భూమ్మీద ఏటికేడాదీ పచ్చదనం కరువవుతోందన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ ఈ నష్టం కచ్చితంగా ఎంతమేరకు ఉందన్నది మాత్రం అస్పష్టం.
హైదరాబాద్: భూమ్మీద ఏటికేడాదీ పచ్చదనం కరువవుతోందన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ ఈ నష్టం కచ్చితంగా ఎంతమేరకు ఉందన్నది మాత్రం అస్పష్టం. అయితే వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ జరిపిన తాజా అధ్యయనం ఈ అనుమానాన్ని నివృత్తి చేసింది. సొసైటీ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం గత 20 ఏళ్లలో భూమ్మీద ఉన్న నిర్జన అటవీ ప్రాంతం విస్తీర్ణం దాదాపు 10 శాతం... అంటే 12.7 లక్షల చదరపు మైళ్లు తగ్గింది. ఇది అలస్కా అంత సైజు ఉంటుందని అంచనా.
ఇలా నష్టపోయిన అటవీ ప్రాంతంలో అత్యధికం ఆఫ్రికా, అమెజాన్‌లలోనే ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రస్తుతం భూమ్మీద మనిషి ప్రభావం ఏమాత్రం లేని భూభాగం విస్తీర్ణం 23.2 శాతం మాత్రమేనని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ తెలిపారు. నిర్జన అటవీ ప్రాంతాన్ని మళ్లీ సృష్టించడం అసాధ్యమని, మొక్కలు నాటినంత మాత్రాన అడవులను, వాటిల్లో ఉండే పర్యావరణ వ్యవస్థల పునఃసృష్టి జరగదని ఆయన తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే... ప్రకృతిలో మిగిలి ఉన్న అతికొద్ది నిర్జన ప్రాంతాలనూ కోల్పోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.