breaking news
Devi (21)
-
9 ఏళ్ల చిన్నారి.. రెండు జన్మల కథ!
సూర్యుడు నడినెత్తి మీదకు వస్తున్నాడు. మధుర పట్టణంలోని ద్వారకాధీశ్ ఆలయ పరిసరాల్లో రద్దీ ఓ మోస్తరుగా ఉంది. అప్పుడే అక్కడ అడుగుపెట్టిన తొమ్మిదేళ్ల శాంతిదేవి కళ్లలో ఒక విచిత్రమైన శూన్యం, అంతకంటే వింతైన వెలుగు కనిపిస్తున్నాయి.ఆమె ఆ ఊరికి రావడం ఇదే మొదటిసారి. కానీ, ఆమె అడుగులు మాత్రం వడివడిగా ముందుకు పడుతున్నాయి. ఆమెతోపాటు ఉన్న 15 మంది ప్రముఖులు ఒకింత ఆశ్చర్యం, మరికొంత ఉత్కంఠతో వెనకే వెళ్తున్నారు. ఆ బాలిక ఓ ఇంటి ముందు ఆగి, ‘ఇదే నా ఇల్లు..’ అని చెప్పి తలుపు తట్టింది. లోపలి నుంచి వచ్చిన వ్యక్తిని చూసి.. ‘ఏవండీ ఎలా ఉన్నారు’ అని అడిగేసరికి వారంతా నిర్ఘాంతపోయారు.1926 డిసెంబరు 11న ఢిల్లీలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది శాంతిదేవి. నాలుగేళ్ల వయసు వచ్చే వరకు అందరిలాగా ఆటపాటలతో గడిపింది. కానీ, మాటలు స్పష్టంగా వస్తున్న కొద్దీ ఆమె ప్రవర్తనలో మార్పు రాసాగింది. అద్దం ముందు నిలబడి.. ‘ఇది నేను కాదు, నా ముఖం ఇలా ఉండదు’ అని విచారంగా అనుకునేది.మొదట్లో తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె చెప్పే మాటలు వారిని భయాందోళనలకు గురిచేశాయి. ‘నా పేరు శాంతిదేవి కాదు, నేను లుగ్దీదేవిని. మధుర నా సొంతూరు. నాకు పెళ్లయింది. నా భర్త పేరు కేదార్నాథ్ చౌబే. ఒక బాబుకు జన్మనిచ్చిన తొమ్మిది రోజులకే నేను కన్నుమూశాను’ అంటూ ఏడ్చేది. ఈ విషయం శాంతిదేవి చదువుకునే స్కూలు టీచరుకు తెలియడంతో ఆయనకు ఆసక్తి కలిగి ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కేదార్‌నాథ్‌కు లేఖ రాశారు.ఆశ్చర్యం.. అక్కడ నుంచి జవాబు వచ్చింది. తన పేరు కేదార్నాథ్ చౌబే అని, లుగ్దీదేవి తన భార్యే అని, ఆమె 1925లో చనిపోయిందని చెప్పడంతో ఆ టీచరుకు నోటమాట రాలేదు. వెంటనే కేదార్‌నాథ్‌కు విషయాలన్నీ వివరించి ఢిల్లీ రావాలని కోరారు. ఈ విషయాలేవీ శాంతిదేవికి చెప్పకుండా కేదార్‌నాథ్‌ను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లారు. ఆయన్ను చూసిన శాంతిదేవి– ఎంతో ఉద్విగ్నతకు లోనై, ‘ఏవండీ..’ అంటూ పిలిచేసరికి కేదార్నాథ్ బిత్తరపోయారు. ఎందుకంటే తనను అలా పిలిచే ఏకైక వ్యక్తి ఆయన భార్య మాత్రమే. కానీ ఆమె మరణించిన పదేళ్ల తర్వాత ఓ చిన్నారి అలా పిలిచేసరికి ఆయన షాక్‌లో ఉండిపోయారు. తమ ఇద్దరికీ మాత్రమే తెలిసిన ఎన్నో వ్యక్తిగత విషయాలను శాంతిదేవి ప్రస్తావించడంతో ఆమె గత జన్మలో తన భార్యే అని కేదార్నాథ్ నిర్ధారణకు వచ్చారు.ఈ వార్త మహాత్మా గాంధీ వరకు చేరింది. దీంతో 1935లో శాంతిదేవిని, ఆమె తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. చిన్నారి చెప్తున్న విషయాల్లోని నిజాయతీని గమనించిన ఆయన.. లోతైన విచారణ కోసం 15 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.కమిటీ సభ్యులు శాంతిదేవిని తీసుకొని 1935 నవంబరులో ఢిల్లీ నుంచి మధురకు రైలులో బయలుదేరారు. ఢిల్లీ దాటి ఎప్పుడూ వెళ్ళని ఆ బాలిక మధుర స్టేషన్ రాగానే స్థానిక ‘బ్రజ్’ యాసలో అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టింది. స్టేష¯Œ లో దిగగానే, గత జన్మలో తన భర్తకు పెద్దన్నయ్య అయిన వ్యక్తిని గుర్తుపట్టింది. అక్కడి నుంచి తన పాత ఇంటికి వారందరినీ తీసుకువెళ్లింది.ఒక గదిలో నేల కింద తాను దాచిన డబ్బు గురించి చెప్పింది. అయితే అక్కడ తవ్వగా ఖాళీ డబ్బా మాత్రమే దొరికింది. కమిటీ సభ్యులు శాంతిదేవి వైపు అనుమానంగా చూశారు. ఆ క్షణంలో కేదార్నాథ్ కన్నీళ్లు పెట్టుకుంటూ.. ‘ఆ డబ్బు లుగ్దీదేవి చనిపోయాక నేనే తీశాను’ అని అంగీకరించడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అలాగే తమ కుమారుడి చిన్నప్పటి గుర్తులు కూడా చెప్పి అందరినీ విస్తుపోయేలా చేసింది.శాంతిదేవి చెప్పిన చాలా అంశాలు వందకు వంద శాతం సరిపోయాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. పలువురు పారానార్మల్ పరిశోధకులు కూడా శాంతిదేవి కేసును పునర్జన్మలకు సంబంధించిన బలమైన ఉదాహరణగా ప్రస్తావించారు. అయితే, దీనిపై శాస్త్రీయంగా ఏకాభిప్రాయం రాలేదు. కొందరు దీనిని పునర్జన్మకు ఆధారంగా పేర్కొన్నారు. మరికొందరు మెదడులోని పాత జ్ఞాపకాల పొరలని వాదించారు.ఓవైపు ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు.. మరోవైపు గత జన్మ తాలూకు జ్ఞాపకాలు.. ఇలా జీవితాంతం రెండు జన్మల మధ్య బతికిన శాంతిదేవి వివాహం చేసుకోకుండా తన 61వ ఏట 1987లో మరణించారు.- కె.సత్యకిశోర్ -
కారులో నుంచి అరుపులు వినిపించాయి
♦ జూబ్లీహిల్స్ ప్రమాదంలో దేవి మరణంపై ప్రత్యక్ష సాక్షి ♦ ఓ యువకుడు ఆమెను వెంబడించి..కారులోకి తోసేశాడని వెల్లడి ♦ ప్రమాదంపై అనుమానాలున్నాయి.. న్యాయం చేయండి: దేవి బంధువులు హైదరాబాద్: ఈ నెల 1న జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రముఖ బిల్డర్ కట్కూరి నిరంజన్‌రెడ్డి కుమార్తె కట్కూరి దేవి(21) మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జర్నలిస్టు కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మృతురాలి పెదనాన్న నరేందర్‌రెడ్డితో కలసి ప్రత్యక్ష సాక్షి రాము వివరాలు వెల్లడించారు. ‘ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచి కార్లు కడగడానికి బయటకు వచ్చా. అప్పటికే రోడ్డు చివరలో ఓ కారు ఆగి ఉంది. అందులోంచి తలుపులు కొడుతున్న శబ్దాలు వినిపించాయి. చీకటిగా ఉండటంతో భయపడి అక్కడికి వెళ్లలేదు. అయితే కారులో నుంచి ఓ యువతి దిగి అరుస్తూ పరిగెత్తే ప్రయత్నం చేయగా, ఆమెను ఓ యువకుడు వెంబడించి పట్టుకున్నాడు. బలవంతంగా కారులోకి తోసేశాడు. అరగంటపాటు వారిద్దరూ కారులోనే ఉన్నారు. కారు తలుపులు కొడుతూ ‘హెల్ప్.. హెల్ప్’ అన్న అమ్మాయి అరుపులు వినిపించాయి. ఈ విషయం చెప్పేందుకు పక్కనే ఉన్న ఇంటకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టా. అది పనిచేయకపోవడంతో వెనుదిరిగా. కారులో మరొకరు ఉండవచ్చు. తెల్లవారుజాము 4.30 గంటల ప్రాంతంలో కారు వేగంగా దూసుకుపోయింది. పావుగంట తర్వాత పాలు సరఫరా చేసే వ్యక్తి వచ్చి కొద్ది దూరంలో కారు చెట్టుకు ఢీకొన్న విషయాన్ని నాకు చెప్పాడు. వెళ్లి చూడగా ప్రమాదానికి గురైంది అదే కారు (నంబర్ 1116)’ అని రాము తెలిపారు. అది హత్యే: పెదనాన్న నరేందర్ రెడ్డి దేవి పెదనాన్న నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ... తన తమ్ముడు నిరంజన్‌రెడ్డి ఉదయం 5.15 గంటలకు ఫోన్ చేశాడన్నారు. తాను ఘటనా స్థలానికి చేరేసరికే ప్రమాదానికి కారణమైన దేవి స్నేహితుడు సామ భరతసింహారెడ్డి తల్లిదండ్రులు వచ్చి ఉన్నారని... పోలీసులు, వైద్యులను వారు అప్పటికే మేనేజ్ చేశారని ఆరోపించారు. సన్నగా ఉన్న చెట్టుకు కారు ఢీకొంటే అదెందుకు విరగలేదని ప్రశ్నించారు. మద్యం మత్తులో జరిగిందని డీసీపీ వెంకటేశ్వరరావు చెబుతున్నారని, జూబ్లీహిల్స్ పోలీసులు మాత్రం బ్రీత్ ఎనలైజర్ జీరో చూపిందని తెలిపారన్నారు. దేవిది కచ్చితంగా హత్యేనని, వీటన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేసేవరకూ పోరాడతామన్నారు. -
నాన్నా... రెండు నిమిషాల్లో వచ్చేస్తున్నా!
అంతలోనే అనంతలోకాలకు వెళ్లిన బీటెక్ విద్యార్థిని హైదరాబాద్: ‘నాన్నా... దగ్గరలో ఉన్నా. రెండు నిమిషాల్లో ఇంటికొచ్చేస్తా...’ అంటూ తండ్రికి చెప్పిన కొద్ది సేపటికే అనంత లోకాలకు వెళ్లిపోయిందో బీటెక్ విద్యార్థిని. రోడ్డు ప్రమాదం ఆమె ఉసురు తీసింది. ఆదివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.70 డీకే నగర్ తులిప్ రెసిడెన్సీలో నివసించే బిల్డర్ కట్కూరి నిరంజన్‌రెడ్డి చిన్న కుమార్తె దేవి(21) నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. స్నేహితుడైన యూసుఫ్‌గూడ సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదివే సామ భరత్ సింహారెడ్డి(23)తో కలసి అతని కారులో శనివారం రాత్రి నానక్‌రాంగూడలో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. భరత్ మాదాపూర్‌లో నివసించే ఫంక్షన్‌హాళ్ల యజమాని సామ సుభాష్‌రెడ్డి కుమారుడు. కార్యక్రమం ముగిశాక మరో ఇద్దరు స్నేహితులతో కలసి భరత్, దేవి కారులో బయలుదేరారు. మధ్యలో ఇద్దరు స్నేహితులనూ విడిచిపెట్టిన వీరు... జర్నలిస్టు కాలనీ మీదుగా డీకే నగర్ వెళుతున్నారు. ఆదివారం తెల్లవారుజాము 3.30 గంటల ప్రాంతంలో.. ఎక్కడున్నావంటూ తండ్రి నుంచి దేవికి ఫోన్ వచ్చింది. దగ్గర్లోనే ఉన్నా... రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటా అంటూ దేవి బదులిచ్చింది. పది నిమిషాలకే అతివేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి దేవి ఇంటి సమీపంలోని చెట్టు ను ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి డ్రైవింగ్ సీటులో ఉన్న భరత్ ప్రాణాలతో బయటపడగా... అతని పక్కనే కూర్చున్న దేవి తలకు తీవ్ర గాయమైంది. పోలీసులు దేవిని అపోలో ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైన భరత్‌సింహారెడ్డిపై ఐపీసీ సెక్షన్ 304 (ఎ) కింద కేసు నమోదు చేసిన పోలీసులు... అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేశారు. ఛాతీ నొప్పితో బాధపడుతుండటంతో అతడిని ఆస్పత్రికి పంపించారు.


