మాజీ అధికారులకే అందలం

Madabhushi Sridhar Article On Centre RTI Commissioners Appointment - Sakshi

విశ్లేషణ

‘‘మీకు మాజీ అధికా రులు తప్ప మరెవరూ కేంద్ర సమాచార కమిషనర్‌ పదవికి అర్హులుగా కనిపించడం లేదా?’’ అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అంజలీ భరద్వాజ్‌ సీఐసీ నియామకాలపై దాఖలుచేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. ఇదే విషయాన్ని అనేకమంది ఆర్టీఐ కార్యకర్తలు, మాజీ కమిషనర్లు, ఈ రచయితతో సహా అడిగినా పట్టించుకున్న నాథుడు లేడు. రాష్ట్రపతికి లేఖ రాస్తే చదివినవారు లేరు. అసలు కదలికే లేదు.

కమడోర్‌ లోకేశ్‌ బత్రా, అంజలీ భరద్వాజ్, అమ్రితా జోహ్రీ ఆర్టీఐ అభ్యర్థనలపై  ప్రభుత్వం కొన్ని పత్రాలను వెల్లడిచేసింది. ప్రభుత్వం ఒక పద్ధతి లేకుండా వ్యవహరించిందని తేలింది. అన్వేషణ సంఘం ఎంపిక బృందానికి పంపినవి 14 మంది పేర్లు. అందులో 13 మంది మాజీ ప్రభుత్వ అధికారులవి, ఒక్క పేరు మాత్రం మాజీ హైకోర్టు న్యాయమూర్తిది. అంజలీ తరఫు న్యాయవాది అసలు దరఖాస్తులు పంపుకోకపోయినా ఇద్దరినీ పరిగణిం చారని చెప్పారు. సురేశ్‌చంద్ర, అమీసింగ్‌ ల్యూఖామ్‌ ఈ పదవికోసం దరఖాస్తులు పెట్టుకోలేదని వెల్లడైంది. కానీ వారిపేర్లు తుదిపరిశీలనకు వెళ్లడం, సురేశ్‌ చంద్ర నియమితులు కావడం తెలిసిందే. న్యాయమూర్తులు ఎ.కె. సిక్రీ, ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌... ‘‘మేము మా అనుభవంతో చెబుతున్నాం. విభిన్న ట్రిబ్యునళ్ల పాలక సభ్యులుగా ఎందరో అధికారు లను మేము ఇంటర్వూ్య చేస్తూ ఉంటాం. వారిలో సాధారణంగా ఒక అభిప్రాయం నెలకొని ఉంటుంది. బ్యూరోక్రాట్లు మాత్రమే ఉత్తములని వారు అనుకొంటూ ఉంటారు. చాలా కాలం పాలనా రంగంలో ఉండటం వల్ల వారికి విస్తారమైన అనుభవం ఉందనడంలో సందేహం లేదు. కాని మిగతా రంగాలలో సుప్రసిద్ధులైన వారు ఒక్కరు కూడా సమాచార కమిషనర్‌ పదవికి పనికి వస్తారని ప్రభుత్వం వారికి కనిపించలేదంటే ఆశ్చర్యం కలుగుతున్నది’’ అని వ్యాఖ్యానించారు.

ఏం చెప్పమంటారు? కేంద్రం అయినా రాష్ట్రా లలో అయినా సరే సమాచార కమిషనర్‌ పదవికి మాజీ అధికారులను ఎంచుకోవడం పరిపాటిగా మారింది. ఇక ఆ ఎంపిక విధానంలో కూడా అంత దాపరికం ఎందుకో అర్థం కాదు. దాపరికంలేని పారదర్శక పాలనను ప్రోత్సహించవలసిన బాధ్యత చట్ట పరంగా నిర్వహించవలసిన సమాచార కమిషనర్ల ఎంపికలోనే లేకపోతే సమాచార హక్కు చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేదెవరు?

కమిషనర్‌ పదవికి దరఖాస్తులు పంపుకోవా  లని నోటిఫికేషన్లు ప్రచురించేందుకు వేలాది రూపాయల ప్రజాధనం చెల్లిస్తారు. ఆ ప్రకటనలు లోపాలతో ఉంటాయి. కమిషనర్‌ పదవీకాలం ఎంతో చెప్పరు. జీత భత్యాల గురించి తరువాత చెబుతాం అంటారు. స్థాయి హోదా జీతం తెలియని పదవికి చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకోకపోవచ్చు. ఆర్టీఐ చట్టం కమిషనర్‌ హోదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయిలో ఉన్న ఎన్నికల కమిషనర్‌ హోదాతో సమంగా ఉంటుందని స్పష్టంగా తెలియజేసినా, సర్కారు వారు తమ ఇష్టానుసారం íసీఐసీ హోదాను జీతాన్ని మార్చడానికి వీలుగా చట్టాన్ని సవరించాలనుకుంటున్నారు. అందువల్ల చట్టం నీరుగారిపోయినా, సమాచారం జనానికి అందకుండా పోయినా ఫరవాలేదన్నట్టు, అదే కావాలన్నట్టు వ్యవహరిస్తున్నారనడానికి ఇటీవలి నియామకాలే సాక్ష్యం.

ఆగస్టు 27, 2018నాడు సుప్రీంకోర్టుకు కేంద్రం ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారిని ఎంపిక చేయడానికి కొన్ని పద్ధతులను రూపొందిస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది. తీరా మినిట్స్‌ చూస్తే.. అడిగిన వారిని పక్కన పెట్టి, ఏ పద్దతీ లేకుండా అడగని వారికి కూడా పదవి ఇవ్వాలని వీరు ప్రతిపాదించారు. సురేశ్‌చంద్ర దర ఖాస్తు చేసుకోకపోయినా అన్వేషణ సంఘం ఆయ నను ఎంపిక చేసింది. ఆ ఎంపిక ఆధారంగా ఆయన కమిషనర్‌గా నియమితులైనారని కోర్టుకు విన్నవించారు. ఆర్టీఐ చట్టం అమలులో ఉన్నా, ప్రజలకు అడిగిన సమాచారం ఇవ్వకుండా దాచడానికి వీలుగా నియామకాల సమయంలోనే విధేయులైన మాజీ అధికారులను నియమిస్తే, రాబోయే కాలంలో సమాచారం వెల్లడవకపోయే అవకాశం ఉందని సమాచార హక్కు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  

కాంగ్రెస్‌ సంకీర్ణం స్థానంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రధాన కమిషనర్‌ ఎంపిక విషయంలో భిన్నమైన ధోరణిని అనుసరించింది. పనిచేస్తున్న కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన కమిషనర్‌గా నియమించలేదు. దాదాపు ఏడాది పాటు చీఫ్‌ కమిషనర్‌ లేనే లేడు. ఈ సంప్రదాయాన్ని కాదని సీనియర్‌ కమిషనర్‌ యశోవర్ధన్‌ ఆజాద్‌ను చీఫ్‌ కమిషనర్‌గా నియమించకుండా, కొత్త వ్యక్తిని నియమించారు. ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుని సీనియర్‌ కమిషనర్‌ సుధీర్‌ భార్గవ్‌ను చీఫ్‌గా నియమించారు. ఇందువల్ల ఒక జూనియర్‌ కమిషనర్‌ కింద పనిచేసే ఇబ్బంది ఆయనకు తప్పింది.  ఆజాద్‌కు ఆ సౌకర్యం నిరాకరించారు.


మాడభూషి శ్రీధర్‌,
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌
(madabhushi.sridhar@gmail.com)

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top