నుదుటి కేక

women empowerment :  retold stories - Sakshi

మళ్లీ చెప్పుకుందాం!  

రీటోల్డ్‌ కథలు – 10

వీడు తగిలాడు. వీడు అనే సంస్కారం కాదు తనది. కాని వీడు అనదగ్గవాడే వాడు. అసలే తన టెన్షన్‌లో తాను ఉంది. పిరియడ్స్‌ వచ్చేలా ఉన్నాయి. వస్తే ఏం చేయాలి అనేది టెన్షన్‌. వచ్చాయని చెప్పాలా? చెప్తే... మొన్నొక రోజు ఆ ఇంటి పెద్దకూతురు మూడురోజుల పాటు బాత్‌రూమ్‌ పక్కన ఉన్న స్థలంలో కూర్చున్నట్టు తనూ కూచోవాలా. అక్కడే తినాలా? అక్కడే నిద్రపోవాలా? పోనీ చెప్పకుండా దాచేస్తే? అది మోసం కదూ. దాచామే పో. ప్యాడ్స్‌ను ఎక్కడ పారేయాలి? స్నానానికి వెళ్లినప్పుడు విప్పిన బట్టల్లో దాచి, తెచ్చి, బ్యాగ్‌లో పెట్టుకొని బయటకు వెళ్లి పారేయాలి. ఛీ. వాసన. తన ఇంట్లో అయితే ఇలాంటి సమస్య ఉండేది కాదు. పిరియడ్స్‌ వచ్చినా రాకపోయినా ఒకేలాగ తిరుగుతారు. ఏసునాథా... పిరియడ్స్‌ రాకుండా చూడు తండ్రీ. నవ్వొచ్చింది. ఏసునాథుడు ఎందుకు చూడాలి?ఇక్కడకు వచ్చేటప్పుడు లాకెట్‌లోని ఏసునాథుణ్ణి తీసి ఉత్త లాకెట్‌ వేసుకొని వస్తుంది. ఇక్కడకు వచ్చేటప్పుడు ఎర్రటి బొట్టుబిళ్లలు పెట్టుకొని వస్తుంది. ఇక్కడకు వచ్చేటప్పుడు ‘అండీ’ ‘ఔనండీ’ ‘చాలా బాగా చెప్పారండీ’ వంటి మాటలు మూతికి తగిలించుకుని వస్తుంది.

స్నేహితురాలు అలా అలవాటు చేసింది. ఆ అమ్మాయి మంచిది. తనంటే ఇష్టం. ప్రాణం. కులం ఏమిటి మతం ఏమిటి కడగొట్టుజాతి వాళ్లా కిరస్తానీలా పట్టించుకోలేదు. ఇష్టంవోయ్‌ నువ్వంటే అనేది. ఇంటికి తీసుకెళ్లేది– బొట్టు పెట్టాకే అనుకోండి. వాళ్ల అమ్మానాన్నలు సంప్రదాయం కలిగినవారు. పూజ, మడి, ఆచారం కలిగినవారు. అయితే ఏమిటి? ఇంతమంచి ముక్కూ ముచ్చట ఉన్న అమ్మాయి అచ్చు మనమ్మాయిలానే ఉంది అని అనేవారు.తను కూడా అలా ఉండేది.స్నేహితురాలి సమక్షంలో ఆ స్నేహితురాలే తనకు పూనినట్టుగా ఉండేది. ఆ సమయంలో రిక్షా వేసే తండ్రి చిరాగ్గా కనిపించేవాడు. తల దువ్వుకోక మాసిన చీర కట్టుకుని ఉండే అమ్మ చిరాగ్గా కనిపించేది. రోజు విడిచి రోజు నీసుకూర తెస్తే తప్ప ముద్ద దిగని తమ్ముడు, చిటికెలో మునుసును జుర్రి మూలిగని నోట్లో వేసుకునే తమ్ముడు చిరాగ్గా కనిపించేవాడు. సువార్తవాణి– అనే పేరులో సువార్తను కత్తిరించి అవతల పారేసింది.  పద్యం ఇష్టం అనేది. గద్యం ప్రాణం అనేది. పెద్దనను పెదనాన్నగా గుర్తించేది. ఫ్రెండ్స్‌ అందరి మధ్యా– మా ఇంట్లోనా మా ఇంట్లో నీసూ గీసూ అస్తమానం వండరమ్మా... మా అమ్మ ఎంచక్కా కొబ్బరీ శనగపప్పు వంటి కూరలే చేస్తుంది తెలుసా– అని చెప్పేది. మేము చర్చికి వెళితే వెళతాం లేకపోతే లేదు అనేది. ఇంకా ఏమిటి? అసలు చర్చే ఎగ్గొట్టేది.తనకు తెలుసు.

స్నేహితురాలి ఇంట్లో తను ఎంతో తానూ అంతే.కాని– ఆరోజు– అక్క బారసాలలో ఆ స్నేహితురాలు అందరు ముత్తయిదువుల కాళ్లకు పసుపు రాస్తూ  ‘చీ... నీకు పసుపు రాయకూడదే. నేను నీ పాదాలు ముట్టుకోకూడదు’ అని అన్నప్పుడు ఒక్కక్షణం వెనుకంజ వేసింది. వాళ్లవీ పాదాలే. తనవీ పాదాలే. మధ్యలో మైల ఎక్కణ్ణుంచి వచ్చింది?గట్టి స్నేహం ఇద్దరిదీ.తను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయింది. తాను లెక్చరర్‌ అయ్యి స్పాట్‌ వాల్యుయేషన్‌ పని ఉంటే హైదరాబాద్‌ వచ్చి, వాళ్ల అమ్మానాన్నలు అక్కడే సెటిల్‌ అయి ఉన్నారు కనుక, ఆ మాత్రం స్వతంత్రం లేదా నాకు అనుకుని దిగింది. పెద్దకూతురు, అల్లుడు కూడా వాళ్లతోనే ఉంటున్నారు. ఆమె తనకు అక్క. కనుక అతడు బావ. బావా బావా అని గౌరవంగా పిలిచేది. కాని ఇప్పుడు ఇలా తగిలాడు. బజారులో. కాఫీ కోసం హొటల్‌కు తీసుకెళ్లి ఏమిటేమిటో మాట్లాడుతున్నారు.‘మాదేముందండీ బతుకు బుగ్గి జీవితం మట్టి. అదే మీ వాళ్లలో అయితే లైఫ్‌ పైలాపచ్చీసుగా వెళ్లిపోతుంది. మా ఆడపిల్లలకు ఎంతసేపటికి సంగీతం అనీ సంప్రదాయం అనీ పద్ధతి పాడూ అనీ... మీలా ఫ్రీగా ఉంటారా వాళ్లు. ఫ్రీగా మూవ్‌ అవుతారా?అందుకేగా పల్లెల్లో పైకులాల వాళ్లు మీతో వామి చాటుకు వెళుతుంటారు. అసలు మీ డ్రస్సులూ, మీ ఫాస్ట్‌నెస్, అబ్బాయిలతో రాసుకుపూసుకు తిరిగే పద్ధతి... ఇవన్నీ నాకు పిచ్చండి. అలా ఉండాలి అమ్మాయిలు. మా ముండలూ ఉన్నారు. ఎందుకు? తగలెట్టుకోనా? అయినా ఈ మధ్య పల్లెల్లో రిస్క్‌ అవుతోందని విన్నాను. ఈ హైదరాబాద్‌లో అయితే ఎవరు పట్టించుకుంటారు లేండి. అంతదాకా వస్తే సైన్సు చాలా ఇంప్రూవ్‌ అయ్యిందిగా. ప్రివెన్షన్‌ మెథడ్స్‌ ఉన్నప్పుడు అక్కడిదాకా ఎందుకొస్తుందనేది నా ప్రశ్న. ఉండండి ఇక్కడ. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. నేనుంటాను. నాకు మీరుంటారు’...చాలా దుఃఖం కలిగింది ఆ రాత్రి. నిద్ర పట్టలేదు. ఎంత మాటన్నాడు. ఆ మాటనే ధైర్యం ఎవరిచ్చారు?

తెల్లారి గోలగోలగా ఉంటే నిద్ర లేచింది. స్నేహితురాలి తండ్రి భార్యను తిడుతూ ఉన్నాడు.‘దరిద్రపు ముఖమా అంటే దరిద్రపు ముఖమానీ. కార్పెంటర్‌తో సరిగ్గా పని చేయించవే అంటే చేయించలేదు. అన్నీ నేను చూసుకు చావాలా? నీ కళ్లు కాకలెత్తుకెళ్లాయా?’వింటూ ఉంది.‘ఏం దాపురించావే నాకు. ఏం దాపురించావూ అని. అసలు అగ్రహారం పుటకేనా నీది?’వింటూ ఉంది.‘ఇలాక్కాదు నిన్ను. నడ్డి మీద తన్ని ఏ మాలవాడకో మాదిగవాడకో తరమాలి. అప్పుడు తప్ప నీకు బుద్ధిరాదు. వాళ్లలో అయితే బాగా కలిసిపోతావు’ఎవర్ని తిడుతున్నాడీయన. ఆమెనా? తననా? స్త్రీజాతినా? దళిత బతుకునా? ఈ దేశంలో రెంటికీ తేడా అంటూ ఒకటి ఏడ్చిందా?నుదురు మీద ఏదో పెద్ద బరువు ఉన్నట్టు అనిపించింది. బొట్టు. తీసేసింది. తల్లి గుర్తుకొచ్చింది. తన తల్లి. తండ్రి గుర్తుకొచ్చాడు. తన తండ్రి. భాష గుర్తుకొచ్చింది. తన భాష. కూర గుర్తుకొచ్చింది. తన కూర. నుదురు గుర్తుకొచ్చింది. తన నుదురు. అవును. ఇదే తన నుదురు.కాసేపటికి బ్యాగు సర్దుకొని వెళుతూ వెళుతూ వాళ్ల ముందు నిలుచునింది. ‘వెళతానండీ’

‘సరే’కదులుతుంటే ఆమె అంది– ‘బొట్టు మర్చిపోయినట్టున్నావ్‌ అమ్మాయ్‌’ఆగి స్థిమితంగా జవాబు చెప్పింది– ‘మర్చిపోలేదండీ. నుదురు ఇలాగే ఉండాలి. నేను వాడ అమ్మాయిని. కిరస్తానీ పిల్లని’. ఆమె ముందే పర్స్‌లోని జీసస్‌ను తీసి చైన్‌లో వేసుకుంది కూడా.కథ ముగిసింది. వినోదిని రాసిన ‘తప్పిపోయిన కుమార్తె’ కథ ఇది. పేపర్లలో వార్తలు వస్తుంటాయి. దళిత ఆయాలు వండిన అన్నం మేం తినం అని పిల్లలు ధర్నా చేస్తుంటారు. ఏ వయసు నుంచి మనం విషం నూరిపోస్తున్నాం.  సినిమాల్లో గమనించారా? బికినీలలో ఉన్నవ్యాంప్‌ల పేర్లు మేగీ, రోజీ అని ఉంటాయి. పాపులర్‌ కల్చర్‌ ద్వారా ఏ భావజాలాన్ని పాదుకునేలా చేస్తున్నాం? పల్లెల్లో సామెతలు, జాతీయాలు, అశ్లీల భాష ఏ స్త్రీలను చులకన చేస్తున్నాయి? స్త్రీలే అణచబడ్డ వర్గం అంటే మళ్లీ ఆ వర్గంలో ఇంకా అణచబడ్డ స్త్రీ వర్గం. శతృవును పట్టుకోవాలంటే ఆ కన్నూ ఈ కన్నూ కలవాలి. ఇటు కదిలారు. ఓహ్‌.. అటు కూడా.
పునః కథనం: ఖదీర్‌
-వినోదిని 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top