జల సిరి దిశగా మరో ముందడుగు | Water is another step towards | Sakshi
Sakshi News home page

జల సిరి దిశగా మరో ముందడుగు

Jan 6 2016 2:52 AM | Updated on Mar 19 2019 6:19 PM

మహానగర దాహార్తిని తీర్చేందుకు రెండు భారీ స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణంలో మరో ముందడుగు పడింది.

♦ రూ.7,600 కోట్లతో ‘గ్రేటర్’ చుట్టూ రెండు భారీ స్టోరేజీ
♦ రిజర్వాయర్ల నిర్మాణం వ్యాప్కోస్ సంస్థకు డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు
♦ రిజర్వాయర్ల నిర్మాణానికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థ రుణం
 
 సాక్షి, హైదరాబాద్: మహానగర దాహార్తిని తీర్చేందుకు రెండు భారీ స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణంలో మరో ముందడుగు పడింది. నగర శివార్లలో నల్లగొండ జిల్లా దేవులమ్మనాగారం(మల్కాపూర్ పరిసరాలు), రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌లలో ఇంటర్నేషనల్ లీడ్ అండ్ ఫైనాన్స్ సెక్యూర్డ్(ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) సంస్థ నుంచి సేకరించనున్న రూ.7,600 కోట్ల రుణంతో భారీ స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణం, ఔటర్ రింగు రోడ్డులోపలున్న గ్రామపంచాయతీల్లో నీటిసరఫరా వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. దీనిపై రూ.1.80 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించే బాధ్యతను వ్యాప్కోస్ సంస్థకు అప్పగించింది. గోదావరి జలాలతో కేశవాపూర్, కృష్ణా జలాలతో దేవులమ్మనాగారం రిజర్వాయర్లను నింపనున్నారు. ఈ రెండు భారీ రిజర్వాయర్లలో వర్షాకాలంలో నిల్వచేయనున్న 40 టీఎంసీల నీటిని విపత్కర పరిస్థితుల్లో ఏడాది పొడవునా నగర తాగునీటి అవసరాలకు వినియోగించవచ్చని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.

 రూ.1,960 కోట్లతో దేవులమ్మనాగారం
 మల్కాపూర్ సరిహద్దుల్లో రూ. 1,960 కోట్ల అంచనా వ్యయంతో దేవులమ్మనాగారం రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ జలాశయంలో పాలమూరు ఎత్తిపోతల, డిండి పథకం ద్వారా కొంతమార్గంలో పంపింగ్.. మరికొంత మార్గంలో గ్రావిటీ ద్వారా 20 టీఎంసీల జలాలను తరలించి నింపనున్నారు.

 రూ.1,660 కోట్లతో కేశవాపురం రిజర్వాయర్
 శామీర్‌పేట్ మండలం కేశవాపురం వద్ద రూ.1,660 కోట్ల అంచనా వ్యయంతో మరో రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ జలాశయంలో గోదావరి మం చినీటి పథకం మొదటి, రెండవ, మూడవ దశల ద్వా రా తరలించనున్న నీటితో ఈ జలాశయాన్ని నింపే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement