‘ఆరా’మ్‌గా చేస్తున్నారు.. | Fees on exploitation, slowing checks in schools | Sakshi
Sakshi News home page

‘ఆరా’మ్‌గా చేస్తున్నారు..

Sep 13 2015 11:55 PM | Updated on Sep 3 2017 9:20 AM

అడ్డూ అదుపూ.. లెక్కాపత్రం లేకుండా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రైవేటు స్కూళ్లలో

ఫీజు దోపిడీపై స్కూళ్లలో నత్తనడకన తనిఖీలు
లోపించిన శాస్త్రీయత, పారదర్శకత
కంటితుడుపు చర్యేనని ఆరోపణలు

 
సిటీబ్యూరో: అడ్డూ అదుపూ.. లెక్కాపత్రం లేకుండా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రైవేటు స్కూళ్లలో తనిఖీలు అటకెక్కాయి. తనిఖీలు కంటితుడుపు చర్యలేనన్న భావన అందరిలో కలుగుతోంది. తనిఖీలు ప్రారంభమై.. 25 రోజులు ముగిసినా ఇంకా కొలిక్కి రాలేదు. తీవ్ర ఒత్తిడులు ఎదురవుతుండడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు నిబంధనలు, విద్యా హక్కు చట్టాన్ని కాలరాసి.. విద్యార్థుల నుంచి కాసులు పిండుకుంటున్నాయి. ఎటువంటి శాస్త్రీయత పాటించకుండా ఏటికేడు ఫీజుల మొత్తాన్ని పెంచుతూ.. వసూలు చే స్తున్నారు. ఈ తతంగంపై ఇప్పటికే ‘సాక్షి’తో సహా పలు పత్రికలు విస్తృతంగా కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. దోపిడీ విషయాన్ని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌పీఏ) సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రతిగా అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. సుప్రీంకోర్టు మెట్లెక్కుతామని హెచ్చరించింది. చివరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జోక్యం చేసుకుని.. స్కూళ్లలో తనిఖీల కోసం కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి విద్యాశాఖ ఇన్‌చార్జి హైదరాబాద్ రీజినల్ జాయింట్ డెరైక్టర్ సుధాకర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు సోమిరెడ్డి, రమేష్‌తోపాటు ఇద్దరు ఆడిటర్లు కమిటీలో సభ్యులు. మొదట నమూనాగా గుర్తించిన పది స్కూళ్ల గుర్తింపు, ఫీజుల వసూలు, బ్యాలెన్స్ షీట్, ఆదాయం, వ్యయం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై అధికారులు లోతుగా తనిఖీలు చేసి.. ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంది.
 
అతీగతీ లేని వైనం..
గత నెల 17వ తేదీన తనిఖీలు మొదలు పెట్టారు. వాస్తవంగా రోజుకో స్కూల్ చొప్పున ఎంచుకుని.. ఈ ప్రక్రియ ముగిస్తామని, ఈనెల 10వ తేదీకల్లా ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేస్తామని కమిటీ సభ్యులు, జంట జిల్లాల డీఈఓలు మొదట్లో పేర్కొన్నారు. నిర్దేశిత గడువు మూడు రోజుల క్రితమే ముగిసింది. ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్లలో తనిఖీలు పూర్తయ్యాయో అధికారులకే తెలియకపోవడం గమనార్హం. కమిటీలో సభ్యులుగా ఉన్న జంట జిల్లాల డీఈఓలు సైతం చెప్పలేకపోతున్నారు. దీంతో నివేదిక అందజేతపై స్పష్టత కొరవడింది. మొన్నటి వరకు హైదరాబాద్ ఇన్‌చార్జి ఆర్‌జేడీగా ఉన్న సుధాకర్ స్థానంలో... ఇటీవల రెగ్యులర్ ఆర్‌జేడీగా కృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఈ మార్పు కూడా తనిఖీలపై ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. కొత్తగా వచ్చిన ఆర్‌జేడీ పూర్తిస్థాయిలో తనిఖీలపై దృష్టి సారించాల్సి ఉంది.
 
కనిపించని పారదర్శకత ..
తనిఖీలు పారదర్శకంగా, పూర్తిస్థాయిలో జరగడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలకు వెళ్లిన ఆడిటర్లకు పూర్తి వివరాలు అందజేయడంలో స్కూళ్ల యాజమాన్యాలు వెనుకంజ వేస్తున్నాయి. ఒక్కో స్కూల్‌లో పది తరగతులు ఉంటే.. కింది స్థాయిలో రెండు లేదా మూడు, పైస్థాయిలో రెండు తరగతులకు సంబంధించిన ఫీజు వివరాలను మాత్రమే చూపుతున్నారని తెలిసింది.

ఈ విషయంపై ఆడిటర్లు సైతం యాజమాన్యాలను ప్రశ్నించలేకపోతున్నారు. తనిఖీలు ఎంత పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అంతేగాక ఒక స్కూల్‌లో 2001లో చేరి ప్రస్తుతం ఐదో తరగతికి చదువుతున్న విద్యార్థికి ఒక ఫీజు, అదే తరగతిలో ఈ ఏడాది చేరిన విద్యార్థి నుంచి మరొక ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాల మధ్య భారీ తేడా ఉన్నట్లు ఆడిటర్లు గుర్తించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement