గోదా‘వర్రీ’ | Real Estate and urban Development Corporation neglect in godavari water scheme | Sakshi
Sakshi News home page

గోదా‘వర్రీ’

Jan 18 2014 4:01 AM | Updated on Sep 2 2017 2:43 AM

మహానగర వరదాయినిగా పేర్కొంటున్న గోదావరి మంచినీటి పథకాన్ని పూర్తిచేసే విషయంలో కిరణ్ సర్కారు చేతులెత్తేసింది.

ప్రాజెక్టు: గోదావరి మంచినీటి పథకం
 అంచనా వ్యయం: రూ.3800 కోట్లు
                            (రింగ్‌మెయిన్ పనులతో  కలిపి)
 ఇప్పటికి వ్యయం: సుమారు రూ.1800 కోట్లు
 పథకం పూర్తికయ్యే వ్యయం: సుమారు రూ.2000 కోట్లు
 మొదటి దశ పూర్తికావాల్సింది: 2014 ఏప్రిల్ చివరికి
 పైప్‌లైన్ నిర్మాణం: 186 కి.మీ.
 ఇప్పటికి పూర్తయింది: సుమారు 120 కి.మీ.
 తొలి దశలో తరలించే జలాలు: 172 మిలియన్ గ్యాలన్లు
 మూడు దశల్లో తరలింపు: 31 టీఎంసీలు
 ప్రాజెక్టు రూట్: కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి - శామీర్‌పేట్
 నిర్మాణం: మూడు దశల్లో
 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు : ఎల్లంపల్లి, మగ్దూంపూర్, మల్లారం, కొండపాక, ఘన్‌పూర్
 రిజర్వాయర్ల పనుల్లో పురోగతి : 40 శాతమే
 
 సాక్షి, సిటీబ్యూరో: మహానగర వరదాయినిగా పేర్కొంటున్న గోదావరి మంచినీటి పథకాన్ని పూర్తిచేసే విషయంలో కిరణ్ సర్కారు చేతులెత్తేసింది.ఈ పథకానికి అవసరమైన రూ.2 వేల కోట్ల రుణం ఇచ్చేం దుకు హడ్కో (హౌసింగ్ అండ్ అర్భన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) సుముఖంగా ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక శాఖ పూచీకత్తు (కౌంటర్ గ్యారంటీ) ఇవ్వలేమంటూ మొండికేస్తోంది.

 ఏడాది క్రితం పూచీకత్తు ఇస్తామన్న సర్కారు పెద్దలు.. ఇపుడు మాటమార్చడంతో గోదావరి జలాలతో గొంతు తడుపుకొందామనుకున్న సిటీజనుల ఆశలు అడియాసలే అవుతున్నాయి.గత ఆరు నెలలుగా సర్కారు పైసా నిధులు విదల్చకపోవడం, పూచీకత్తు ఇవ్వకపోవడంతో నిధుల లేమి వల్ల ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఇప్పటివరకు పథకం మొదటి దశ పనుల్లో 65 శాతమే పూర్తయ్యాయి. మిగతా పనులు ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి పూర్తికావడం అనుమానమే. సర్కారు తీరుతో జలమండలి లక్ష్యం కాగితాలకే పరిమితమౌతుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.

 మొండి సర్కార్..
 కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివారుల్లోని శామీర్‌పేట్ వరకు 186 కిలోమీటర్ల మేర నిర్మించదలచిన గోదావరి మంచినీటి పథకం  రూ.3800 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఇప్పటివరకు ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1800 కోట్లు ఖర్చుచేసింది. మరో రూ.2 వేల కోట్ల రుణం మంజూరుకు హడ్కో అంగీకరించింది. కానీ రాష్ట్ర ఆర్థిక శాఖ పూచీకత్తు ఇస్తేనే రుణం మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. కానీ మొండి సర్కారు కరుణించడం లేదు.

ఒకవేళ జలమండలి హడ్కో సంస్థ నుంచి రూ.2000 కోట్ల రుణం స్వీకరించిన పక్షంలో నెలకు రూ.20 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ స్థాయిలో వడ్డీ చెల్లించే స్థితిలో బోర్డు లేకపోవడంతో గోదావరి పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సర్కారు తీరు ఇలాగే ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ చివరి లోగా సిటీకి గోదావరి జలాలు రావడం కల్లేనని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.  

 ఎక్కడి గొంగళి అక్కడే..
 2008లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పనుల్లో ఇప్పటివరకు 65 శాతం పనులే పూర్తయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి మొదటి దశను పూర్తిచేసి నగరానికి 172 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించాలన్న లక్ష్యం నెరవేరే పరిస్థితి దరిదాపుల్లో కనిపించడం లేదు. మొత్తం 186 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులకు ఇప్పటివరకు 120 కిలోమీటర్ల మేర పనులు మాత్రమే పూర్తయ్యాయి.

 ఇక ఎల్లంపల్లి, మగ్దూంపూర్, మల్లారం, కొండపాక, ఘన్‌పూర్, శామీర్‌పేట్ రిజర్వాయర్ల పనుల్లో కేవలం 40 శాతమే పూర్తయ్యాయి. ఇప్పటివరకు సుమారు రూ.వెయ్యి కోట్లు బిల్లులు చెల్లించని కారణంగా పనులు చేపట్టిన సంస్థలు పనులు ఆపేశాయి. దీంతో పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

Advertisement
Advertisement