
నిర్లక్ష్యానికి భారీ మూల్యం
నాలాలో పేరుకుపోయిన థర్మకోల్‌కు నిప్పంటుకోవడంతో భారీ మంటలు ఎగసిపడ్డాయి. ఆదివారం బాలానగర్ చేపల మార్కెట్ నాలాపై బ్రిడ్జి వద్ద అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో రూ.50 వేల విలువ చేసే చేపలు, ఓ చెప్పుల దుకాణం మంటలకు కాలిపోయాయి.
బాలానగర్, న్యూస్‌లైన్: నాలాలో పేరుకుపోయిన థర్మకోల్‌కు నిప్పంటుకోవడంతో భారీ మంటలు ఎగసిపడ్డాయి. ఆదివారం బాలానగర్ చేపల మార్కెట్ నాలాపై బ్రిడ్జి వద్ద అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో రూ.50 వేల విలువ చేసే చేపలు, ఓ చెప్పుల దుకాణం మంటలకు కాలిపోయాయి. సనత్‌నగర్ ఫైర్‌స్టేషన్ సిబ్బంది సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు పక్కనే ఉన్న మూడు రసాయన గోదాంలకు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఇక్కడి నాలాకు ఇరువైపులా ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు తమ పరిశ్రమల్లో మిగిలిపోయిన థర్మకోల్, ఇతర వ్యర్థాలను నాలాలో వేయడంతో అవి టన్నులకొద్దీ బ్రిడ్జి వద్ద పేరుకుపోయాయి. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ తాగి ఆ పీకను వ్యర్థ పదార్థాలపై వేయడంతో మంటలు అంటుకున్నాయి.
ఈ బ్రిడ్జిని ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్‌పై చేపల దుకాణాలు ఉన్నాయి. పక్కనే పందిర్లతో పాటు సింటెక్స్ ట్యాంకులు, ఆ పక్కనే చెప్పుల దుకాణం ఉన్నాయి. అయితే నిప్పు రాజుకుని ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో అక్కడి దుకాణాల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. దీంతో వారు ప్రాణాలతో బయట పడ్డారు. కాగా, చేపలు, సింటెక్స్ ట్యాంకులు, చెప్పుల దుకాణం మంటలు అంటుకుని కాలిపోయాయి. ఇదిలా ఉండగా మంటలు హైటెన్షన్ వైర్లకు తగలడంతో ఏఈ వెంకటేష్‌గౌడ్ నేతృత్వంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రమాదం జరిగిన చోట ఉన్న మూడు రసాయన గోదాములున్నాయి. వీటికి మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలావుండగా.. సంఘటన ప్రాంతం సనత్‌నగర్, బాలానగర్ పోలీస్ స్టేషన్లకు సరిహద్దులో ఉండటంతో పోలీసులు సంఘటన స్థలానికి రాకపోవడం గమనార్హం.