 
															నేటి నుంచి నగరంలో హెలీ టూరిజం
న్యూయార్క్ , లండన్ లాంటి నగరాల్లో మాదిరిగా ఇకపై హైదరాబాద్ నగరంలో కూడా పర్యాటకులకు విహంగ విహారం అవకాశం దక్కనుంది.
	హైదరాబాద్: న్యూయార్క్ , లండన్ లాంటి నగరాల్లో మాదిరిగా ఇకపై హైదరాబాద్ నగరంలో కూడా పర్యాటకులకు విహంగ విహారం అవకాశం దక్కనుంది. హెలిక్యాప్టర్ లో ప్రయాణిస్తూ హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, సరస్సులు, ఇతర ఆకర్షణలను తిలకించే సదవకాశం మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నది. ‘హెలిటూరిజం ఇన్ హైదరాబాద్’ అనే కొత్త ఈవెంట్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - ఇండివెల్ ఏవియేషన్ సంయుక్త నిర్వహణలో తెరలేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ ప్రజలు, పర్యాటకులు కూడా ఇకపై హైదరాబాద్ నగరంపై హెలిక్యాప్టర్లో తిరగవచ్చు.
	
	ఈ జాయ్ రైడ్ తొలి రైడ్ ను మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం పది గంటలకు నగరంలోని నెక్లెస్ రోడ్డులో ప్రారంభించనున్నారు. ఒక్కో టూరిస్టుకు రూ.3499 చార్జీగా తీసుకుంటారు. ఒకే సారి నలుగురు టూరిస్టులు ప్రయాణించవచ్చు. నెక్లెస్ రోడ్డు, హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం, హైటెక్ సిటీ, దుర్గం చెరువు తదితర ప్రాంతాలను ఈ జాయ్ ట్రిప్ ద్వారా చుట్టి రావచ్చు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
