శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గం నిర్మాణం కోసం భూసేకరణకు గాను రూ.276.01 కోట్లను మంగళవారం ప్రభుత్వం మంజూరు చేసింది.
హైదరాబాద్ : శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గం నిర్మాణం కోసం భూసేకరణకు గాను రూ.276.01 కోట్లను మంగళవారం ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో పెట్టుబడులను రాబట్టేందుకు మౌలిక సదుపాయాలను కల్పించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గం పనుల వ్యయంలో 50 శాతం నిధులు, భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చితే ఆ ప్రాజెక్టును చేపట్టడానికి సిద్ధమని ఏడేళ్ల క్రితమే రైల్వే శాఖ ప్రతిపాదించింది.
ఆ ప్రతిపాదనకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. నెల్లూరు,గుంటూరు జిల్లాల్లో భూసేకరణకు అధికారులను ఆదేశించింది. నెల్లూరు జిల్లాలో 2,901.54 ఎకరాల భూమిని సేకరించడానికి రూ.271.06 కోట్లను మంజూరు చేయాలని కలెక్టర్ పంపిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిన ప్రభుత్వం మంగళవారం నిధులను మంజూరు చేసింది.