శెట్టూరులో..జనహోరు! | ys jaganmohanreddy raithu barosa yatra started in ananthpur district | Sakshi
Sakshi News home page

శెట్టూరులో..జనహోరు!

Jul 22 2015 8:31 AM | Updated on Jul 25 2018 4:09 PM

శెట్టూరులో..జనహోరు! - Sakshi

శెట్టూరులో..జనహోరు!

అభిమాననేతను చూసేందుకు 'అనంత' ప్రజలు తరలివచ్చారు. అడుగడుగునా అభిమాననీరాజనాలు పలికారు.

 

  •  మూడో విడత రైతు భరోసా యాత్ర ప్రారంభం
  •  వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికిన 'అనంత'నేతలు
  •  తొలిరోజు 39 కిలోమీటర్లు ..ఓ రైతు కుటుంబానికి పరామర్శ
  •  ప్రమాదంలో మృతి చెందినకార్యకర్త కుటుంబానికీ ఓదార్పు..
  •  గాయపడిన మరో కార్యకర్తకు పరామర్శ
  •  జగన్‌ను చూసేందుకు రోడ్లపైకి తరలివచ్చిన 'అనంత'ప్రజలు
  •  అడుగడుగునా ఘనస్వాగతం పలికిన పార్టీ నేతలు, కార్యకర్తలు

 
 రైతుభరోసాయాత్ర నుంచి సాక్షి ప్రతినిధి:
 అభిమాననేతను చూసేందుకు 'అనంత' ప్రజలు తరలివచ్చారు. అడుగడుగునా అభిమాననీరాజనాలు పలికారు. తనను చూసేందకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ జగన్  చిరునవ్వుతో పలకరించారు. చిన్నపిల్లలు, వృద్ధులను ఆప్యాయంగా ముద్దాడుతూ... మహిళలను దీవిస్తూ... యువకులతో కరచాలనం చేస్తూ మూడవ విడత మొదటి రోజు యాత్రను సాగించారు.


 అప్పులబాధ తాళలేక ఆత్మహత్యలకు తెగించిన రైతుకుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అధినేత, విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మూడో విడత రైతు భరోసా యాత్ర మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు జగన్ చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 4గంటలకు శెట్టూరు మండలంలోని కర్ణాటక-ఆంధ్రా సరిహద్దులోని తిప్పనపల్లి సమీపంలోని మారెమ్మగుడి వద్ద 'అనంత'నేతలు ఘన స్వాగతం పలికారు.అక్కడి నుండి తిప్పనపల్లి మీదుగా ములకలేడు చేరుకున్నారు. జగన్‌ను చూడగానే గ్రామస్తులు జేజేలు పలికారు. మహిళలు హారతిపట్టి తిలకం దిద్దారు. తర్వాత అయ్యగార్లపల్లి మీదుగా శెట్టూరు చేరుకున్నారు. ఇక్కడ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. తర్వాత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త వన్నూరుస్వామి కుటుంబసభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆపై రోడ్డుప్రమాదంలో గాయపడ్డ శెట్టూరు ఉపసర్పంచ్ రామకృష్ణను పరామర్శించారు. తర్వాత డీఎడ్ విద్యార్థులు తమ సమస్యలపై జగన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నోటిఫికేషన్ వెలువరించిన తర్వాత పరీక్షలు నిర్వహించేందుకు 7 నెలల సమయం తీసుకున్నారని, తర్వాత ఇప్పటి వరకూ ఫలితాలు వెల్లడించకుండా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై గతంలో అసెంబ్లీలో మాట్లాడనని, మరోసారి చంద్రబాబును నిలదీస్తానని జగన్ చెప్పారు. తర్వాత ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ నేతలు జగన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తర్వాత అక్కడి నుండి నేరుగా కైరేవు చేరుకున్నారు. కైరేవు గ్రామస్తులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు పెద్దనాగప్ప కుటుంబసభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. అనంతరం బొచ్చుపల్లి, చిన్నంపల్లిగేట్, పాపంపల్లి, గరుడాపురం మీదుగా రాత్రికి కళ్యాణదుర్గం చేరుకున్నారు. తొలిరోజు 39 కిలోమీటర్లు ప్రయాణించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి ఫాంహౌస్‌లో బస చేశారు. యాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డీనేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, శింగనమల, మడకశిర నియోజకవర్గ సమన్వయకర్తలు ఆలూరి సాంబశివారెడ్డి, తిప్పేస్వామి, జిల్లా నేత చవ్వారాజశేఖరరెడ్డి, మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, రాష్ట్ర కార్యదర్శి మీసాల రంగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, అనంత నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, పామిడి వీరాంజనేయులు, పసుపులేటి బాలకృష్ణారెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకుడు కొర్రపాటి హుస్సేన్‌పీరా, మహిళా నేతలు శ్రీదేవి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

అధైర్య పడొద్దు.. అండగా ఉంటా
 కళ్యాణదుర్గం : అధైర్య పడకండి.. అండగా ఉంటామని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త వన్నూరుస్వామి కుటుంబానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. గత నెలలో ప్రమాదానికి గురైన శెట్టూరు గ్రామానికి చెందిన వన్నూరుస్వామి చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ మంగళవారం రైతు భరోసా యాత్రలో భాగంగా పరామర్శించారు. భార్య సుశీలమ్మ, కుమార్తె రోజా, కుమారులు అనిల్, శ్రీరాములతో మాట్లాడారు. వారి సాదక బాధకాలు అడిగి తెలుసుకున్నారు.  వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.
 జగన్ : ఏం జరిగిందమ్మా?
 సుశీలమ్మ : బస్సు యాక్సిడెంట్  సార్..
 జగన్ : ఎలా జరిగింది తల్లీ?
 సుశీలమ్మ : బైక్‌లో వస్తుండగా బస్సు ఢీకొంది.
 జగన్ : ఒక్కడేనా.. ఇంకెవరైనా ఉన్నారా?
 సుశీలమ్మ : ఒక్కడే  సార్...
 జగన్ : పిల్లలు ఎంతమంది తల్లీ?
 సుశీలమ్మ : ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సార్...
 జగన్ : ఏం చదువుతున్నారమ్మా?
 సుశీలమ్మ : కూతురు రోజా ఇంటర్, కుమారులు అనిల్ 9వ తరగతి, శ్రీరాములు 8వ తరగతి.
 జగన్ : పిల్లల చదువుల సంగతి చూసుకుంటాంలేమ్మా..
 సుశీలమ్మ : సంతోషం సార్..
 జగన్ : ఇది సొంతిల్లేనమ్మా?
 సుశీలమ్మ : ఔను సార్
 జగన్ : వేరే ఆదాయం ఏమైనా ఉందా తల్లీ?
 సుశీలమ్మ : ఏమీ లేదు.  కూలి పని చేసుకుంటున్నాం.
 జగన్ : చదువుకున్నావా తల్లీ?
 సుశీలమ్మ : లేదుసార్..
 జగన్ : ఉషమ్మ(వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త)మీ పిల్లల చదువులు చూస్తారు.
 సుశీలమ్మ : మా ఇంటికి దేవుడొచ్చినంత సంతోషం కలిగింది సార్..
 
 రెండో రోజు పర్యటన ఇలా..
 రైతు భరోసాయాత్రలో భాగంగా నేడు వైఎస్ జగన్ ముందుగా కళ్యాణదుర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేస్తారు. తర్వాత వాల్మీకి విగ్రహానికి పూలమాల వేస్తారు. ఆపై నేరుగా బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు ఈరన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ముదిగల్లుకు చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న బోయనారాయణప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత మల్లిపల్లి, తూర్పుకోడిపల్లి మీదుగా వర్లి చేరుకుంటారు. అక్కడ హరిజన గంగన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. రాత్రికి కళ్యాణదుర్గంలో బస చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement