
సాక్షి, హైదరాబాద్ : వందేళ్ల ఆనకట్ట... వంద కోట్ల రూపాయలతో కొత్తరూపు సంతరించుకోనుంది. 2020 నాటికి గండిపేట చెరువు ఏర్పడి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ చెరువును అన్నివిధాలా అభి వృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. గండి పేట చెరువు అభివృద్ధికి రూ.100 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు పరిపాలన అనుమతులను ప్రభుత్వం సోమవారం మంజూరు చేసింది.
హెచ్‌ఎండీఏ మార్గదర్శనంలో టూరిజం, రెవెన్యూ, నీటి పారుదల శాఖ, జలమండలి, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ వంటి విభాగాలు ‘గండిపేట చెరువు అభివృద్ధి టాస్క్ ఫోర్స్’గా పనిచేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడూ సరస్సులో నీరు ఉండేలా చేయాలని, పర్యావరణహిత విధానాలను అనుసరిస్తూ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేలా హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
అత్యాధునిక, మెరుగైన విధానాలను అధ్యయనం చేసి చెరువు చుట్టుపక్కల పచ్చదనం ఉండేలా మార్చాలని సూచించారు. ఐకాన్ గ్రీన్ రిక్రియేషనల్ టూరిజం జోన్‌గా మార్చి స్వతహాగా ఆదాయం సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. ‘నీటి నాణ్యతపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి ప్రభావం చూపకుండా గండిపేట చెరువును హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేయాలని పేర్కొంది. వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, రోడ్డు నిర్మాణం, వజ్రాకారంలో ఉండేలా వైర్ ఫెన్సింగ్, వీధి దీపాలు, ఉస్మాన్‌సాగర్ చుట్టుపక్కల 25 కి.మీ పొడవునా ల్యాండ్ స్కేపింగ్ పనులను రూ.100 కోట్లతో చేపట్టనుంది. రివాల్వింగ్ రెస్టారెంట్, కేబుల్ కారు, హౌస్ బోట్లు, నైట్ క్యాంపింగ్ ఏరియాను పీపీపీ పద్ధతిలో లేదంటే లీజు పద్ధతిలో చేపట్టాలని సూచించారు.