ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది?


ఆయుర్వేద కౌన్సెలింగ్

 

నా వయసు 59 ఏళ్లు. నాకు విరేచనం సాఫీగా కావడం లేదు. బీపీ, షుగర్ వ్యాధులకు మందులు వాడుతున్నాను. నియంత్రణలోనే ఉన్నాయి. విరేచనం కోసం ఆయుర్వేద మందులు తెలియజేయగలరు.

 - వి.కె. రమణారావు, విశాఖపట్నం


 నిత్యవిరేచనం అవటంలో సమస్యలుంటే, దానిని ‘మలబంధం’ అనే పేరుతో వివరించింది ఆయుర్వేదం. జీర్ణకోశవ్యవస్థను ‘మహాకోష్ఠం’ అని చెప్పింది. ఇది పిత్తప్రధానంగా ఉండే ‘మృదుకోష్ఠం’. వాత ప్రధానంగా ఉంటే క్రూరకోష్ఠం. జీర్ణాశయ కర్మలన్నీ సజావుగా సాగిపోతే ‘సమకోష్ఠం’ మలబంధం వాతప్రకోపం వల్ల కలుగుతుంది. ఆహారంలో తీపి, పులుపు, ఉప్పు తగినంత ప్రమాణంలో లేకపోవడం, స్నిగ్ధాహారం లోపించడం (అంటే జిడ్డుగా మృదువుగా ఉండే పాయసాల వంటి ఆహారం), తాజా పండ్లు తినకపోవడం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పచ్చిగా ఉండేవీ, ఎండుఫలాలూ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. దానికి తోడు కనీసం రోజూ 3 లీటర్ల నీరు తాగడం అవసరం. ప్రతిరోజూ 45 నిమిషాలపాటు ఏదో ఒక రూపంలో వ్యాయామం చేయాలి. ముఖ్యంగా పొట్టని కదిలించే ‘కపాలభాతి’ వంటి యోగప్రక్రియలు, ఇతర యోగాసనాలు విరేచనం సాఫీగా కావడానికి ఉపకరిస్తాయి. రాత్రిపూట జాగారం చేయడం, తగినంత నిద్ర లేకపోవడం, మద్యం, పొగతాగే అలవాటు వంటివి కూడా మలబంధానికి దారితీస్తాయి. మానసిక ఒత్తిడి వల్ల కూడా పొట్ట ఉబ్బరించడం, మలబంధం సంభవించవచ్చు.



చికిత్స: మంచి ఆహార, విహారాలను పాటించడం అత్యవసరం  షుగరు, బీపీల వంటి వ్యాధులైనా ఉంటే వాటిని నియంత్రించడం  ఆహారంలో ఆకుకూరలు, పొట్లకాయ, బీరకాయ, పనసపొట్టు, చిక్కుడు జాతి కూరలు, అరటిదవ్వ తీసుకోవడం, బార్లీ ద్రవాలు ఎక్కువగా తాగడం  రోజూ ఉదయం లేవగానే ఒక లీటరు నీళ్లను తాగడం (గమనిక : గుండె, మూత్రపిండాల జబ్బులు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగకూడదు).



ఔషధాలు: మృదువుగా మల విసర్జన అయ్యేలా చూసేవి... కరక్కాయ చూర్ణం (హరీతకీ) : 3 నుంచి 5 గ్రాములు నీళ్లతో రాత్రి సేవించాలి.  త్రిఫలాచూర్ణ (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ): 5 నుంచి 10 గ్రాములు వరకు నీళ్లతో కషాయం కాచుకొని 30 మి.లీ. రాత్రిపూట తాగాలి.  ఆరగ్వధ (రేల) గుజ్జు; సునాముఖి ఆకు కూడా విరేచనం మృదువుగా అయ్యేలా చూసేవే. వీటిని వాడాలంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. తీక్ష్ణరేచకాలు : హేరండ (ఆముదం), దంతి (నేపాళం)... వీటిని కూడా వైద్యల పర్యవేక్షణలోనే వాడాలి. ‘అభయాదిమోదక’ మాత్రలు బజారులో లభిస్తాయి. వీటిని 1 మాత్ర రాత్రి నీళ్లతో తీసుకోవాలి. స్నిగ్ధం ఉండటం రేచకాలు (మలవిసర్జన మృదువుగా, సాఫీగా అయ్యేవి... ధాత్రీతైలం, హింగుత్రిగుణతైలం (మోతాదు 2 చెంచాలు, పాలతో రాత్రి).

 

సూచన: మృదురేచకాలలో ఏదైనా ఒక్కటి తగిన మోతాదులో వాడుకోవచ్చు. అయితే విరేచనం కోసం కేవలం ఔషధాలపైన ఆధారపడటం శాస్త్రీయం కాదు.

 

డాక్టర్ వృద్ధుల

లక్ష్మీనరసింహశాస్త్రి

ఆయుర్వేద నిపుణులు

సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్

 

 

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్

 

నా వయసు 48 ఏళ్లు. ఇటీవల నా బరువు అధికంగా పెరిగింది. దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్లి కొన్ని పరీక్షలు చేయించుకున్నాను. వీటిల్లో ఫ్యాటీలివర్ అని తేలింది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? దీని గురించి వివరించండి.

 - రామస్వామి, ఖమ్మం


కాలేయం కొవ్వుకు కోశాగారం లాంటిది. ఇది కొవ్వు పదార్థాలను గ్రహించి, వాటిని శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా... కాలేయంలోని కొవ్వు వినియోగం కాకుండా, అందులోనే చేరుతూ ఉంటుంది. ఇదే క్రమంగా ఫ్యాటీలివర్‌కు దారితీస్తుంది. ఇది రెండు కారణాల వల్ల వస్తుంది. మొదటిది మద్యం ఎక్కువగా తీసుకోవడం, రెండోది మద్యం అలవాటుకు సంబంధించని కారణాలు. ఇందులో స్థూలకాయం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, హైపోథైరాయిడిజమ్ వంటివీ వస్తాయి. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్య ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కేవలం అల్ట్రాసౌండ్ స్కానింగ్ (కడుపు భాగం), కాలేయ సంబంధ పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతుంది. ఇలా ఆ పరీక్షల ద్వారా కాలేయ కణాల్లో కొవ్వు చేరిందని తెలుసుకున్నప్పుడు దాన్ని ఫ్యాటీలివర్‌గా గుర్తిస్తారు. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్యవల్ల 80 శాతం మందిలో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే 20 శాతం మందిలో అది రెండో దశకు చేరుకోవచ్చు. ప్రధానంగా ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అనే సమస్యకు కారణమై... గుండెకు, మెదడుకు సంబంధించిన ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. మీకు ఫ్యాటీలివర్ ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకొని, దానికి కారణాలను కనుగొని, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. మామూలుగా మధ్యవయసులో ఉన్నవారికి చాలా పరిమితమైన కొవ్వులు సరిపోతాయి. ఇక జంతుసంబంధమైన కొవ్వులను చాలా తక్కువ మోతాదులో  తీసుకోవాలి. మీరు ఒకసారి మీకు దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను ఒకసారి కలవండి.

 

డాక్టర్ భవానీరాజు

సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్

కేర్ హాస్పిటల్స్

బంజారాహిల్స్

హైదరాబాద్

 

 

న్యూరో కౌన్సెలింగ్


 

మా బాబు వయసు 12 ఏళ్లు. వాడు మూడేళ్ల వయసున్నప్పుడు ఆటలాడుతూ ఒకసారి కిందపడ్డాడు. అప్పుడు వాడికి తలమీద గాయం తగిలింది. కానీ అప్పుడు ఏమీ కాలేదు. బొడిపెలాగ  వాపు వచ్చి కొన్ని రోజుల తర్వాత అదే తగ్గిపోయింది. అయితే ఈమధ్య మా బాబు ఒకసారి స్కూల్లో ఫిట్స్ వచ్చి కళ్లు తిరిగి పడిపోయాడు. అప్పటినుంచీ అప్పుడప్పుడూ అలా వస్తూనే ఉంది. మా ఇంటి దగ్గర్లోకి డాక్టర్‌కి చూపెట్టాం. ఆయన కొన్ని మందులు రాసిచ్చారు. అప్పటికి తగ్గిపోయింది గానీ మాకు భయంగా ఉంది. వాడికేమీ గుర్తుండడం లేదు. చిన్నప్పుడు తలకు తగిలిన గాయం వల్ల మా బాబు మెదడుకు ఏమైనా హాని జరిగిందేమోనని మాకు భయంగా ఉంది. దయచేసి మా బాబు సమస్యకు తగిన పరిష్కారం చూపండి.

 - లక్ష్మి, తిరుపతి


సాధారణంగా చిన్నవయసులో ఆటలాడుతున్నప్పుడు అందరూ కింద పడుతూనే ఉంటాం. శరీరానికి చాలా చోట్ల దెబ్బలు తగలడం, తగ్గిపోవడం జరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే పైకి కనిపించని దెబ్బలు శరీరంలో చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా తలకు చిన్నతనంలో ఎప్పుడైనా గాయం తగలితే ఎంతమాత్రమూ అశ్రద్ధ చేయకూడదు. వయసు పెరుగుతున్నకొద్దీ తలలో గాయం కూడా పెరుగుతుంటుంది. మీరు వివరించినట్లు మీ అబ్బాయికి చిన్నప్పడు ఆటల సందర్భంలో తగిలిన గాయం వల్లనే ఫిట్స్ రావడం, కళ్లు తిరిగి పడిపోవడం జరుగుతుండవచ్చు. మెదడులోని విద్యుత్ ప్రభావం వల్ల ఫిట్స్‌లా వచ్చి బయటపడుతుండవచ్చు. అయితే అది ఏస్థాయిలో ఉంది, దాని పరిమాణం ఎంత అనేది సీటీ స్కాన్, ఎమ్మారై లాంటి కొత్తగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్యపరిజ్ఞానంతో కనిపెట్టగలం. ఆ పరీక్షల తర్వాతనే చికిత్సా ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నిష్ణాతులైన వైద్యులతో మీ బాబు సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. కాబట్టి అతడి విషయంలో ఎలాంటి భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు. కానీ మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే మీ బాబుకి తగిన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సను అందించండి. అతడు పూర్తిగా కోలుకుంటాడు.



డాక్టర్ పి. రంగనాథమ్

సీనియర్ న్యూరోసర్జన్

యశోద హాస్పిటల్స్

సోమాజీగూడ

హైదరాబాద్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top