జీవనశైలి వ్యాధులే టాప్‌ కిల్లర్స్‌

Lifestyle diseases biggest killer even in most backward states - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా టీబీ, డయేరియా వంటి వ్యాధుల కన్నా గుండె, శ్వాస సంబంధిత వ్యాధులతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. అత్యంత వెనుకబడిన రాష్ర్టాల్లోనూ జీవనశైలి వ్యాధులు విస్తృతమయ్యాయని పేర్కొంది. 1990ల వరకూ  అంటు,సీజనల్‌ వ్యాధుల కారణంగా అధిక మరణాలు నెలకొంటే తాజాగా జీవనశైలి వ్యాధులే జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయని స్టేట్‌ లెవెల్‌ డిసీజ్‌ బర్డెన్‌ ఇనీషియేటివ్‌ పేరిట వెల్లడైన నివేదిక పేర్కొంది.

దేశం అభివృద్ధి బాట పట్టినా పౌష్టికాహార లేమి ఇప్పటికీ అనారోగ్య కారణాల్లో ముందువరసలో ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 2016లో చోటుచేసుకున్న మరణాల్లో అంటు సీజనల్‌ వ్యాధుల కారణంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 26 శాతం కాగా, జీవనశైలి వ్యాధుల మరణాలు 60 శాతం పైగా ఉన్నాయి.గాయాలబారిన పడి మరణించిన వారి సంఖ్య 11 శాతంగా నమోదైంది. ఈశాన్య రాష్ట్రాల వారిలో జీవనశైలి వ్యాధులు ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఇక దేశవ్యాప్త మరణాల్లో 28 శాతం గుండె సంబంధిత వ్యాధులు కారణం కాగా, డయేరియా, ఇన్‌ఫెక్షన్లతో 15.5 శాతం, శ్వాసకోశ సమస్యలతో 11 శాతం, గాయాలతో 10.7 శాతం, క్యాన‍్సర్‌తో 8.3 శాతం మృత్యువాతన పడుతున్నారు. పక్షవాతం, మధుమేహం, కిడ్నీ వ్యాధులతో కూడా పెద్దసంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయని నివేదిక తెలిపింది. భారతీయ వైద్య పరిశోధన మండలి, భారత ప్రజారోగ్య ఫౌండేషన్‌ సంయుక్తంగా ఈ నివేదికను వెల్లడించాయి.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top