వివరం: భగవానుడు గీసిన గీత

వివరం: భగవానుడు గీసిన గీత


ఇహ పర లోకాలలో సుఖాన్ని సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. ఒక కాలానికీ, ప్రాంతానికీ చెందిన ఒక మనిషి యొక్క అభ్యుదయాన్నీ శ్రేయస్సునూ కోరుకుంటూ తగిన మార్గాలను బోధించేవాడు గురువవుతాడు. సర్వ దేశాలకు, సర్వ కాలాలకు, సర్వ జాతులకు వర్తించే విధంగా జగత్తులోని ప్రతి మానవుణ్నీ ఉద్దేశించి అభ్యుదయ నిశ్శ్రేయస మార్గాలను రెండింటినీ మహోదాత్తమైన పద్ధతిలో, విశ్వజనీనమైన ‘భగవద్గీతా’ రూపంలో ఉపదేశించడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు.

 

 చైత్ర శుద్ధ నవమి - ధర్మాన్ని ఆచరించిన శ్రీరాముని పుట్టినరోజు. శ్రావణ బహుళ అష్టమి - ధర్మాన్ని ఉపదేశించిన శ్రీకృష్ణుని పుట్టినరోజు. మార్గశిర శుద్ధ ఏకాదశి - శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ని నిమిత్తంగా చేసుకొని సకల మానవాళికి ‘గీత’ బోధించిన రోజు.

 ప్రపంచంలోని అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో జాగృతమై విరాజిల్లిందని ఉపనిషత్ గ్రంథాలకు పీఠికలు రాసిన అనేక మంది జ్ఞానులు చెబుతున్నారు. ‘ఆధ్యాత్మము’ అంటే ప్రాణుల స్వభావము లేదా వాస్తవ రూపం! దీని గురించి వివరంగా తెలుసుకునే విద్యే ఆధ్యాత్మ విద్య! ఇంకా సరళంగా చెప్పాలంటే - ఎక్కణ్నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడికి వెళ్లాలి, అందుకు ఏం చేయాలి?... అనేవి సంక్షిప్తంగా చెప్పే శాస్త్రమే ‘గీతా’ శాస్త్రం!

 చాలా మతగ్రంథాల్లాగా ప్రత్యేకంగా రాయబడిన గ్రంథం కాదిది. మహాభారతమనే ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకూ 700 శ్లోకాలతో 18 అధ్యాయాలుగా విభక్తమై ఉంది భగవద్గీత!

 స్కూల్లో టీచరు సంవత్సరమంతా పాఠం చెప్పి, పరీక్షల ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పినట్టు - మొత్తం లక్ష శ్లోకాల భారతంలో - జీవితంలో పాసైపోవడానికి 700 శ్లోకాలు చాలన్నట్టుగా బయటకు తెచ్చిందే - భగవద్గీత!

 అర్జునుడి విషాదం వల్ల కృష్ణుడు గీత బోధించవలసి వస్తుంది. యుద్ధంలో తనవాళ్లందరూ మరణిస్తారన్నది అర్జునుడి చింతకు మొదటి కారణం. తానే వారందరినీ చంపడం అధర్మం అనే భావన రెండో కారణం. ఈ విషాద కారణాలు రెండింటినీ తొలగించి, అర్జునుని స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరించడానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నమే భగవద్గీత!




 నిరుడు రాసిన పుస్తకానికి అదే సంవత్సరంలో కాలం చెల్లడం చూస్తున్నాం! మరి ఒకటా రెండా 5,152 సంవత్సరాల క్రితం ఉపదేశించబడి నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట... బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లోనో, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లెక్చర్స్‌లోనో, మోటివేషన్ స్పీచుల్లోనో, మోరల్ వ్యాల్యూస్ చర్చల్లోనో... ఏదో ఒక సందర్భంలో ‘గీత’ గురించి మాట్లాడుకోవడం... అమెరికన్ సెనేట్‌లో ‘భగవద్గీత’ మీద ప్రమాణం చేసి, కాంగ్రెస్ సభ్యురాలిగా తులసీ గబ్బర్డ్ పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దేశమంతా గర్వపడుతూ చప్పట్లు చరచడం... గీత శక్తిని ప్రపంచానికి చాటడమే అవుతుంది. పైగా...

 ‘భగవద్గీతా కించి దధీతా...’ భగవద్గీతను ఏ కొంచెం అధ్యయనం చేసినా వాడి గురించి యముడు చర్చించడని శంకరాచార్య...

 ‘జ్ఞానం గురించి లోతైన అవగాహన నాకు భగవద్గీత వల్లే ఏర్పడింది’ అని మాక్స్‌ముల్లర్...

 ‘శాశ్వతమైన ప్రమాణాలు గల ఉపదేశానికి సంక్షిప్త రూపమే భగవద్గీత. ఇది భారతీయులకే కాదు మానవ లోకానికంతటికీ సుస్థిరమైన ఉత్తమ ప్రయోజనాన్నిస్తుంది’ అని ఆల్డస్ హక్‌స్లీ...

 ‘ప్రతిఫలాపేక్ష విడిచి కర్మలను ఆచరించడమనే అద్భుతమైన సూచననిచ్చి, మానవ బలహీనతల్ని రూపుమాపి ఉత్తమ సమాజాన్ని నిర్మించగలిగే బలాన్నివ్వడం భగవద్గీత గొప్పదనం’ అని స్వామి వివేకానంద...

 ఇలా మహానుభావుల అనుభవాల్లో భగవద్గీత గురించి వింటుంటే, గీత లౌకిక ప్రయోజనాలనీ, పారమార్థిక ప్రయోజనాలనీ రెండూ ఇస్తుందనే నమ్మకం కలగడం లేదూ!

 కాబట్టే - గీత మీద ప్రమాణం చేస్తే అంతా నిజమే చెప్పాలన్నంత పవిత్రతను ఆ గ్రంథానికి ఆపాదించటం జరిగింది.

 యుద్ధ రంగంలో నిలబడే రెండు పక్షాలూ ఒకరికొకరు శత్రువులు. అది యుద్ధ ధర్మం! అక్కడ నిలబడి ‘వీళ్లందరూ నావాళ్లు’ అని మమకారాన్నీ, ‘నేను చంపవలసి వస్తోంద’ని అహంకారాన్నీ ప్రదర్శించాడు అర్జునుడు - తాత్కాలికమైన మోహావేశంలో! అది గమనించి, ‘డ్యూటీ కరెక్ట్‌గా చేయాలంటే అహంకార మమకారాల్ని వదిలిపెట్టాలం’టూ డ్యూటీలో ఉన్న బ్యూటీ గురించి కృష్ణుడు చెప్పిందే గీత! పైగా జరుగుతున్న యుద్ధం - వ్యక్తుల మధ్య కాదనీ, ధర్మానికీ అధర్మానికీ మధ్య అనీ, చనిపోయేది శరీరమే కానీ ఆత్మ కాదనీ శాశ్వతమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఉపదేశించాడు కృష్ణుడు! మనుజుల కర్తవ్యాన్ని గుర్తుచేసి, జ్ఞాన బోధతో పరమాత్మను చేరే మార్గాన్ని చూపించడమే కృష్ణావతార వైశిష్ట్యం!

 ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ఫలితం పరమాత్మ వంతుగా భావించి, భవ బంధాలను వదలి చేయడమే మనిషి కర్తవ్యం... ఇదే గీతా సారాంశం!

    

 అసలు భగవద్గీత ఏం చెబుతుంది?


 ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.




 అసలు కృష్ణుడు అర్జునునికి ఉపదేశం మొదలెడుతూనే - ‘అశోచ్యా నన్వ శోచస్త్వం... దుఃఖింప తగనివారిని గూర్చి దుఃఖిస్తున్నావు’ అన్నాడు. నిజానికి మనం చేస్తున్నదీ ఇదే! ఏది అవసరమో అది వదిలేసి, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి బాధపడుతుంటాం! దేని గురించి ఎంత ఆలోచించాలో, ఎవరి గురించి ఎంత ఆలోచించాలో తెలుసుకోవడమే వివేకం! ఫేస్‌బుక్కుల ముందు విలువైన సమయమంతా పాడు చేసుకుంటున్న యువతరానికి భగవద్గీత పుస్తకం ప్రయోజనమేమిటో చెప్పాల్సి ఉంది.

 ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం... త్యక్త్వోత్తిష్ట..!’ నీచమైన మనో దౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి సంసిద్ధుడవై లే!’ అంటూ జాగృత పరచి, జీవన గమ్యానికి చేర్చే స్ఫూర్తినిస్తుంది గీత!




 భగవంతుడు కోరికని బట్టి ఇవ్వడు. అర్హతను బట్టి ఇస్తాడు. జ్ఞానులూ అంతే. ఆసక్తిని బట్టీ, అర్హతను బట్టీ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ‘శిష్యస్తేహం... శాధిమాం త్వాం ప్రపన్నం... దైన్యంతో ఆలోచనాశక్తిని కోల్పోయాను. శిష్యుడిగా అర్థిస్తున్నాను. సరైన మార్గం చూపించు!’ అని అర్జునుడు శరణు వేడాకే కృష్ణుడు గీత బోధ మొదలుపెట్టాడు. ఆసక్తి లేనివాడికి ఏ విషయమూ పట్టుబడదు. అందుకే ‘ఆసక్తి లేనివాడికి భగవద్గీత ఉపదేశించవద్ద’న్నాడు కృష్ణుడు.




 (ఇదంతే నా తపస్కాయ - (18-67).. భగవద్గీతే కాదు, ఏ సబ్జెక్టయినా అంతే! వేదికపైన ఉపన్న్యాసకుడు చెప్పిందే చెబితే, బోర్ కొట్టేస్తున్నాడంటారు. కాలేజీలో లెక్చరర్ చెప్పింది మళ్లీ మళ్లీ చెప్పాలి. దీన్ని రివిజన్ అంటారు. ‘గీత’లో కృష్ణుడు చేసిందీ ఇదే!

 అర్జునుడు ఆచరించాల్సిన కర్తవ్యాన్నీ, కాపాడుకోవాల్సిన క్షత్రియ ధర్మాన్నీ పలుమార్లు పలు విధాలుగా చెప్పాడు. కాబట్టే ‘న యోత్స్యే... (యుద్ధం చేయను) అని అన్నవాడు కాస్తా, గీతోపదేశంతో అజ్ఞాన జనితమైన సందేహాలు మొత్తం తొలగిపోయి ‘కరిష్యే వచనం తవ... నువ్వు చెప్పినట్టే చేస్తాను’ అన్నాడు అర్జునుడు.




 మనలోని ఆత్మగ్రంథం తెరుచుకోనంతవరకూ బాహ్య గ్రంథాలన్నీ నిరుపయోగాలు. మన ఆటంకాలన్నీ తొలగించి, మన ఆత్మను మనం దర్శించే అవకాశం కల్పిస్తుంది గీత!

 ఇంట్లో అమ్మా నాన్నా ఉన్నారంటే పిల్లల ప్రవర్తన అదుపులో ఉంటుంది. సమాజంలో పోలీసు వ్యవస్థ ఉందంటే, జనం ప్రవర్తన అదుపులో ఉంటుంది. ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి, మరుజన్మ ఆధారపడి ఉంటుందని తెలుసుకుంటే, ఈ జన్మంతా అదుపులో ఉంటుంది. అదే చెబుతూ పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది గీత - ‘శరీరం యదవాప్నోతి.. (15-8)!

 మనం చేసే పనులు ఎవడూ చూడ్డం లేదనుకుంటే, పెద్ద పొరబాటే! ‘సర్వతోక్షి శిరోముఖం... సర్వత శృతిమల్లోకే..’ నువ్వు చేసేది చూస్తున్నాడు. మాట్లాడేది వింటున్నాడు పరమాత్మ! వాడన్నీ గమనిస్తుంటాడన్న విషయం బాల్యంలోనే అర్థమైపోతే, జీవితాన్ని పారదర్శకంగా, ఆదర్శవంతంగా గడిపేయొచ్చు!

 విశేషమేమిటంటే - భౌతికంగా గీతను బోధించినవాడు కృష్ణుడే అని మనం అనుకుంటున్నప్పటికీ, ‘గీత’ లో ఎక్కడా ‘కృష్ణ ఉవాచ’ అని కనిపించదు. ‘భగవాన్ ఉవాచ!’ అనే కనిపిస్తుంది. ఈ భగవానుడికి ఎవరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈ రకంగా జగత్తులో మానవుడని చెప్పబడే ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి చేసిన మహోదాత్తోపదేశం కాబట్టే గీత దేశ, కాల, జాత్యాదులకు అతీతంగా విరాజిల్లుతోంది. కర్మణ్యేవాధి కారస్తే... అంటూ ఫలితంపైన దృష్టి పెట్టకుండా, త్రికరణ శుద్ధిగా కర్మని ఆచరించమని చెప్పే గ్రంథాన్ని ఒక మతానికి ఎలా పరిమితం చేయగలం!


 భోగ లాలసత్వానికీ, దురాశలకీ, నీతి బాహ్యమైన భావావేశాలకీ లోను కాకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు త్రికరణ శుద్ధిగా ఆచరించాలని చెప్పే గీత నాకు తల్లి లాంటిది. స్వాతంత్య్ర సముపార్జనా దీక్షలో నాకు అమేయమైన శక్తినిచ్చింది భగవద్గీత.

 - మహాత్మాగాంధీ

 

 ఏదో విధంగా భోగమయ జీవితాన్ని గడపాలనే మానవ సమాజ ప్రవృత్తిని భగవద్గీత వ్యతిరేకిస్తుంది. ఉత్తమ లక్ష్య సాధన కోసం ఏ క్షణంలోనైనా, ఎలాంటి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలని బోధిస్తుంది. తెలివితేటల్నీ, కాలాన్నీ డబ్బుగా మార్చుకోవటంలోను, వీకెండ్స్ పేరుతో దాన్ని ఖర్చుపెట్టి ఆనందాన్ని కొనుక్కోవడంలోను బిజీగా ఉంటూ... అదే జీవితమనుకుంటున్న ఈ పరుగుల ప్రపంచానికి, భారతీయత కనిపించకుండా గ్లోబలైజేషన్ ముసుగు కప్పేసిన అధిక శాతం యువతరానికీ, భగవద్గీత ఉత్తమమైన, శాశ్వతమైన మార్గాన్ని సూచిస్తుందనడంలో సందేహం లేదు!

 

 హిందూ ధర్మ సాహిత్యం అనంతమైనది. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, సిద్ధాంతాలు! ‘వీటిలో దేన్ని అనుసరించాల’ని సామాన్యుడడిగే ప్రశ్నకి ఒకే సమాధానం చెప్పొచ్చు. వీటన్నిటి సారమూ - ‘సర్వ శాస్త్రమయీ గీతా..’ అని పేరుగాంచినదీ... సాక్షాత్తూ భగవానుడైన శ్రీకృష్ణుడే చెప్పినదీ ‘భగవద్గీత’ ఒక్కటి చాలు!

 

 ‘నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే... జ్ఞానంతో సమానమైనదీ పవిత్రమైనదీ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి జ్ఞానివి కమ్ము అంటూ అర్జునుణ్ని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని జ్ఞానులు కావాలని కాంక్షించింది గీత! అందుకే భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చిన విదేశీయులకు మన ధన, కనక, వస్తు, వాహనాలపైన కన్ను పడితే, జర్మనీ దేశస్తులు మాత్రం ‘మా దృష్టి భారతదేశంలోని ఆధ్యాత్మ జ్ఞాన సంపదపైన పడింది’ అన్నారు. వేదాల గురించి, భగవద్గీత గురించి అనేక సందర్భాలలో ప్రస్తావించిన ఎడ్విన్ ఆర్నాల్డ్, మాక్స్ ముల్లర్, ఓపెన్ హామర్‌లు జర్మనీ దేశం వారే! మహాత్మాగాంధీకి భగవద్గీతపైన మక్కువ ఏర్పడటానికి కారణం - ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన ‘ద సాంగ్ ఆఫ్ సెలెస్టల్’ అనే గీతానువాద గ్రంథమే!

 

 ఏం చదువుకున్న తర్వాత ఇంకా చదవడానికి మిగిలే ఉంటుందో - అది విజ్ఞానం! ఏం తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకునేందుకు మిగిలి ఉండదో - అది ఆధ్యాత్మ జ్ఞానం!

 ఆధ్యాత్మ జ్ఞానం లేకుండా మిగతా లౌకిక జ్ఞానాలన్నీ స్వార్థాన్నే ప్రేరేపిస్తాయి. మనదేశం ఈ స్వార్థంలోనే కొట్టుకుపోవడానికి కారణం - ప్రస్తుతం మన విద్యావ్యవస్థలో ఆధ్యాత్మ జ్ఞాన బోధన లేకపోవడమే!

 ఈ జ్ఞానం అవసరాన్ని గుర్తించడం వల్లే, న్యూజెర్సీ (యూఎస్‌ఏ)లోని ‘సెటన్ హాల్ యూనివర్సిటీ’ లో చేరే ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా భగవద్గీత చదవాలనే నిబంధన పెడుతూ, ఈ కోర్సుకు ‘ద జర్నీ ఆఫ్ ట్రాన్స్‌ఫామేషన్’ అని పేరుపెట్టారు. మరి ‘గీత’ పుట్టిన భారతదేశంలో మాత్రం ‘సెక్యులర్’ పేరుతో దీన్ని దగ్గరికే రానివ్వకపోవడం దురదృష్టకరం. పక్కింట్లో ‘గీత’ వినిపిస్తుంటే ఎవరో టపా కట్టేసుంటారనే స్థితి నుంచి, ‘తెల్లారింది... పక్కింటివాళ్లు లేచి పనులు చేసుకుంటున్నారు’ అనే స్థితికి సంకేతంగా ఒక ఉద్యమ స్థాయిలో గీతా ప్రచారం జరగవలసి ఉంది!



 

 ‘వీళ్లందరూ నావాళ్లు’ అని మమకారాన్నీ, ‘నేను చంపవలసి వస్తోంద’ని అహంకారాన్నీ ప్రదర్శించాడు అర్జునుడు - తాత్కాలికమైన మోహావేశంలో! అది గమనించి, ‘డ్యూటీ కరెక్ట్‌గా చేయాలంటే అహంకార మమకారాల్ని వదిలిపెట్టాలం’టూ డ్యూటీలో ఉన్న బ్యూటీ గురించి శ్రీకృష్ణుడు చెప్పిందే గీత!

 

 అందుకే గీత నేర్చుకుందాం. రాత మార్చుకుందాం. ఇంటింటా గీతాజ్యోతిని వెలిగిద్దాం.

 భగవద్గీత... ఉత్తమ జీవన విధాన మార్గం! మానవులకు ఆశాదీపం! సాధకులకు కల్పవృక్షం!

 సర్వేజనాస్సుఖినోభవన్తు!

 - గంగాధర శాస్త్రి

 గాయకుడు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు

 

 భగవద్గీత లాంటి కర్తవ్య బోధనా గ్రంథం లేకపోతే ప్రపంచ వాఙ్మయం

 పరిపూర్ణమైనట్టు కాదు.

 - ఎడ్విన్ ఆర్నాల్డ్,

 ‘ది సాంగ్ ఆఫ్ సెలెస్టన్ గ్రంథకర్త’

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top