గాలి మేడలు | Sakshi
Sakshi News home page

గాలి మేడలు

Published Mon, Jul 25 2016 10:41 PM

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం

► అడ్డూ అదుపూ లేకుండా అక్రమ నిర్మాణాలు
► ప్రాణాలు పోయాక హూంకరింపులు
► టౌన్‌ప్లానింగ్‌ విభాగం, బడాబాబుల నడుమ ఒప్పందాలు
► బీపీఎస్, బీఆర్‌ఎస్‌ల దరఖాస్తులే నిదర్శనం
► ఎప్పుడు క్రమబద్ధీకరణ ప్రకటించినా లక్షల్లో దర ఖాస్తులు
► గడువు దాటాక పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు
► ఫిల్మ్ నగర్ ప్రమాదంతో బయటపడుతున్న వాస్తవాలు


సాక్షి, సిటీబ్యూరో : భవనాలు కుప్పకూలినప్పుడు..అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసినప్పుడు మాత్రం అక్రమ భవన నిర్మాణాలపై అధికారులు హూంకరించడం.. హడావుడి చేయడం.. ఆ తర్వాత మరచిపోవడం చర్విత చరణంగా సాగుతున్నది. ఒక్కసారి కాదు.. పలు పర్యాయాలు  ఇదే పునరావృతమవుతుండటంతో  అక్రమార్కులను సహించబోమంటున్న జీహెచ్‌ఎంసీ అధికారుల ఘీంకరింపులకు, ప్రకటనలకు ఎవరూ జడుసుకోవడం లేదు. దాంతో గ్రేటర్‌లో అడ్డూ అదుపూ లేకుండా ‘గాలి మేడలు’ పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం 2008లో అమలు చేసిన బీపీఎస్‌కు, 2015లో అమల్లోకి తెచ్చిన బీఆర్‌ఎస్‌లకు అందిన దరఖాస్తులే ఇందుకు నిదర్శనం.  భవిష్యత్తులో ఇంకెప్పుడూ అక్రమ నిర్మాణాలు సహించబోమని, అదే చివరి అవకాశమని చెబుతూ 2008లో బీఆర్‌ఎస్‌ను అమలు చేసినప్పుడు 2.05 లక్షల దరఖాస్తులొచ్చాయి.  వాటిని పరిష్కరించేందుకే దాదాపు ఐదేళ్లు పట్టింది. ఆ తర్వాత తిరిగి గత నవంబర్‌లో బీఆర్‌ఎస్‌ను అమల్లోకి తెచ్చారు. మళ్లీ పాతపాటే పాడారు. ఇకపై అక్రమ నిర్మాణమన్నదే జరుగకుండా ఉండేందుకు ఇప్పటికే జరిగిన నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు.

ఎప్పుడు బీపీఎస్‌/ బీఆర్‌ఎస్‌లను ప్రకటించినా ఇలా  భారీ సంఖ్యలో అందుతున్న దరఖాస్తులు నగరంలో అడ్డూ అదుపూ లేకుండా అడ్డగోలుగా సాగుతున్న అక్రమ కట్టడాలకు అద్దం పడుతున్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గత సంవత్సరం ప్రకటించిన బీఆర్‌ఎస్‌కు అందిన దాదాపు 1.40 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గత సంవత్సరం అక్టోబర్‌ 28 లోపు నిర్మాణం పూర్తయిన భవనాలకు మాత్రమే తాజా బీఆర్‌ఎస్‌ వర్తించనుండగా,  జీవో వెలువడ్డాక నిర్మించిన లెక్కలేనన్ని భవనాల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు.. నిర్మాణం చేయకుండానే కంప్యూటర్‌లో గ్రాఫిక్‌లు సృష్టించి గాల్లోని మేడలనే నిర్మాణం పూర్తిచేసినట్లు చూపుతూ  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్నాక  ప్రారంభించిన ఇలాంటి నిర్మాణాలు గ్రేటర్‌లోని అనేక ప్రాంతాల్లో నేటికీ కొనసాగుతున్నాయి.

ఇరుగుపొరుగువారు వీటి గురించి ఫిర్యాదులు చేసినా పట్టించుకునకున్న పాపాన పోవడం లేదు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, ఆర్కిటెక్టులు, భవన యజమానుల  పరస్పర ఒప్పందాలతోనే ఈ నిర్మాణాలు  జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. తాజాగా ఇద్దరి మరణానికి కారణమైన ఫిల్‌్మనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో కుప్పకూలిన పోర్టికోను సైతం నిర్మాణం చేపట్టకముందే బీఆర్‌ఎస్‌కింద దర ఖాస్తు చేసుకున్నట్లు అధికారుల తాజా పరిశీలనలో వెల్లడైంది.


ఆది నుంచీ అక్రమాలే...
 ప్రస్తుత పోర్టికో మాత్రమే కాదు.. ఈ సెంటర్‌ పుట్టుకనుంచీ అక్రమాల పర్వమే. ఎలాంటి నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా కట్టిన ఫిల్‌్మనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ను  2007లోని బీపీఎస్‌లో సైతం అధికారులు  క్రమబద్ధీకరించలేదు. 1996లో జీప్లస్‌2 కు అనుమతి పొంది, ఉల్లంఘలనకు పాల్పడి జీప్లస్‌ 3 నిర్మించారు. బిల్టప్‌ ఏరియా సైతం 1270 చ.మీ.లకు మాత్రం అనుమతి పొంది 6188 చ.మీ.ల మేర నిర్మాణం జరిపారు. అప్పట్లో బీపీఎస్‌కు దరఖాస్తుచేసుకోగా మొత్తం పీనల్‌ అమౌంట్‌ కట్టకపోవడం, ఫైర్‌ సర్వీసెస్‌నుంచి ఎన్‌ఓసీ లేకపోవడంతో తిరస్కరించారు. అయినప్పటికీ 2014లో తిరిగి మరోమారు ఎలాంటి అనుమతుల్లేకుండా మళ్లీ నిర్మాణం చేపట్టారు. అనంతరం కోర్టు నుంచి ఇంజెంక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు.

ఇలా వరుసగా అక్రమాలకు పాల్పడటం అలవాటైన నిర్వాహకులు పేరుకు పోర్టికో  అయినప్పటికీ భారీ నిర్మాణానికే పూనుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే అధికారిక పేరు మాత్రం కల్చరల్‌ సెంటర్‌ అయినప్పటికీ, క్లబ్‌గానే సుపరిచితం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మచ్చిక చేసుకోవడం.. అక్రమాలకు పాల్పడటం నిర్వాహకులకు పరిపాటిగా మారింది. దాదాపు ఏడాదిన్నర క్రితం ఈ సెంటర్‌లోని ఫంక్షన్‌హాల్‌ను ఏకంగా మంత్రి కేటీఆర్‌తోనే ప్రారంభోత్సవం చేయించారు. అధికారులెవరూ తమ జోలికి రాకుండా ఉండేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది.


గాలి మేడలెన్నో...
ప్రమాదంతో ఈ కల్చరల్‌ సెంటర్‌ వ్యవహారం వెలుగు చూసినప్పటికీ బయటకు రాని ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఇంకా లెక్కకు మిక్కిలిగానే ఉన్నట్లు తెలుస్తోంది.  ఏదైనా భవనం కూలినప్పుడో, మరో ప్రమాదం జరిగినప్పుడో ఆరా తీస్తే నిర్మాణానికి అనుమతుల్లేకపోవడం వెల్లడవుతోంది. ఇటీవలే పాతబస్తీలో, ఆసిఫ్‌నగర్‌లలో జరిగిన ప్రమాదాలు ఇందుకు తాజా దృష్టాంతాలు. ఇలా.. ఎన్ని భవనాలు విచ్చలవిడిగా అక్రమంగా నిర్మించి ఉంటారో అంచనా వేసుకోవచ్చు. అక్రమ నిర్మాణాలుగా అంగీకరిస్తూ బీఆర్‌ఎస్‌కు అందిన దరఖాస్తులే దాదాపు 1.40 లక్షలుండగా, దరఖాస్తులే లేని నిర్మాణాలు మరో 50 వేల వరకు ఉండవచ్చునని అంచనా.

Advertisement
 
Advertisement