జాత్యహంకార వ్యాఖ్యలు.. అయినా అతడే గెలిచాడు!

Airlines Trolled For Inaction Over Racist Incident On Flight - Sakshi

‘నీ చెత్త విదేశీ యాసతో నాకింకా చిరాకు తెప్పించకు. అసలు నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది. నువ్వో అందవిహీనమైన ఆవువి’- మహిళపై ఓ శ్వేత జాతీయుడి జాత్యహంకార వ్యాఖ్యలు

బార్సిలోనా : విమానంలో తను కూర్చున్న సీట్ల వరుసలో నల్ల జాతీయురాలు కూర్చోవడానికి వీల్లేదంటూ ఓ తెల్ల జాతీయుడు రెచ్చిపోయాడు. వృద్ధురాలు అనే విచక్షణ కూడా లేకుండా సదరు మహిళ, ఆమె కూతురిని అసభ్య పదజాలంతో దూషించాడు. శుక్రవారం రేయనార్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే..
మిస్సెస్‌ గేల్‌(77) అనే జమైకన్‌ మహిళ 1960లో బ్రిటన్‌ వచ్చి స్థిరపడ్డారు. శుక్రవారం తన భర్త సంవత్సరికం నిర్వహించి రేయినార్స్‌కు చెందిన ఫ్లైట్‌ ఎఫ్‌ఆర్‌015 అనే విమానంలో బార్సిలోనా నుంచి లండన్‌కు పయనమయ్యారు. వయోభారంతో బాధపడుతున్న మిసెస్‌ గేల్‌కు తోడుగా ఆమె కూతురు కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే ఇద్దరికీ వేరు వేరు చోట్ల సీట్లు కేటాయించడంతో మిసెస్‌ గేల్‌.. ఓ శ్వేత జాతీయుడు ఉన్న సీట్ల వరుసలో కూర్చున్నారు. దీంతో అతడి అహంకారం దెబ్బతింది.

‘నేను కూర్చున్న వరుసలో ఈ నల్ల ******* కూర్చోవడానికి వీల్లేదు. ఇంత వికారమైన మనిషిని నేను చూస్తూ ఉండలేను. నువ్వో అందవిహీనమైన ఆవువి’ అంటూ అసభ్య పదజాలంతో ఆమెను దూషించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె కూతురు వచ్చి.. తన తల్లి పట్ల అమార్యదగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అదే విధంగా మిసెస్‌ గేల్‌ కూడా అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ‘నీ చెత్త విదేశీ యాసతో(ఆమె జమైకా యాసలో ఇంగ్లీష్‌ మాట్లాడుతుండగా) నాకింకా చిరాకు తెప్పించకు. అసలు నిన్ను చూస్తేనే కంపరంగా ఉందంటూ’ మరోసారి రెచ్చిపోయాడు.

అతడికే అదనపు సౌకర్యాలు!
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఫ్లైట్‌ అటెండెంట్‌ గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ వ్యక్తి ఎంతకీ వెనక్కి తగ్గకపోడంతో మిసెస్‌ గేల్‌ను వేరే సీట్లో కూర్చోవాల్సిందిగా కోరాడు. అంతేకాకుండా అప్పటిదాకా రెచ్చిపోయిన శ్వేత జాతీయుడికి అదనపు సౌకర్యాలు కల్పించి అతడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు. కాళ్ల నొప్పులతో బాధ పడుతున్న మిసెస్‌ గేల్‌ ఆమె కూతురి సహాయంతో సీటు మారారు. కాగా ఈ తతంగాన్నంతా డేవిడ్‌ లారెన్స్‌ అనే వ్యక్తి వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో రేయినార్‌ ఎయిర్‌లైన్స్‌పై సోషల్‌ మీడియాలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి.

ఈ విషయం గురించి డేవిడ్‌ లారెన్స్‌ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. విమానంలో అంతగా గొడవ జరుగుతున్నా తోటి ప్రయాణికులు మాత్రం తమకేమీ పట్టనట్లు ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను, మరో వ్యక్తి మిసెస్‌ గేల్‌కి అండగా నిలిచినప్పటికీ న్యాయం చేయలేకపోయామన్నాడు. విమానంలో ఓ నల్ల జాతీయురాలిపై జరిగిన  జాత్యహంకార దాడిని ఆపకుండా, దాడికి పాల్పడిని వాడికే విమాన సిబ్బంది అదనపు సౌకర్యాలు కల్పించడం తనను బాధించిందని పేర్కొన్నాడు. తాను ఈ వీడియోను పోస్ట్‌ చేసిన రెండు రోజుల తర్వాత స్పందించడం చూస్తుంటే ఎయిర్‌లైన్స్‌ ఎంత బాధ్యతగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top