ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే... | corporate companies in interview problems | Sakshi
Sakshi News home page

ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే...

Published Sun, Jul 19 2015 1:01 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే... - Sakshi

♦  నేనో కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాను. టీమ్ లీడర్‌ని కావడంతో చాలా ప్రెజర్ ఉంటుంది. టార్గెట్ రీచ్ కావాలన్న తపనతో ఒక్కోసారి నా కింద పని చేసేవాళ్ల మీద ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతూంటుంది. కానీ దాన్ని మా టీమ్ అపార్థం చేసుకుంటు న్నారు. నేను వాళ్లని హింసిస్తున్నానని అనుకుంటున్నారు.
వాళ్లలా అనుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో తెలియజేయండి?
- మానస, హైదరాబాద్

 
కార్పొరేట్ రంగంలోని ఒత్తిడి వల్ల చాలామంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సెల్ఫ్ కంట్రోల్, మనుషుల్ని డీల్ చేయడం, టైమ్ మేనేజ్‌మెంట్ తెలిస్తే ఈ సమస్యను తేలికగా పరిష్కరించుకోవచ్చు. మీ కొలీగ్స్ మీలో ఏయే లక్షణాలు ఇష్టపడటం లేదు, ఏ కారణాల వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఆ లక్షణాల్లో మార్పు చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొలీగ్స్‌తో మాట్లాడేటప్పుడు వాయిస్ పెంచకుండా నెమ్మదిగా మాట్లాడండి.  

ఇది అందరి లక్ష్యం, అందరం కలిసి నెరవేర్చుకుందాం అంటూ వారిని మీతో కలుపుకుని మాట్లాడండి. ఎప్పుడూ పని గురించే కాకుండా అప్పుడప్పుడూ కాస్త సరదాగా కబుర్లు కూడా చెబుతుండాలి. వారి వ్యక్తిగత జీవితం గురించి కూడా మంచి చెడులు మాట్లాడుతూ, మీరు సంతోషంగా ఉండటం నాకు అవసరం అన్నట్లు మీరు ప్రవర్తిస్తే వారు తప్పక మీకు దగ్గరవుతారు.
 
♦  నేను ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రతి రిటెన్ టెస్ట్‌లో మంచి మార్కులు సంపాదిస్తాను. కానీ ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికే వస్తుంది సమస్య. వాళ్లు అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం నాకు తెలిసే ఉంటుంది. కానీ ఎంత ప్రయత్నించినా దాన్ని వెలిబుచ్చలేను. తడబడుతుంటాను. తప్పులు మాట్లాడతాను. దాంతో ప్రతిసారీ అవకాశాన్ని కోల్పోతున్నాను. ఎంతగా ప్రిపేర్ అయి వెళ్లినా ఫలితం ఉండటం లేదు. ఈ సమస్యను ఎలా అధిగమించాలి?
- మనోహర్, విశాఖపట్నం

 
మనోహర్‌గారూ... ఈ సమస్య చాలామందిలో సహజంగానే ఉంటుంది. దీనికే పర్‌ఫార్మెన్స్ యాంగ్జయిటీ అంటారు. ఇది సోషల్ ఫోబియాలో ఒక భాగం. ఒక పని చేస్తున్నప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందా అని ఆలోచించి భయపడటం వల్ల ఫలితం ఎప్పుడూ నెగిటివ్‌గానే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూల్లో ఫెయిల్ కావడానికి కూడా కారణం అదే. నా సమాధానాలు అవతలివారికి నచ్చుతాయో లేదో, ఇంటర్వ్యూ ఫలితం ఎలా ఉంటుందో ఏమో అని ఆలోచించి టెన్షన్ పడటం వల్ల సరిగ్గా పర్‌ఫార్మ్ చేయలేకపోతున్నారు. దీనిని నెగిటివ్ ఇమాజినేషన్ అంటారు.

దీనివల్ల మనిషి ఆలోచనల మీద నియంత్రణ కోల్పోతాడు. మనసులో ఉన్నదాన్ని బయటకు వెలి బుచ్చలేకపోతాడు. నోరు ఎండిపోవడం, చేతులకు చెమటలు పట్టడం, గుండె వేగం హెచ్చడం వంటి లక్షణాలతో ఉక్కిరిబిక్కిర వుతాడు. కాబట్టి ముందు మీరు మీ ఆలోచనా పద్ధతిని మార్చుకోవాలి. జీవితంలో అవకాశాలనేవి వస్తూనే ఉంటాయి, ఈ ఇంటర్వ్యూయే జీవితం కాదు అన్నట్టుగా ఆలోచించాలి. దానివల్ల మీ మైండ్ రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. ఇంటర్వ్యూ బాగా చేయగలుగుతారు.
 
♦  నేనో గృహిణిని. నాకు నా కుటుంబ మంటే ప్రాణం. కానీ ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే చిరాకు పడిపోతుంటాను. పిల్లల మీద కూడా బాగా అరిచేస్తాను. దాంతో నాకు కోపం ఎక్కువన్న ముద్ర పడిపోయింది. ముక్కు మీదే ఉంటుంది కోపం అని అందరూ అంటుంటే మనసు చివుక్కు మంటుంది. నిజానికి నేను అంతగా కోప్పడుతున్నానన్న విషయం నాక్కూడా తెలియదు. నామీద పడిన కోపిష్టి అన్న ముద్రనెలా పోగొట్టుకోవాలి?
- విజయ, కరీంనగర్

 
కోపం అనేది విపరీతమైన ఒత్తిడి వల్లో, మానసికంగా బలహీనపడటం వల్లో కూడా వస్తుంది. మీరు గృహిణిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఒత్తిడికి లోనవడం వల్ల ఈ సమస్య వచ్చింది. మీరు కుటుంబానికే కాదు, మీకోసం కూడా కొంత సమయం కేటాయించండి. రిలాక్స్ అవ్వండి. అలాగే మీకు ఏయే విషయాల్లో కోపం వస్తోందో లిస్ట్ రాసుకోవడం వల్ల మీ బలహీనతలు, విసుగులు మీకు అర్థమవుతాయి.

తద్వారా కోపం తగ్గించుకోవ డానికి ప్రయత్నం చేయవచ్చు. కోపం వచ్చినప్పుడు మనసును వేరేవైపు మళ్లించి, మీకిష్టమైన ఏదో ఒక పని చేయండి. పుస్తకాలు చదవడమో, సంగీతం వినడమో చేయండి. ఒత్తిడి అదే తగ్గిపోతుంది. మెల్లగా మీవాళ్ల మనసుల్లో మీ మీద పడిన ముద్ర కూడా తొలగి పోతుంది. ఇది చిన్న సమస్య. మీరు  తేలిగ్గా అధిగమిస్తారు. దిగులుపడకండి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement