
చిన్నారుల్లో పౌష్టికాహార లోపం
రాష్ట్రంలో అత్యధికంగా అల్లూరి జిల్లాలో 37.60 శాతం పిల్లల్లో ఎదుగుదల సమస్య
పౌష్టికాహార లోపంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, సత్యసాయి జిల్లాలు
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడి
సాక్షి, అమరావతి: పౌష్టికాహార లోపంతో బాల్యం బక్కచిక్కిపోతోంది. ఎదుగుదల లోపం, బరువు తక్కువ, బక్కచిక్కిపోవడం వంటి సమస్యలతో ఐదేళ్లలోపు చిన్నారులు సతమతమవుతున్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇదే దైన్యం. రాష్ట్రంలో పౌష్టికాహార లోపంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా ఎదుగుదల లోపం, బరువు తక్కువ, బక్కచిక్కిపోయిన పిల్లలు ఉన్నారు. అనంతరం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల పోషకాహార లోపం సూచికలను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్ ట్రాకర్ డేటా నుంచి ఈ వివరాలు సేకరించారు. జూన్‌లో దేశంలో 37.07 శాతం మంది ఐదేళ్లలోపు పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. 15.93 శాతం పిల్లలు బరువు తక్కువగా ఉన్నారు. 5.46 శాతం మంది పిల్లలు బక్కచిక్కిపోయి ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ్ అభియాన్ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పోషణ్ ట్రాకర్ ద్వారా పౌష్టికాహారలోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి పౌష్టికాహారం అందిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో దేశం మొత్తంమ్మీద 7.36 కోట్ల మంది పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరారని, వీరిలో 7 కోట్ల మందిలో ఎత్తు, బరువు, పెరుగుదల, పౌష్టికాహార లోపాలను గుర్తించడంతో పాటు వాటి నివారణకు అవసరమైన చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.