నాన్నా... రెండు నిమిషాల్లో వచ్చేస్తున్నా! | BTech student died in car accident | Sakshi
Sakshi News home page

నాన్నా... రెండు నిమిషాల్లో వచ్చేస్తున్నా!

May 2 2016 9:46 AM | Updated on Jul 10 2019 2:44 PM

నాన్నా... రెండు నిమిషాల్లో వచ్చేస్తున్నా! - Sakshi

నాన్నా... రెండు నిమిషాల్లో వచ్చేస్తున్నా!

‘నాన్నా... దగ్గరలో ఉన్నా. రెండు నిమిషాల్లో ఇంటికొచ్చేస్తా...’ అంటూ తండ్రికి చెప్పిన కొద్ది సేపటికే అనంత లోకాలకు వెళ్లిపోయిందో బీటెక్ విద్యార్థిని. రోడ్డు ప్రమాదం ఆమె ఉసురు తీసింది.

అంతలోనే అనంతలోకాలకు వెళ్లిన బీటెక్ విద్యార్థిని
 
హైదరాబాద్:  ‘నాన్నా... దగ్గరలో ఉన్నా. రెండు నిమిషాల్లో ఇంటికొచ్చేస్తా...’ అంటూ తండ్రికి చెప్పిన కొద్ది సేపటికే అనంత లోకాలకు వెళ్లిపోయిందో బీటెక్ విద్యార్థిని. రోడ్డు ప్రమాదం ఆమె ఉసురు తీసింది. ఆదివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.70 డీకే నగర్ తులిప్ రెసిడెన్సీలో నివసించే బిల్డర్ కట్కూరి నిరంజన్‌రెడ్డి చిన్న కుమార్తె దేవి(21) నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. స్నేహితుడైన యూసుఫ్‌గూడ సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదివే సామ భరత్‌ సింహారెడ్డి(23)తో కలసి అతని కారులో శనివారం రాత్రి నానక్‌రాంగూడలో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది.

భరత్ మాదాపూర్‌లో నివసించే ఫంక్షన్‌హాళ్ల యజమాని సామ సుభాష్‌రెడ్డి కుమారుడు. కార్యక్రమం ముగిశాక మరో ఇద్దరు స్నేహితులతో కలసి భరత్, దేవి కారులో బయలుదేరారు. మధ్యలో ఇద్దరు స్నేహితులనూ విడిచిపెట్టిన వీరు... జర్నలిస్టు కాలనీ మీదుగా డీకే నగర్ వెళుతున్నారు. ఆదివారం తెల్లవారుజాము 3.30 గంటల ప్రాంతంలో.. ఎక్కడున్నావంటూ తండ్రి నుంచి దేవికి ఫోన్ వచ్చింది. దగ్గర్లోనే ఉన్నా... రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటా అంటూ దేవి బదులిచ్చింది.

పది నిమిషాలకే అతివేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి దేవి ఇంటి సమీపంలోని చెట్టు ను ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి డ్రైవింగ్ సీటులో ఉన్న భరత్ ప్రాణాలతో బయటపడగా... అతని పక్కనే కూర్చున్న దేవి తలకు తీవ్ర గాయమైంది. పోలీసులు దేవిని అపోలో ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైన భరత్‌సింహారెడ్డిపై ఐపీసీ సెక్షన్ 304 (ఎ) కింద కేసు నమోదు చేసిన పోలీసులు... అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేశారు. ఛాతీ నొప్పితో బాధపడుతుండటంతో అతడిని ఆస్పత్రికి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement