వారు వేరు–వీరు వేరు

SriRaman write article on Politics - Sakshi

అక్షర తూణీరం
ఇంత నిరాశ నిస్పృహల్లోనూ అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు భూచక్రంలా పని చేస్తుందనీ, భూమిని క్షాళన చేస్తుందనీ. తప్పక చేస్తుంది.

ఇప్పుడు చంద్రబాబు స్టెప్‌ ఏమిటి? కేసీఆర్‌కి జాతీయ నాయకత్వం మీద మోజు పుట్టిందా? ఈసారి నరేంద్ర మోదీ గెలిచేనా? – ఇవన్నీ ఒక అంతస్తులో వినిపించే మాటలు. ఇంకో అంతస్తులో ఈ గొడవలు వినరావు. అక్కడి వారికి పట్టనూ పట్టదు. మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు ఏర్పడిన రాజ్యం. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి మనమంతా గమనిస్తూనే ఉన్నాం. బాగా పెద్ద తరం వాళ్లు, మాకేం తేడా పడలేదు. తెల్లదొరలైనా నల్ల దొరలైనా అనే వాళ్లు. ‘‘ఎప్పుడైనా మన కష్టం మనకి కూడు పెడుతుంది గాని ప్రభుత్వాలు పెట్టవు’’ అనే మాట సామెతలా ప్రచారంలో ఉంది. 

మనం సూక్ష్మంగా పరిశీలిస్తే, ప్రభుత్వాలు జనంతో వ్యాపారం చేసుకుంటున్నాయ్‌. ‘‘రోడ్డు వేసుకోండి– టోల్‌ వసూలు చేసుకోండి’’ అన్నారు. ఇందులో దమ్మిడీ సేవ లేదు. ‘‘24 గంటలూ కరెంటు వాడుకోండి’’ అంటున్నారు. నేడు గృహస్తులు దివాలా తీస్తోంది కరెంటు బిల్లులతోనే. ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన సేవలేవీ అందడం లేదు.విద్య, వైద్యం లక్షల కోట్ల వ్యాపార దినుసు అయింది. అవన్నీ ప్రైవేట్‌. ఇక్కడ ప్రభుత్వం లేదు. మన గ్రామీణ వ్యవస్థలో ఎక్కడా ప్రభుత్వం కని పించదు. రోడ్లు, వంతెనలు లాంటి ప్రాథమిక అవసరాలు కూడా ఉండవు. కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామాలు అట్లాగే ఉన్నాయి. మనం ఇట్లా ఎక్కడికక్కడ విశ్లేషించుకుంటూ వెళితే, ఈ ప్రభుత్వాలు రాజకీయాలు ఇవన్నీ కేవలం ఒక లేయర్‌కే పరిమితమని అర్థం అవుతుంది.

ఇటీవల కాలంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ మీడియా వచ్చాక ఫోర్త్‌ ఎస్టేట్‌ ధాష్టీకం బాగా పెరిగింది. మన డెమోక్రసీలో అత్యంత ఆవశ్యకమైన ఎస్టేట్‌గా స్థిరపడింది. ఇవేవీ సామాన్య ప్రజకు పట్టవు. పట్టినా అర్థం కావు. ప్రత్యేక హోదా ఏమిటో, స్పెషల్‌ ప్యాకేజీ ఏమిటో పల్లెల్లో కూలీనాలీ చేసుకునే వారికి తెలియదు. అన్ని పార్టీలు, అందరు నాయకులు ప్రజా సేవకే కంకణాలు కట్టుకున్నారు. అయినా అస్తమానం ఒకరిమీద ఒకరు బురద ఎందుకు చల్లుకుంటారో తెలియదు. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కెరటంలా వచ్చిన మోదీ పాలన కూడా నిరాశాజనకంగానే సాగుతోంది. 

నాలుగేళ్లు అయిపోయింది. ఇది ఎన్నికల సంవత్సరం. ఇక సీట్లు కాపాడుకోవడం మీదే శక్తియుక్తుల్ని వినియోగిస్తారు. పార్లమెంటు ఉభయ సభలు ఆరు రోజులు ఏ పనీ చేయకుండా వాయిదాలు పడ్డాయంటే ఎంత బాధేస్తుంది. నిమిషానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుందని అందరికీ తెలుసు. అందరికీ అంటే పేపర్లు చదివి మాట్లాడుకొనే వాళ్లకి. ఇంత నిరాశ నిస్పృహల్లోనూ అప్పుడప్పుడూ అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు భూచక్రంలా పని చేస్తుందనీ, భూమిని క్షాళన చేస్తుందనీ. తప్పక చేస్తుంది.

- రమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top