
బ్యూటీషియన్ నందిని జైలుకు తరలింపు
అమ్మిపెడతానని జ్యువెలరీ వ్యాపారి నుంచి బంగారు నగలు తీసుకొని వాటిని తన సొంతానికి వాడుకొని మోసంచేసిన బ్యూటీషియన్ నందినీ చౌదరిని ఒక రోజు విచారణ అనంతరం పోలీసులు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
బంజారాహిల్స్: అమ్మిపెడతానని జ్యువెలరీ వ్యాపారి నుంచి బంగారు నగలు తీసుకొని వాటిని తన సొంతానికి వాడుకొని మోసంచేసిన బ్యూటీషియన్ నందినీ చౌదరిని ఒక రోజు విచారణ అనంతరం పోలీసులు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసు విచారణలో ఆమె మరిన్ని విషయాలను వెల్లడించడమే కాకుండా మధ్యవర్తి తీసుకున్న రూ.10 లక్షల విలువ చేసే నెక్లెస్‌ను పోలీసులకు తిరిగి అప్పగించింది.
వివరాలు.. అబిడ్స్‌కు చెందిన నగల వ్యాపారి వద్ద బ్యూటీషియన్ నందిని రూ.5 లక్షల అప్పు తీసుకుంది. ఆ వ్యాపారి తనకు డబ్బు ఇప్పించాలంటూ బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని కమాన్‌లోని ఓ నేతను ఆశ్రయించగా ఆయన నందినీ చౌదరిపై ఒత్తిడి తెచ్చి ఆమె వద్ద ఉన్న రూ.10 లక్షల విలువ చేసే నెక్లెస్‌ను తీసుకున్నాడు. నగల వ్యాపారికి నందిని ఇవ్వాల్సిన రూ.5 లక్షలను తానే చెల్లించి నగను తన వద్దే ఉంచుకున్నాడు. విచారణలో నందిని ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ నెక్లెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెం 9లోని అల్లావుద్దీన్ అనే వ్యాపారి నుంచి కూడా నందిని రూ.2.5 లక్షలు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టింది.
సదరు వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, రోజురోజుకూ నందినీ చౌదరి నేరాల చిట్టా పెరుగుతుండటంతో మరోమారు ఆమెను కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది.