న వైద్య పరికరాలను ఎక్కడివక్కడ వదిలేసి గెంతుకుంటూ వరండాల్లోకి వచ్చి డ్యాన్సులు చేశారు. కొన్ని ఆస్పత్రులకు చెందిన నర్సులు ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు తొడుక్కొని డ్యాన్స్‌ చేయగా, మరో ఆస్పత్రి నర్సులు కేవలం మాస్క్‌లతోనే డ్యాన్స్‌ చేశారు. ఇతర ఆస్పత్రులకు చెందిన నర్సులు మాస్క్‌లు, గ్లౌజులు ఏవీ లేకుండా డ్యాన్స్‌ చేశారు.

కరోనా మహమ్మారి కుమ్మేస్తున్న తరుణంలో పాటించాల్సిన సామాజిక దూరాన్ని కూడా నర్సులు పాటించకుండా డ్యాన్స్‌లు చేయడం పట్ల ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. ఏ క్షణం ఎవరి ప్రాణం పోతుందో తెలియని క్యాన్సర్‌ ఆస్పత్రికి చెందిన నర్సులు కూడా డ్యాన్స్‌లో పాల్గొనడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ‘మీకిదేం పోయేకాలం!’ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. నర్సుల్లో తమ విధుల పట్ల కొత్త ఉత్సాహాన్ని, కొత్త స్ఫూర్తిని నింపాలనే సదుద్దేశంలో ‘ఎన్‌హెచ్‌ఎస్‌ ట్రస్ట్‌’ లండన్, బకింగమ్‌షైర్, లీడ్స్, వోల్వర్‌హంటన్, మిడ్‌లాండ్స్‌ ఆస్పత్రుల్లోని నర్సులతో డ్యాన్స్‌లు చేయించి ఆ వీడియోలను ‘టిక్‌టాక్‌’లో పోస్ట్‌ చేసింది.

ఎన్‌హెచ్‌ఎస్‌ ట్రస్ట్‌ ఆశయం మంచిదే అయినా, సరైన సందర్భం కాకపోవడంతో సోషల్‌ మీడియాతోపాటు ప్రధాన మీడియా ద్వారా ప్రజలు తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘స్కానింగ్‌లు, ఆపరేషన్లు ఆపేసి వచ్చి ఇలా తైతక్కలాడుతున్నారా?’ అంటూ క్యాన్సర్‌ రోగుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

చదవండి: ‘వుహాన్‌’ డైరీలో సంచలన విషయాలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top