సీట్లు కాపాడుకునేందుకు పాట్లు! | MBBS seats to the recovery problem | Sakshi
Sakshi News home page

సీట్లు కాపాడుకునేందుకు పాట్లు!

Mar 2 2017 2:38 AM | Updated on Oct 9 2018 7:11 PM

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లను కాపాడుకోవడం వైద్య ఆరోగ్య శాఖకు గండంగా మారింది.

నిబంధనలు పాటించకపోవడంతో
తాజాగా కాకతీయ, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీల్లో ఇదే పరిస్థితి


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లను కాపాడుకోవడం వైద్య ఆరోగ్య శాఖకు గండంగా మారింది. ప్రతీ ఏడాది మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) తనిఖీలకు రావడం.. లోపాల కారణంగా సీట్ల పునరుద్ధరణకు తిరస్కరించడం పరిపాటిగా మారింది. 3 నెలల కిందట ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి చెందిన 50 ఎంబీబీఎస్‌ సీట్లు, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీలోని 100 సీట్లను 2017–18 సంవత్సరానికి పునరుద్ధరించడానికి ఎంసీఐ నిరాకరించింది. తాజాగా కాకతీయ మెడికల్‌ కాలేజీలో 50 ఎంబీబీఎస్‌ సీట్లు, కొత్తగా ఏర్పడిన మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీలో 150 సీట్లకు ఎంసీఐ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సీట్ల పునరుద్ధరణకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే నిజామాబాద్, ఉస్మానియాల్లోని ఎంబీబీఎస్‌ సీట్ల అనుమతి కోసం లేఖ రాయగా.. తాజాగా తిరస్కరించిన మహబూబ్‌నగర్, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లోని సీట్ల పునరుద్ధరణకు లేఖ రాయాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ ఆయా కాలేజీ ప్రిన్సిపాళ్లను బుధవారం ఆదేశించారు. వారితో ఆయన సమావేశం నిర్వహించారు. తరచూ ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తుతోందని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మౌలిక వసతులు, సిబ్బంది కొరత వల్లే..
కాకతీయ మెడికల్‌ కాలేజీలో 19.06 శాతం బోధన సిబ్బంది కొరత ఉన్నట్లు గుర్తించారు. వార్డుల్లో వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు గదుల్లేవు. కేంద్ర ప్రయోగశాల లేదు. 150 మంది విద్యార్థులు పరీక్ష రాసే సామర్థ్యమున్న గదుల్లో 250 మందిని కూర్చోబెడుతున్నారు. ఇక మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీలో 30.85 శాతం బోధన సిబ్బంది.. 17.02 శాతం రెసిడెంట్‌ వైద్యుల కొరత ఉంది. నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది కొరత 10.15 శాతం ఉంది. ఐదేళ్ల అనుభవమున్న వారినే మెడికల్‌ సూపరింటెండెంట్‌గా నియమించారు. గతంలో ఉస్మానియా, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీల్లోనూ లేబొరేటరీ, లైబ్రరీ, సిబ్బంది, మౌలిక సదుపాయాల వంటివి లేకపోవడంతో ఎంసీఐ సీట్ల పునరుద్ధరణకు అనుమతి ఇవ్వలేదు. అయితే అప్పట్లో లేఖ నేపథ్యంలో ఎంసీఐ అధికారులు ఉస్మానియా, నిజామాబాద్‌ కాలేజీ సీట్ల పునరుద్ధరణకు అనుమతిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement