అసంబద్ధ వ్యాఖ్యల బాబుదే ‘యూటర్న్‌’

Professor G Laxman Article On Chandrababu Naidu - Sakshi

అభిప్రాయం

తెలుగుదేశం పార్టీ మోదీ ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన పిదప ఆ మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ఢిల్లీలో జాతీయస్థాయి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి తాము అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చిందో తెలుపుతూ మాట్లాడిన సందర్భంలో కొన్ని అసందర్భ విషయాల గురించి అతిగా మాట్లాడటం తెలంగాణవాదులమైన మా బోటి వాళ్లను తీవ్ర మనస్తాపం కలి గించింది. బాబు వినిపించిన మాటలనే రాజ్యసభలో ఆ పార్టీ సభ్యులు తిరిగి వినిపించారు. అసహనం పేరుకుపోయిన వ్యక్తుల నుంచే ఇలాంటి అసందర్భ అనుచిత వాక్యాలు రావటం సహజం. అసలు మొత్తంగా వీళ్లు లేవనెత్తుతున్న ఆ అసందర్భ విషయాలు ఏమిటో పరిశీ లిద్దాం. 1.హైదరాబాద్‌ నా మానసిక పుత్రిక దానికి నేనే రూపమిచ్చా. 2. మోదీ, కేసీఆర్‌ల కన్నముందే నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఇద్దరు ప్రధాన మంత్రులను చేయడంలో నాదే కీలకపాత్ర. 3.మాది మెజారిటీ మైనార్టీలకు చెందిన విషయం కాదు మెజార్టీ మొరాలిటికి సంబంధించిన విషయం 4.యూటర్న్‌ తీసుకున్నది ఎవరు?

ముందుగా హైదరాబాద్‌ నా మానసిక పుత్రిక, దానికి నేను రూపమిచ్చా అనే దాన్ని పరిశీలిద్దాం. హైదరాబాద్‌ అభివృద్ధి వెనుక కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. చంద్రబాబు అనే వ్యక్తి పుట్టక ముందే ఇక్కడ అన్ని వసతులు, కీలక సంస్థలు నిజాంల కాలంలోనే నెలకొల్పారు. ఇక హైదరాబాదును పారిశ్రామికంగా తానే అభివృద్ధి చేసినట్లు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ను ఒప్పించి ఇక్కడ ఐ.టి. అభివృద్ధికి కృషిచేసినట్లు చెప్పుకున్నారు. కానీ ఒక్క ఐటీ పరిశ్రమ ఇక్కడికి వస్తే పది నిజాంల కాలంలో వెలసిన పరిశ్రమలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయనే నెపంతో మూసివేసిన ఘనత మీ పాలనలోనిదే. ఆ విధంగా మూతబడ్డ పరిశ్రమలు ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలోనే ఉన్నవి. హైదరాబాదుకు మీరిచ్చిన రూపం ఇదేనా? 

‘‘మీ కంటే నేనే సీనియర్‌ను. మోదీ, కేసీఆర్‌లకన్న ముందే నేను సీఎంని అయ్యా’! అనే మాటల్లో వ్యక్తికి ఉండే అహంకారం, అసహనం తప్ప మరేమీ కనిపిం చటం లేదు. మీరు మోదీ, కేసీఆర్‌ల కన్న ముందే సీఎం అయిన్రు. కాని ఎట్ల అయిన్రు అన్నది ప్రశ్న. కుట్రజేసి మీ మామను గద్దెదించి గద్దెనెక్కిన వైనం ఎవరికి తెలువదని? రాజకీయాల్లో  మీకున్న అనుభవమల్లా ఇదేనా? పైగా మీరు సీఎం అయినా, మోదీ ప్రధాని అయినా అది మీవల్ల కాదు, ప్రజల వల్ల. ప్రజలే మీ ఇద్దరి కన్న గొప్ప. ప్రజలు తలచుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓడలు బండ్లయితవి. బండ్లు ఓడలయితవి అని మర్చిపోవద్దు.

 నైతిక విలువలను ఇతరులకు చెప్పేవాళ్లు కొంతలో కొంతైన తమ నిత్యజీవితంలో ఆచరించడం మంచిది.  రాజకీయాలలో ఏ నైతిక నియమాలను పాటించి  మీరు సీఎం అయ్యిన్రు.  23 మంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను మీ పార్టీలో చేర్చుకోవడమే కాక వారిలో నలుగురికి మంత్రి పదవులను కట్టబెట్టడం నైతికమా? మొదట స్పెషల్‌ హోదాను కాదని స్పెషల్‌ కేటగిరీకి ఒప్పుకున్నారు. మళ్లీ ఇప్పుడు స్పెషల్‌ హోదా కోరుతున్నది ఏ నైతిక విలువల ప్రకారం? తాను మొరాలిటి పక్షాన మెజారిటీపై పోరాడుతున్నానని తనది ధర్మపోరాటమని, ఈ పోరాటంలో తనతో అందరూ కలిసిరావాలని కోరడం జరిగింది. మొదటి నుంచి ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్న వారిది ధర్మపోరాటం కాదట. కాని తన ఒక్కనిదే ధర్మపోరాటం అనడం ఆశ్చర్యకరం. తనతో కలసి వచ్చే వాళ్లు నీతిమంతులు, ధర్మకర్తలట. తనతో కలసిరాని వాళ్ళు అవినీతి పరులు, అధర్మకర్తలట. 

ఇక చివరగా వీరంటున్న యూటర్న్‌ గురించి చర్చిద్దాం. రాజకీయపార్టీలు తమ అవసరాన్ని ఇతర పార్టీలతో కలిసి జతకడుతూ ఉంటాయి. కానీ బాబులాగా యూటర్న్‌ మాత్రం తీసుకోవు. యూటర్న్‌ రాజకీయాలకు శ్రీకారం పడ్డది చంద్రబాబు ద్వారానే. గత ఎన్నికలలో ఎన్డీయేతో కలిసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టి పోటీ చేసి గెలిచి కేంద్రంలో నాలుగేళ్లు అధికారంలో కొనసాగి తీరా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి కాంగ్రెస్‌ మద్దతుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం యూటర్న్‌ రాజ కీయం కాదా? 

నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ప్రధాన కారకుడు బాబు, అతని యూటర్న్‌ అనైతిక రాజకీయాలు. తన తప్పుల్ని సరిదిద్దుకోకుండా తప్పులన్నింటిని ఇతరులపై నెట్టే ప్రయత్నంలో భాగంగానే అతను కేంద్రంపై పోరాటానికి పిలుపునిచ్చింది. ఓ రాష్ట్ర సీఎంగా ఉంటూ ప్రజలను పోరాటానికి రమ్మని పిలుపునివ్వటం బాధ్యతారాహిత్యమే. గత నాలుగేళ్లుగా ఏపీ సమస్యలపైనా దాని అభివృద్ధి పట్ల దృష్టి సారించక  ఈ రోజు మేల్కొని పోరాటానికి పిలుపునివ్వటం, ప్రజ లను తనతో కలిసి రావాల్సిందిగా కోరటం విచారకరం. బాబు ఇప్పటికైనా అనవసరమైన రాద్ధాంతాల జోలికి పోకుండా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారిస్తారని ఆశిద్దాం.


ప్రొ‘‘ జి.లక్ష్మణ్‌, వ్యాసకర్త అధ్యాపకులు, ఉస్మానియా యూనివర్సిటీ
మొబైల్‌ : 98491 36104
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top