బోగస్‌పై గురి | Focused on Bogus | Sakshi
Sakshi News home page

బోగస్‌పై గురి

Apr 16 2015 12:27 AM | Updated on May 25 2018 6:12 PM

జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టి బోగస్ ఓట్లపై పడింది. వీటిని ఏరివేసే కార్యక్రమానికి వారు సిద్ధమవుతున్నారు.

ఆధార్‌తో ఎపిక్ అనుసంధానం
జీహెచ్‌ఎంసీ ముమ్మర చర్యలు
ఇంటింటికీ సిబ్బంది
అఖిలపక్ష సమావేశాలకు సన్నాహాలు
వివిధ సంఘాలకు అవగాహన కార్యక్రమాలు

 
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టి బోగస్ ఓట్లపై పడింది. వీటిని ఏరివేసే కార్యక్రమానికి వారు సిద్ధమవుతున్నారు. దీనికోసం ఆధార్‌ను ఉపయోగించుకునే పనిలో పడ్డారు. కొద్దిరోజుల కిందటి వరకూ ఆస్తిపన్ను వసూళ్లలో మునిగితేలిన జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది ఇక ఆధార్‌తో ఓటర్ కార్డుల అనుసంధాన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. గ్రేటర్‌లో జనాభా కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండటంతో డూప్లికేట్, బోగస్ ఓటర్ల ఏరివేతకు అధికారులు సిద్ధమయ్యారు. ఎన్నికల సంఘం నుంచి కూడా ఆదేశాలు రావడంతో గురువారం నుంచి ఆధార్‌తో ఓటర్ కార్డు (ఎపిక్) అనుసంధాన ప్రక్రియలో పాల్గొన బోతున్నారు.

భారీ తేడా...
గత ఏడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే మేరకు గ్రేటర్‌లో 76.41 లక్షల జనాభా ఉండగా... ఓటర్లు మాత్రం 80 లక్షలకు పైగా ఉన్నారు. దీంతో రెండేసి చోట్ల ఓటరు జాబితాలో పేర్లు గల వారు భారీ సంఖ్యలో ఉన్నట్లు అంచనా వేశారు. నగరంలో ఒకచోటు నుంచి మరో చోటుకు మారే వారు కొత్త చిరునామాతో ఓటర్ కార్డులు పొందుతున్నారు. పాత చిరునామాలో వివరాలు  తొలగించకపోవడం.. మరణించిన వారి పేర్లు జాబితాలో ఉండటం వంటి కారణాలతో జనాభా కంటే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగనుండటంతో బోగస్ ఓటర్ల ఏరివేతకు ఆధార్‌తో అనుసంధానం ఉపకరించగలదని భావిస్తున్నారు.

అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ ఈ ఆర్థిక సంవత్సరం పెద్ద ఎత్తున ఉపాధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సిద్ధమైంది. వీటిని నిజంగా అర్హులైన లబ్ధిదారులకే అందించేందుకు ఈ కార్యక్రమం సహకరిస్తుందని భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెలాఖరులోగా ఆధార్‌తో ఎపిక్ కార్డుల అనుసంధానాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.

సమావేశాలతో అవగాహన
ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాలనీ సంఘాలు, యువజన, మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం వల్ల ఇబ్బందులు ఉండవని ప్రజలకు వివరించనున్నారు. స్థానికంగా రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రోజువారీ సమీక్షించేందుకు సర్కిళ్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. వారు ఏరోజుకారోజు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తూ సంబంధిత సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తారు. జోనల్ కమిషనర్లు కూడా ఈ కార్యక్రమాన్ని రోజూ సమీక్షిస్తారు.

ఇంటింటికీ వెళ్లేందుకు బూత్ స్థాయి అధికారులు సరిపడినంతమంది లేని పక్షంలో రిటైర్టు ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటారు. వారికి  ప్రత్యేకపారితోషికం అందిస్తారు. ఈ నెలాఖరులోగా నగరంలోని ఓటర్లందరి ఎపిక్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానించాలనేది లక్ష్యం. ఈ ప్రక్రియలో అలసత్వం వహించరాదని, ఎవరైనా అశ్రద్ధ వహిస్తే ఉపేక్షించేది లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం ఈ అంశంపై జోనల్, డిప్యూటీ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనుసంధానం చేసే నెంబర్లను ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏమరుపాటుకు తావివ్వరాదని స్పష్టత చేశారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా శ్రద్ధ వహించాలని సూచించారు.

ఇలా అనుసంధానం చేసుకోవచ్చు...
ఎస్‌ఎంఎస్ ద్వారా, ఇంటర్‌నెట్ ద్వారా  ప్రజలు స్వయంగానే  అనుసంధానం చేసుకోవచ్చు.  ఎస్‌ఈఈడీఈపీఐసీ(సీడ్‌ఎపిక్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరుగుర్తింపుకార్డు  నెంబరు వేసి స్సేస్ ఇచ్చి ఆధార్‌నెంబరు వేసి 8790499899 నెంబరుకు ఎస్‌ఎంఎస్ చేయాలి.
ఇంటర్‌నెట్ ద్వారా ((http://164.100.132.184/ epic/SelfSeeding.jsp) ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.
ఏవైనా సందేహాలు ఉంటే ప్రజలు జీహెచ్‌ఎంసీ టోల్‌ఫ్రీ నెంబరు 040-21 11 11 11ను సంప్రదించవచ్చు. లేదా ముఖ్య ఎన్నికల అధికారి టోల్‌ఫ్రీ నెంబరు 1950ను సంప్రదించవచ్చు.

ఇంకా..
వివిధ సర్కిళ్లలోని పోలింగ్ బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆధార్ కార్డు నెంబర్లు, ఓటర్ కార్డు నెంబర్లు సేకరిస్తారు. అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో అనుసంధానం చేస్తారు.
ఏ ఇంటికైనా తాళం వేసి ఉంటే అది తెలిసేలా ‘డోర్‌లాక్’ అనే స్టిక్కర్ అంటిస్తారు. ఆ స్టిక్కర్‌పై సంబంధిత బూత్ స్థాయి అధికారి సెల్ నెంబరు ఇచ్చి సంప్రదించాల్సిందిగా సూచిస్తారు.
ప్రజలు సమీపంలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు జిరాక్స్ ప్రతులను అందించడం ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement