కల్యాణలక్ష్మి మార్గదర్శకాల మార్పుతో చిక్కులు | Kalyana Lakshmi scheme in Guidelines changes | Sakshi
Sakshi News home page

కల్యాణలక్ష్మి మార్గదర్శకాల మార్పుతో చిక్కులు

Jul 8 2016 2:46 AM | Updated on Sep 4 2017 4:20 AM

కల్యాణలక్ష్మి మార్గదర్శకాల మార్పుతో చిక్కులు

కల్యాణలక్ష్మి మార్గదర్శకాల మార్పుతో చిక్కులు

కల్యాణలక్ష్మి పథకం మార్గదర్శకాల మార్పుతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు సంబంధించి...

* స్పష్టత లేక లబ్ధిదారుల్లో అయోమయం
* పాత విధానమేమేలంటున్న లబ్ధిదారులు

సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం మార్గదర్శకాల మార్పుతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు సంబంధించి కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనితో పాటు ఈ దరఖాస్తుల పరిశీలన బాధ్యతను కేవలం తహసీల్దార్లకే అప్పగిస్తూ  గతంలోని మార్గదర్శకాలను మార్పు చేయడంతో కొంత గందరగోళం నెలకొంది. తహసీల్దార్లు దరఖాస్తులను పరిశీలించి ఆమోదముద్ర వేయడంలో జాప్యం జరుగుతోంది.
 
మార్గదర్శకాల్లో అస్పష్టత.. గందరగోళం
పాత విధానంలో  నేరుగా వధువు బ్యాంక్ ఖాతాలోకి ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా  రూ.51 వేల మొత్తం జమయ్యేది. ఇప్పుడు దానిని మార్చి పెళ్లి కూతురు తల్లి పేరిట చెక్కును ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో మార్పుచేసింది. ఒకవేళ వధువుకు తల్లి లేని పక్షంలో ఏం చేయాలనే దానిపై స్పష్టత  కొరవడింది. ఇప్పటివరకు అనుసరించిన విధానం బాగానే ఉన్నందున దానిని మార్చాలనే నిర్ణయం సరైందికాదని అంటున్నారు. రాజకీయ జోక్యం పెరిగేలా ప్రజాప్రతినిధులకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను అప్పగిస్తే పరోక్షంగా అవినీతి, అక్రమాలకు ఊతం ఇచ్చినట్లవుతుందని వివిధ సంక్షేమశాఖల అధికారులు అభిప్రాయపడుతున్నారు.
 
ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ ఎలా..
స్థానిక ఎమ్మెల్యేలకు ఎంపిక అవకాశం కల్పించడం వల్ల అనర్హులు లబ్ధిపొందడంతో పాటు, పథకం లక్ష్యాలు దెబ్బతిని .. అవినీతిమయమవుతుందనే హెచ్చరికలు సైతం వస్తున్నాయి. వారానికి ఒకసారి నియోజకవర్గ లేదా మండల కేంద్రంలో ఎమ్మెల్యేల ద్వారా వధువు తల్లికి చెక్కులు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని సవరించిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే కచ్చితమైన తేదీ, సమయమేది నిర్ణయించకపోవడంతో ఎమ్మెల్యేలు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఎక్కడ నుంచి చెక్కులు తీసుకోవాలన్న దానిపై గందరగోళం నెలకొంది.  

అందులోనూ పెళ్లి సమీపిస్తున్నపుడు చెక్కు కోసం సమయం కేటాయించడం కూడా కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 5 నాటికి మొత్తం 55,936 దరఖాస్తులు రాగా, 31,479 దరఖాస్తులు ఇంకా పరిశీలన కోసం పెండింగ్‌లోనే ఉన్నాయి. అందులో బీసీ, ఈబీసీలవే 10,466 కాగా ఇంతవరకు ఒక్కరికి కూడా ఈ పథకం కింద లబ్ధి చేకూరలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement