
మాజీ కాంట్రాక్టర్ దారుణ హత్య
కుషాయిగూడలో శనివారం రాత్రి రైల్వే మాజీ కాంట్రాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు.
► ఒంటిపై 25 కత్తిపోట్లు..
► కుషాయిగూడలో ఘటన
హైదరాబాద్: రాజధానిలోని కుషాయిగూడలో శనివారం రాత్రి రైల్వే మాజీ కాంట్రాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు ఈ హత్యలో పాలుపంచుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. శెట్టిపల్లి గోపాలకృష్ణ (32) కుషాయిగూడ హౌజింగ్ బోర్డుకాలనీలోని నోముల ఎన్‌క్లేవ్ పెంట్‌హౌస్‌లో తన తల్లి జ్యోతితో కలసి నివసిస్తున్నాడు. 2012 నాగ వినీలతో ఈయనకు వివాహం కాగా.. ఇటీవల మనస్పర్థల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. గతంలో గోపాలకృష్ణ రైల్వే కాంట్రాక్టర్‌గా పనిచేశాడు. ఘట్‌కేసర్ సమీపంలో కోళ్ల ఫామ్‌లు నిర్వహించాడు. ఈ రెండు వ్యాపారాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. రుణాలిచ్చిన బ్యాంకర్లు, ఇతర వ్యక్తులు కొంతకాలంగా ఈయనపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు కూడా ఉన్నట్లు సమాచారం. రుణాలను తిరిగి చెల్లించేందుకు ఈయన ఆస్తులు అమ్మకానికి పెట్టినట్లు స్థానికులు అంటున్నారు. ఇంతలో రాత్రి 9 గంటల సమయంలో హత్యకు గురయ్యాడు.
కాపుగాసి.. పిల్లల్ని కిందకు తీసుకెళ్లి..!
దీపావళి నేపథ్యంలో కృష్ణ నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లో పిల్లలు.. ఆ బిల్డింగ్‌పై రాత్రి టపాసులు కాల్చుతున్నారు. ఇంతలో ఒక మహిళతోపాటు మరో ఇద్దరు పెంట్‌హౌజ్‌కు చేరుకున్నారు. హత్య ప్లాన్‌కు పిల్లలు అడ్డువస్తారని భావించి.. టపాసులు ఇప్పిస్తానని ఆ మహిళ పిల్లలను కిందకి తీసుకెళ్లింది. అప్పుడే రాత్రి భోజనం చేసి బయటకు వచ్చిన కృష్ణపై దాడిచేసి 25 కత్తిపోట్లు పొడిచారు. తల్లి బయటికి వచ్చేలోగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కృష్ణ ప్రాణాలు వదిలాడు. నిందితులు అప్పటికే పరారయ్యారు. 15 రోజుల కిందట కూడా దుండగులు కృష్ణ హత్యకు యత్నిం చినట్లు స్నేహితులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.