యాదాద్రికి సీఎం డిజైనింగ్ | Yadadri To Designing CM | Sakshi
Sakshi News home page

యాదాద్రికి సీఎం డిజైనింగ్

Jul 16 2015 4:02 AM | Updated on Aug 14 2018 10:54 AM

యాదాద్రికి సీఎం డిజైనింగ్ - Sakshi

యాదాద్రికి సీఎం డిజైనింగ్

యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి పనులు వారం, పది రోజుల్లో ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి పనులు వారం, పది రోజుల్లో ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఆహ్లాదం, ఆనందం, పచ్చదనం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఆలయాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ప్రధాన యాదాద్రితో పాటు అక్కడున్న నవ గిరులను అభివృద్ధి చేసేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలు, నమూనాలపై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు.

అయిదు గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య, సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, దేవాలయ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎం.జి.గోపాల్, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, నల్లగొండ జేసీ సత్యనారాయణ, ఆర్కిటెక్ట్‌లు జగన్, ఆనందసాయి పాల్గొన్నారు. యాదాద్రి చుట్టూ ఇప్పటికే 943.2 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, మరో వంద ఎకరాలు సేకరించి ఆలయ అభివృద్ధికి వినియోగిస్తామని సీఎం అన్నారు.

వరుసగా రెండు బడ్జెట్లలో ప్రభుత్వం తరఫున రూ.200 కోట్లు కేటాయిస్తే.. టాటా, అంబానీ, జెన్‌కో, బెల్ లాంటి సంస్థలు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కావాల్సినంతభూమి, సరిపడేన్ని నిధులు సిద్ధంగా ఉన్నందున వెంటనే పనులు ప్రారంభించాలని స్పష్టంచేశారు.
 
సీఎం సూచనలివీ..
యాదాద్రి గుట్టపై 15 ఎకరాల స్థలం ఉంది. అందులో  5 ఎకరాలు ప్రధాన గుడి కిందకు వస్తుంది. ఈ ఐదెకరాల్లోనే ప్రాకారం, మాడ వీధులు నిర్మించాలి. లక్ష్మీ నరసింహస్వామి 32 అవతారాల ప్రతిమలు ఇందులోనే రావాలి. యాదాద్రి గుట్ట విస్తీర్ణం దాదాపు 180 ఎకరాల వరకు ఉంటుంది. ప్రధాన గుట్ట చుట్టూ గౌరీ ప్రదక్షిణ రోడ్ నిర్మించాలి. యాదాద్రిపై పుష్కరిణి, కల్యాణ కట్ట, అర్చకుల నివాస గృహాలు, రథ మండపం, క్యూ కాంప్లెక్స్, వీఐపీ గెస్ట్‌హౌజ్ నిర్మించాలి. దేవుడి ప్రసాదాలు తయారు చేసే వంటశాల, అద్దాల మందిరం ఇక్కడే రావాలి.

యాదాద్రి కింది భాగంలో బస్టాండ్, కల్యాణ మంటపం, షాపింగ్ కాంప్లెక్స్, పూజకు వినియోగించే పూల మొక్కలతో కూడిన ఉద్యానవనం, మండల దీక్షలు తీసుకునే వారికి వసతి కేంద్రాలు నిర్మించాలి. చుట్టూ ఉన్న ఇతర కొండలు, ఖాళీ ప్రదేశాల్లో ఉద్యానవనాలు, కాటేజీలు, గెస్ట్ హౌస్‌లు, పార్కింగ్ ప్లేస్‌లు, గోశాల, అన్నదానానికి భోజనశాల, పర్మెనెంట్ హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలి. సమీపంలోనే ఉన్న బస్వాపూర్ చెర్వును రిజర్వాయర్‌గా మార్చాలి. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో కట్టను అభివృద్ధి చేయాలి. అక్కడే బోటింగ్, వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయాలి. గుట్ట ప్రాంతమంతా నాలుగు లేన్ల రోడ్లు ఏర్పాటు చేయాలి.

ప్రతి రోడ్డుకు డివైడర్, పుట్‌పాత్‌తో పాటు పలుచోట్ల ఐలాండ్స్ నిర్మించాలి. గుట్ట పరిసరాలన్నీ చెట్లతో పచ్చగా కళకళలాడాలి. భక్తి భావన పెంపొందేలా ఈ ప్రాంతమంతా మార్మోగేలా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మొత్తం వెయ్యి ఎకరాల స్థలానికి లే అవుట్ సిద్ధం చేయాలి. పున్నమి గెస్ట్‌హౌస్‌ను ఆధునీకరించాలి. యాదాద్రి సమీపంలోని 11 ఎకరాల స్థలంలో 3 గెస్ట్ హౌస్‌లు నిర్మించాలి. పుష్కరిణిని విస్తరించాలి. గుట్టలోని వివిధ దేవాలయ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. పాత యాదగిరిని కూడా దర్శించుకునే ఏర్పాట్లు చేయాలి. గుట్ట కింద పెళ్లిళ్లు చేసుకునేందుకు వీలుగా కల్యాణ మంటపాలు కట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement