రాష్ట్ర మంత్రి మండలి నుంచి ఉద్వాసన ఎవరికి.. కొత్తగా మంత్రిమండలిలో అవకాశం ఎవరెవరికి, అసలు మంత్రివర్గ
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు
♦ కొత్తవారికి అవకాశాలపై ఊహాగానాలు
♦ అమాత్య పదవులపై ఆశలు రేకెత్తిస్తున్న సీఎం
♦ మొన్న రసమయికి.. నిన్న కొప్పులకు హామీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి మండలి నుంచి ఉద్వాసన ఎవరికి.. కొత్తగా మంత్రిమండలిలో అవకాశం ఎవరెవరికి, అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు.. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు విస్తృతంగా జరుగుతున్న చర్చే ఇది. పార్టీ అధినేత, సీఎం చంద్రశేఖర్‌రావు ఒక్కో సందర్భంలో ఒక్కో కొత్త పేరును తెరైపైకి తెస్తూ.. మంత్రులను చేస్తానంటున్నారు. ఆయా వర్గాల ప్రజలను సంతృప్తి పరిచేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాౄ.., లేక నిజంగానే మంత్రివర్గాన్ని విస్తరించి కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అన్నదానిపై టీఆర్‌ఎస్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే సీఎం కేసీఆర్ బహిరంగ వేదికలపైనే ఈ ప్రకటనలు చేశారు కాబట్టి.. కచ్చితంగా త్వర లోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది.
సాంస్కృతిక సారథిగా ఉన్న కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను మంత్రిని చేస్తానని సీఎం గతంలోనే ప్రకటించారు. తాజాగా కరీంనగర్ జిల్లా ధర్మపురిలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ .. ‘ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మంత్రి అవుతారు..’ అని ప్రకటించారు. వాస్తవానికి టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే కొప్పుల ఈశ్వర్ పేరును ఉప ముఖ్యమంత్రి పదవికి పరిశీలించారు.
కానీ కరీంనగర్ జిల్లా నుంచి కేటీఆర్, ఈటల రాజేందర్‌లకు బెర్తులు ఖరారుకావడంతో కొప్పుల వెనుకబడిపోయారు. అనూహ్యంగా వరంగల్ జిల్లాకు చెందిన టి.రాజయ్య డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన ను బర్తరఫ్ చేసిన తర్వాత అదే జిల్లాకు చెందిన కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. ఈ రెండు పరిణామాల తర్వాత ఇక కొప్పుల ఈశ్వర్‌కు మంత్రివర్గంలో స్థానం ఉండదన్న అభిప్రాయం వచ్చింది. కానీ తాజాగా కొప్పులకు మంత్రి పదవి ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు.
ఎవరి పీఠం కిందకు నీళ్లు?
నిబంధనల మేరకు సీఎం సహా మొత్తం మంత్రుల సంఖ్య 17కు మించకూడదు. ఈ కారణంగానే కేసీఆర్ ‘పార్లమెంటరీ కార్యదర్శు’ల పదవులకు ఊపిరి పోశారు. కానీ, హైకోర్టు తీర్పుతో అది తుస్సుమన్నది. ఇప్పుడు వారందరినీ ఎలా సర్దుబాటు చేయాలనే దానిపైనే స్పష్టత లేదు. ఈలోగానే రెండు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో మంత్రి వర్గం నుంచి ఎవరిని తొలగిస్తారన్న ప్రశ్న తలెత్తింది. జంట నగరాల నుంచి నలుగురు మంత్రి వర్గంలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో, బయటా జరుగుతున్న ప్రచారం మేరకు హోంమంత్రి నాయిని, ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్‌ల సేవలను పార్టీకి వాడుకుంటారని అంటున్నారు. అదే నిజమైతే వారి స్థానంలో కొత్త వారిని తీసుకునే అవకాశముంది. కాగా, ఇప్పటికే కరీంనగర్ నుంచి కేటీఆర్, ఈటలలు మంత్రివర్గంలో ఉన్నారు. ఇటీవల సీఎం పేర్కొన్న రసమయి, కొప్పుల కూడా కరీంనగర్ వారే. మరి ఒకే జిల్లా నుంచి కేబినెట్‌లో నలుగురికి అవకాశం దక్కుతుందా అన్నది సందేహాస్పదంగా మారింది.