
హెలికాప్టర్ కూలి 21మంది దుర్మరణం
రష్యాలో ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిన ఘటనలో 21మంది దుర్మరణం చెందారు.
మాస్కో: రష్యాలో ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిన ఘటనలో 21మంది దుర్మరణం చెందారు. గాయపడిన మరో ముగ్గురిని ప్రాణాలతో రక్షించారు. క్రస్నోయార్క్ రీజియన్ నుంచి ఉరెంగోయ్ వెళుతున్న హెలికాప్టర్ సైబీరియా యమల్ ద్వీపకల్పంలో ల్యాండ్ అవుతుండగా శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా ఎంఐ-8 హెలికాప్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని సమాచారం. ప్రమాద స్థలి నుంచి రెండు బ్లాక్ బాక్సులను సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
డేటా రికార్డర్, వాయిస్ రికార్డులకు సంబంధించి రెండు బ్లాక్ బాక్సులను స్వాధీనం చేసుకున్నామని, ప్రమాదానికి గురైనప్పుడు కారణాలను గుర్తించేందుకు వాటిని విశ్లేషించాల్సి ఉందని రష్యన్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ ఫెడరల్ ఏజెన్సీ అధికారి వెల్లడించారు. కాగా ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 22మంది ప్రయాణికులు, ముగ్గురు విమానా సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రుల్లో ఒకరు మొబైల్ ఫోన్ ద్వారా ఎమర్జెనీ విభాగానికి సమాచారం ఇవ్వడంతో స్థానిక సహాయ అధికారులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.