‘సాక్షి’ డెరైక్టర్లపై కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల | all cases stop on sakshi directors | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ డెరైక్టర్లపై కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల

Apr 27 2016 3:34 AM | Updated on Aug 31 2018 8:24 PM

ఏపీ రాజధాని ప్రాంత పరిధిలో అధికారపార్టీ నేతల భూ అక్రమాలపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలు తమ పరువుకు..

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంత పరిధిలో అధికారపార్టీ నేతల భూ అక్రమాలపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలు తమ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా పొన్నూరు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసింది. ప్రతివాదులుగా ఉన్న నరేంద్రకుమార్, గుంటూరు జిల్లా పోలీసులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిం ది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పొన్నూరు పోలీసులు.. జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్లు యర్రంరెడ్డి ఈశ్వర ప్రసాదరెడ్డి, కాల్వ రాజప్రసాదరెడ్డి, పి.వెంకటకృష్ణ ప్రసాద్, ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి తదితరులపై కేసు నమోదు చేయడం విదితమే. ఈ కేసును కొట్టేయాలని, అప్పటివరకు తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ ‘సాక్షి’ డెరైక్టర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ మంగళవారం విచారించారు.

పిటిషనర్ల తరఫున జి.కళ్యాణి వాదనలు వినిపిస్తూ... వాస్తవాలను నిర్ధారించుకున్నాకనే కథనాల్ని ప్రచురించినట్టు పేర్కొన్నారు. పత్రిక రోజువారీ వ్యాపారాలతో కంపెనీ డెరైక్టర్లకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సాక్షి కథనాలకు, దాని డెరైక్టర్లకు ఏ సంబంధం లేదని, ఈ విషయం తెలిసి కూడా పోలీసులు కేసు నమోదు చేశారని, ఇది అధికార దుర్వినియోగమేనని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కేసు నమోదు చేశారన్నారు. రాజకీయ కక్ష సాధింపుచర్యల్లో భాగంగానే నరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆమె కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement