
సమీక్షణం :కథావిమర్శ- కొత్త ఒరవడి
కథ, కథ నేపథ్యం, కథ ప్రయోజనం గురించి విశ్లేషించే ముప్ఫై విమర్శనా వ్యాసాలివి. కథ బాగుందని, లేదని ‘సర్టిఫై’ చెయ్యడానికి కాకుండా, కథకి ప్రాణం పోసిన సామాజిక మూలాల్ని విశ్లేషించడానికి లోతైన పరిశీలన చేశాడు రచయిత. అవసరమైన చోట లోపాల్ని నిర్మొహమాటంగా ఎత్తిచూపాడు.
కథావిమర్శ- కొత్త ఒరవడి
పుస్తకం : సమకాలీనం (కథావిమర్శ)
రచన : ఎ.కె.ప్రభాకర్
విషయం : కథ, కథ నేపథ్యం, కథ ప్రయోజనం గురించి విశ్లేషించే ముప్ఫై విమర్శనా వ్యాసాలివి. కథ బాగుందని, లేదని ‘సర్టిఫై’ చెయ్యడానికి కాకుండా, కథకి ప్రాణం పోసిన సామాజిక మూలాల్ని విశ్లేషించడానికి లోతైన పరిశీలన చేశాడు రచయిత. అవసరమైన చోట లోపాల్ని నిర్మొహమాటంగా ఎత్తిచూపాడు. వివిధ కథకుల కథలు, కథాసంపుటుల కథల పరామర్శతో కథా సర్వస్వమనదగిన ఈ సంకలనంలో రచయిత కథాసంపుటులకు రాసిన ముందుమాటలతో పాటు భారతీయ కథల, అనువాద కథల ప్రసక్తి కూడా ఉన్నది.
తెలుగు కథ ఒక అనివార్యమైన సామాజిక ఆచరణలో భాగంగా పుట్టిందని భావించే వ్యాసకర్త కథారచయితలు జీవన పోరాటాన్ని చిత్రించడానికి అస్తిత్వ చైతన్యం, అణచివేత, గ్లోబలైజేషన్, హక్కుల కోసం ఉద్యమాలు, వివిధ వాదాల ఆవిర్భావం వంటివి ఏ విధంగా కథలుగా రూపుదిద్దుకున్నాయో వివరిస్తాడు. వర్తమాన తెలుగు కథల స్వరూప స్వభావాల్ని ఇష్టంగా పరిశీలించి కథావిమర్శ స్థాయిని పెంచాడు ప్రభాకర్.
- చింతపట్ల సుదర్శన్
పేజీలు: 200; వెల: 150
ప్రతులకు: స్పృహ సాహితీ సంస్థ, 1-8-702/33/20ఎ, పద్మ కాలనీ, నల్లకుంట, హైదరాబాద్-44.
ఫోన్: 040-27761510
హరితకలల అలలు...
పుస్తకం : పట్టుకుచ్చుల పువ్వు (కవిత్వం)
రచన : దాసరాజు రామారావు
విషయం : పుస్తకం ముఖచిత్రం చూడగానే పల్లెదనం పరిమళమై ఆహ్వానిస్తుంది. లోనికి వెళితే... తెలంగాణ ఆత్మగౌరవ కవిత్వం ఉంది. కళ తప్పిన మనిషి గురించి కన్నీళ్లు ఉన్నాయి. ఎఫ్.ఎం. తంత్రుల మీద కనిపించే వంకర నడకల యవ్వనం ఉంది. దుఖఃనుభవాలు ఉన్నాయి. ‘పత్రాల్లో హరిత కలలను దాచుకున్న చెట్టుకు’ అని రాశారు కవి. ఊహ జోడించి చూస్తే ఈ పుస్తకం కూడా ఒక పచ్చటి చెట్టు వలె మన ముందు నిలుచుంటుంది. ఇక పత్రాల్లో హరితకలలన్నీ కవిత్వమై హోరెత్తిస్తుంటాయి. ఇది నిజం!
- రఘువీర్
పేజీలు: 136; వెల: 50; ప్రతులకు: ముఖ్య పుస్తక కేంద్రాలతో పాటు, డి.విజయలక్ష్మి, 13-30/79, సాయి భగవాన్ కాలనీ, భెల్-రామచంద్రాపురం. ఫో: 9618224503
విలక్షణ వస్తువు ‘సిక్కెంటిక’
పుస్తకం : సిక్కెంటిక (కథలు)
రచన : జిల్లేళ్ల బాలాజీ
విషయం : దశాబ్ది కాలంగా వివిధ పత్రికల్లో ప్రచురితమైన 15 కథలను ‘సిక్కెంటిక’ తొలి కథాసంపుటిగా ప్రచురించారు రచయిత. వీటిలో ఎక్కువ బహుమతి పొందిన కథలున్నాయి.
శీర్షిక కథ ‘సిక్కెంటిక’లో దేవాని మొగుడు చనిపోగానే అత్త ఆరళ్లు భరించలేక క్షురక వృత్తి నేర్చుకొని, సవరాలు అమ్ముతూ జీవనయానం సాగిస్తుంది. దేవాని వెంట్రుకలు చూసి ఒకామె మోజుపడి అటువంటి వెంట్రుకల సవరం కావాలని అడుగు తుంది. ఆవిడ డబ్బు ఆశతో తాను గుండు చేయించుకొని, సవరం తయారుచేసి అమ్ముకుంటుంది. ఆవిడ ఆర్థిక దుస్థితి పాఠకుల చేత కంటతడి పెట్టిస్తుంది. ఈ కథల్లో ఆత్మాభిమానం గల నాదస్వర కళాకారుల కథలున్నాయి (సజీవం). పాఠకుల గుండెలు పిండే కరుణ రసాత్మక గాథలున్నాయి (బంగారు గాజులు). కథలన్నీ రాయలసీమ మాండలికంలో తీర్చిదిద్దాడు.
- డా॥పి.వి.సుబ్బారావు
పేజీలు: 152; వెల: 90; ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలూ.
మరింత ‘ఆదా’యం కోసం...
పుస్తకం : మనీపర్స్-2
రచన : వంగా రాజేంద్రప్రసాద్
విషయం : గొప్ప పెట్టుబడి వ్యూహాలు ఉంటేనే ధనవంతులుగా మారుతారనే అభిప్రాయం నుంచి సామాన్యుడు సైతం ధనవంతుడిగా మారే సూచనల సమూహారమే మనీపర్స్-2. శ్రమలేని ‘ఆదా’యం అని మొదటి పేజీలోనే ఉన్న అంశానికి సార్థకత చేకూర్చేలా కొద్దిపాటి సంపాదనతోనే పొదుపు, మదుపు ఎలా చేయాలో వివరించారు రచయిత. బ్యాంకు ఆర్‌డీలు, బ్యాంకు ఖాతాతో బీమా సౌకర్యాన్ని ఆర్థిక ప్రణాళికలో ఎలా భాగం చేసుకోవచ్చో వెల్లడించారు. రిటైర్మెంట్ తర్వాత పిల్లల చీత్కారానికి గురికాకుండా జాగ్రత్తపడటం ఎలాగో తెలిపారు. మొదటి పుస్తకంలో చిట్స్, మ్యూచ్‌వల్‌ఫండ్ వంటి అంశాలు పరిచయం చేయగా ఇందులో వాటినే లోతుగా విశ్లేషించారు. డబ్బు సంపాదన ఆవశ్యకతను నొక్కిచెప్తూనే, దాన్ని పనిముట్టుగా ఉపయోగిస్తూ సేవ, ప్రేమ, బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో ముక్తాయించిన విధానం బాగుంది.
- శ్రీధర్
పేజీలు: 280; వెల: 250
ప్రతులకు: విశాలాంధ్రతో పాటు, వంగా పద్మజ, వంగా ముత్యాల బంజర్, ఖమ్మం జిల్లా-507302. ఫోన్: 0870 2446479
కొత్త పుస్తకాలు
1.మమత అరాచక పాలనలో పశ్చిమ బెంగాల్ పయనం ఎటు?
ప్రచురణ: బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ కమిటీ
తెలుగు: వేదుల రామకృష్ణ
పేజీలు: 166; వెల: 70
2. భారత చంద్రయానం
తమిళ మూలం: డా. టి.వి.వెంకటేశ్వరన్
తెలుగు: ఎజి. యతిరాజులు
పేజీలు: 162; వెల: 80
3.హేతువు తిరగబడింది (మార్క్సిస్టు తత్వశాస్త్రం-ఆధునిక సైన్స్)
ఆంగ్లమూలం: అలెన్ వుడ్, టెడ్ గ్రాంట్
తెలుగు: పొట్లూరి వెంకటేశ్వరరావు
ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌస్, చిక్కడపల్లి, హైదరాబాద్-20.
ఫోన్: 27608107
క్రీస్తుమార్గం
రచన: అలపర్తి పిచ్చయ్య చౌదరి
పేజీలు: 90; వెల: 60
ప్రతులకు: రచయిత, 42/169, జయనగర్ కాలనీ, కడప-516002. వైఎస్‌ఆర్ జిల్లా.
ఫోన్: 08562-253734
మిణుగురులు (హైకూలు)
రచన: డా. రమణ యశస్వి
పేజీలు: 86; వెల: 60
ప్రతులకు: రచయిత, యశస్వి హాస్పిటల్, కాకాని రోడ్, గుంటూరు-522001.
ఫోన్: 9848078807
తుంబురు తీర్థం
రచన: బి.వి.రమణ
ఫొటోలు: బి.బాలు
పేజీలు: 24; వెల: 50
ప్రతులకు: ఎన్.సంగీత, 6-3-221, మాంచాల స్ట్రీట్, రాజన్న పార్క్ దగ్గర, తిరుపతి-517501.
చలపాక ప్రకాష్ కార్టూన్లు-2
పేజీలు: 56; వెల: 40
ప్రతులకు: సీహెచ్ కృష్ణప్రియ, 1-4/3-36, సంజయ్‌గాంధీ కాలనీ, విద్యాధరపురం, విజయవాడ-12.